‘నాక్కెంచెం తిక్కుంది.. దానికో లేక్కుంది..’ అని అంటాడు గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్. ‘ఏ పనిచేసినా దానికో లెక్కుంది..’ అని అంటున్నారు సీఎం కేసీఆర్. రాజకీయంలో ఆయనకు ఆయనే సాటి. ప్రతిపక్షాల నోళ్లకు ఎలా లాక్ వేయాలో తెలిసిన ఘనాపాటి. ఏ పనిని ఎలా అమలు చేయాలో బాగా తెలుసు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్‌ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళా అదే జరిగితే ఇది సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి.
అక్టోబర్‌లో బీహార్ రాష్ట్రంతో జరిగే ఎలక్షన్స్‌తోపాటు దుబ్బాక అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక జరుగుతుందనే ప్రచారం నడుస్తోంది. ఇక్కడి నుంచి ప్రతిపక్షాల క్యాండిడెట్లు ఇప్పటికే ప్రచారంలోకి దిగగా.. ఇంకా అధికార పార్టీ అనౌన్స్ చేయలేదు. ఇక్కడ నుంచి పోటీ చేయడానికి చాలా మంది ఉబలాటపడుతున్నా.. టికెట్ రేసులో మాత్రం ఇద్దరే ఉన్నట్లు కనిపిస్తోంది. వారిలో ఒకరు రామలింగరెడ్డి కుటుబసభ్యుడు అయితే.. మరొకరు మాజీ మంత్రి ముత్యంరెడ్డి కొడుకు. ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారం మేరకైతే అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత లేదా కొడుకు సతీష్‌రెడ్డిలలో ఎవరో ఒకరు కన్‌ఫాం అయ్యేలా కనిపిస్తోంది.
అయితే.. ఫ్యూచర్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని భార్య సుజాతకు కాకుండా కొడుకు సతీష్‌రెడ్డికి ప్రకటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. అభ్యర్థి ప్రకటనను సీఎం కేసీఆర్ సరికొత్త తీరులో ప్రకటిస్తారని చెబుతున్నారు. ఈ రోజు షురూ అయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోలిపేట సంతాప తీర్మానం సందర్భంగా చేసే ప్రసంగంలోనే అభ్యర్థి ఎవరన్న విషయాన్ని తెలియజేసేలా కేసీఆర్ ప్రసంగం ఉన్నట్లు తెలుస్తోంది. తన మాటతో దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న విషయంపై క్లారిటీ ఇచ్చేస్తారని సమాచారం.