
Amaravati: రాజధాని కేసులో వైసీపీ సర్కారుకు మరోసారి నిరాశే ఎదురైంది. వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని కోరుతున్నప్రభుత్వ ఆశలను అత్యున్నత న్యాయస్థానం నీరుగార్చింది. కేసు విచారణను మరో నెల రోజుల పాటు వాయిదా వేసింది. దీంతో రాజధాని ఇష్యూ ఇప్పట్లో తేలేలా కనిపించకపోయేసరికి ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. జనవరి 31న అమరావతికి వ్యతిరేకంగా.. మూడు రాజధానులకు అనుకూలంగా కోర్టులో తీర్పు వస్తుందని ప్రభుత్వం భావించింది. కానీదానిని ఫిబ్రవరి 23కు న్యాయమూర్తులు వాయిదా వేశారు. అయితే ఆ రోజుకు లిస్ట్ కాలేదు. ఇప్పుడు అత్యవసర విచారణ చేపట్టాలన్న ప్రభుత్వ న్యాయవాదుల విన్నపాన్ని మన్నించలేదు. మరో నెల రోజుల తరువాతే విచారిస్తామని చెప్పేసరికి జగన్ సర్కారుకు ఝలక్ తగిలింది.
ఉగాదికి అటు ఇటుగా విశాఖ రాజధాని నుంచి పాలన మొదలవుతుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ వంటి వారు ప్రకటిస్తూ వచ్చారు. అటు సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు ప్రారంభించి.. విశాఖ నుంచి పాలనను స్టార్ట్ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. విశాఖలో రెండురోజులు..అమరావతిలో నాలుగు రోజులు గడుపుతారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై బడ్జెట్ సమావేశాల్లో సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని టాక్ నడుస్తోంది. మరోవైపు విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మూడు రాజధానులు తమ అభిమతం కాదని.. అదొక టెక్నికల్ ఇష్యూ అని.. విశాఖ ఏకైక రాజధానే తమ ప్రభుత్వ అభిమతమని ఆర్థిక మంత్రి బుగ్గన పారిశ్రామికవేత్తలను సమ్మిట్ కు ఆహ్వానించే క్రమంలో వ్యాఖ్యానించారు. అంటే కోర్టులో అనుకూలమైన తీర్పు వస్తుందని భావించి విశాఖ క్యాంప్ ఆఫీసు హడావుడి చేశారు. కానీ విచారణలో ఎడతెగని జాప్యం జరుగుతోంది.

అమరావతి రాజధానికి అనుకూలంగా హైకోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించింది. రాజధానిని అభివృద్ధి చేయాలని ఆదేశాలిచ్చింది. కానీ దానిపై కౌంటర్ దాఖలు చేయకుండా వచ్చిన జగన్ సర్కారు కావాలనే జాప్యం చేస్తూ వచ్చింది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని..వీలైనంత త్వరగా కేసు విచారణను పూర్తిచేయాలని కోరుతూ వస్తోంది. అయితే నాటి వైసీపీ సర్కారు చర్యలనే అమరావతిరైతులు, రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నారు. కౌంటర్ల దాఖలుకు, వివరాలు పొందుపరిచేందుకు సమయం కావాలని అడుగుతున్నారు. దీంతో కేసు విచారణలో జాప్యం పెరుగుతోంది. దీనిపై వైసీపీ ఎంపీ, లాయర్ నిరంజన్ రెడ్డి చురుగ్గా పావులు కదుపుతున్నారు. స్టే కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన వ్యవహార శైలి ఇప్పటికేకోర్టులో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇప్పుడు కేంద్రం కూడా అమరావతికి అనుకూలంగానే కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. గత ప్రభుత్వం అమరావతి రాజధానిని చట్టబద్ధంగా ఏర్పాటుచేసినట్టు స్పష్టం చేసింది. దీంతో జగన్ సర్కారు నోట్లో పచ్చి వెలక్కాయపడినట్టయ్యింది. మరో వైపు ఉగాది సమీపిస్తోంది. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కూడా దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జగన్ ప్రకటనపైనే అందరి దృష్టిపడింది. విశాఖ క్యాంప్ ఆఫీసు ఏర్పాటు విషయంలో ఎటువంటి ప్రకటన చేస్తారోనని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.