
Pawan Kalyan- MLC Elections: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అధికార పార్టీకి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుపొంది సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ సైతం గట్టిగానే పోరాడుతోంది. ఎలాగైనా గెలుపొందాలని భావిస్తోంది. భారతీయ జనతా పార్టీ సైతం సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అటు వామపక్షాలు సైతం పూర్వ వైభవానికి తహతహలాడుతున్నాయి.ట్రేడ్ యూనియన్స్ తో గట్టి ప్రయత్నలే చేస్తున్నాయి. అయితే ఇటువంటి తరుణంలో పోటీలో లేని జనసేన వాయిసే గట్టిగా వినిపిస్తుంది. బీజేపీ అభ్యర్థి మాధవ్ అయితే.. తాను బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థినని చెబుతున్నారు. టీటీపీ సైతం జనసేనపేరును బాగానే వాడేస్తోంది.
వాస్తవానికి జనసేన అధ్యక్షుడు పవన్ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. వచ్చే ఎన్నికల్లో పవన్ అటు టీడీపీ, ఇటు బీజేపీతో కలిసి నడవనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అప్పుడే అధికార వైసీపీని గద్దె దించగలమని భావిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో కలిసి నడిచేందుకు ఇష్టపడడం లేదు. అయితే వచ్చే ఎన్నికల ముంగిట అక్కడి పరిస్థితులను అనుసరించి పొత్తుల వ్యూహం సిద్ధం చేసుకోవాలని పవన్ భావిస్తున్నారు. ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో పవన్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. జనసేన పోటీ చేయకపోవడంతో ఎవరికో ఒకరికి మద్దతు తెలపాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. కానీ తటస్థంగా ఉండేందుకే పవన్ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

అయితే పవన్ మద్దతు కోసం అటు బీజేపీ, ఇటు టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఉత్తరాంధ్రలో పవన్ అభిమానుల ఎక్కువ. ప్రధానంగా యూత్, విద్యార్థులు జనసేనలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. దీంతో పవన్ సపోర్టు ఎవరికుంటే వారికే మొదటి ప్రాధాన్యం ఓట్లు దక్కే అవకాశం ఉంది. అందుకే పవన్ కోసం బీజేపీ అన్నివిధాలా ప్రయత్నించింది. కానీ పవన్ పెద్దగా మొగ్గుచూపలేదని తెలుస్తోంది. అటు టీడీపీ సైతం పక్కా వ్యూహంతో వెళుతోంది. తొలుత ఓ మహిళా అభ్యర్థిని ఎంపిక చేసినా.. అనూహ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన అధ్యాపకుడు వేపాడ చిరంజీవిరావునుబరిలో దించింది. జనసేనతో పాటు కాపు సామాజికవర్గం మొగ్గుచూపుతుందని భావిస్తోంది. అయితే రెండు పార్టీలకు పవన్ బహిరంగంగా మద్దతు తెలిపే చాన్స్ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.