
బీజేపీలోకి క్రిస్టియన్ ఫాదర్లు చేరారంటే ఎంత మతసమరస్యం బీజేపీలో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రిష్టియన్ ఫాదర్ల చేరిక సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మతం వ్యక్తిగతమైంది.. దేశ ప్రధానమైంది.. ఏ మతాన్ని ఆరాధించినా దేశాన్ని గౌరవించే ఆలోచనతో ప్రేరణ కలిగించే పార్టీ భారతీయ జనతా పార్టీ’ అని సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ పార్టీ కార్యాలయంలో తాడేపల్లికి చెందిన లింగాల రత్నం ఆధ్వర్యంలో క్రిస్టియన్ ఫాస్టర్లు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మతం మారిన క్రైస్తవులు కూడా వివాహాది సందర్భాల్లో భారతీయ సంప్రదాయాలనే అనుసరిస్తున్నారని చెప్పారు. దేశం ఇలాంటి అద్భుత ఆలోచనతో నడుస్తోందని.. అందుకే విదేశీ క్రైస్తవులు బైబిల్ ను కాళ్ల దగ్గర పెట్టుకుంటే మనం హృదయం దగ్గర ఉంచుతామని ఉదాహరణగా పేర్కొన్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో కానుకలతో ప్రార్థనా నిర్మాణాలు జరగాలని.. ప్రభుత్వ సొమ్ముతో కాదన్నారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడారు. దేశం తర్వాతే మతం.. ఈ అంశాన్ని బీజేపీ మాత్రమే చెబుతోందని అన్నారు. మిగతా పార్టీలు చెప్పవన్నారు. ఆ పార్టీలకు ఓటు బ్యాంకు రాజకీయాలు కావాలని అన్నారు.
బీజేపీ దేశ హితం కోరి.. దేశభక్తిని ప్రేరేపించే వ్యవస్థగా 1981లో ఏర్పడిందన్నారు. ఈ ఆలోచనతో నడుస్తూ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని తెలిపారు. బీజేపీ దేశానికి పనిచేసే వ్యవస్థగా పేర్కొన్నారు.
హిందువులకు మత గ్రంథం లేదని.. ఒక దేవుడు లేడు అని.. ఒక దేవుడిని ఆరాధించాలనే నియంత్రణ లేదన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణం అనుసరిస్తున్న హిందుత్వం ఒక జీవన విధానంగా సోము వీర్రాజు వివరించారు.