Mushtaq Bukhari : జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీకి మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టార్ క్యాంపెయినర్ అవతారం ఎత్తారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జమ్మూ కాశ్మీర్ లోనే మకాం వేశారు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ 75 సంవత్సరాల ముస్తాక్ బుఖారీ షెడ్యూల్ తెగ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సురాన్ కోట్ నుంచి రంగంలోకి దింపింది. ఈ క్రమంలో భారత జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ముస్తాక్ బుఖారీ ని మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలతో పోల్చారు.. జమ్మూ కాశ్మీర్ లో పహరి వర్గానికి స్వేచ్ఛ తీసుకురావడంలో ఆయన కృషి చేశారు. ఇటీవల బిజెపి జమ్మూ కాశ్మీర్ శాఖ అధ్యక్షుడు రవీందర్ రైనా సమక్షంలో ముస్తాక్ బుఖారీ బిజెపిలో చేరారు. ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు.
ఎవరీ ముస్తాక్ బుఖారీ
ముస్తాక్ బుఖారీ 75 సంవత్సరాల వయసు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని షెడ్యూల్ తెగ రిజర్వు డ్ నియోజకవర్గం అయిన సురన్ కోట్ నుంచి బిజెపి తరఫున ముస్తాక్ బుఖారీ పోటీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో భారత జనతా పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న సమయంలో తరుణ్ చుగ్ ను ముస్తాక్ బుఖారీ ఆకర్షించారు. ఆయన గురించి తరుణ్ చుగ్ ఆరా తీయగా.. ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. పహరి తెగకు ఎస్టీ హోదా కల్పించాలని ముస్తాక్ బుఖారీ కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అతడు చేస్తున్న పోరాటం నచ్చి తరుణ్ చుగ్.. జాతీయ నాయకత్వంతో మాట్లాడి ముస్తాక్ బుఖారీ బిజెపిలో చేర్చుకున్నారు. ఇటీవల సురన్ కోట్ లో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో ముస్తాక్ బుఖారీ బిజెపిలో చేరారు. ఆ సమయంలో ఆయన వెంట తరుణ్ చుగ్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ” మహాత్మా గాంధీ చేసిన పని ఎప్పటికీ మరువలేనిది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలు ఆయనను మరవలేరు. ఇక్కడి గిరిజన సమాజానికి చెందిన ముస్తాక్ బుఖారీ మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా లాగా తమ జాతికి స్వాతంత్రం తీసుకురావడానికి కృషి చేస్తున్నారని” తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు.
నేషనల్ కాన్ఫరెన్స్ తో నాలుగు దశాబ్దాల అనుబంధం
ముస్తాక్ బుఖారీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగారు. అయితే పహరి తెగకు ఎస్టి హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఫరూక్ అబ్దుల్లాతో ముస్తాక్ బుఖారీ విభేదాలు మొదలయ్యాయి. దీంతో 2022 ఫిబ్రవరిలో ముస్తాక్ బుఖారీ పార్టీ నుంచి బయటికి వచ్చారు. పహరి తెగకు ఎస్టి హోదా కల్పిస్తేనే బిజెపిలో చేరతానని ఆ పార్టీ పెద్దలకు హామీ ఇచ్చారు. బిజెపి పెద్దలు దానికి ఓకే చెప్పడంతో ముస్తాక్ బుఖారీ బిజెపిలో చేరారు. పూంచ్ జిల్లాలోని సురన్ కోట్ నియోజకవర్గం నుంచి ముస్తాక్ బుఖారీ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఫరూక్ అబ్దుల్లాకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ముస్లిం సమాజం ముస్తాక్ బుఖారీని “పీర్ సాహెబ్” అని పిలుస్తుంది. జమ్ము కాశ్మీర్లోని రాజౌరీ, పూంచ్, బారాముల్లా, కుప్వారా జిల్లాలో పహరి తెగకు చెందినవారు దాదాపు 12.5 లక్షల మంది ఉన్నారు. సెప్టెంబర్ 25న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ జరగనుంది.. సురన్ కోట్ స్థానంలోనూ అదేరోజు ఎన్నికలు జరుగుతాయి.