https://oktelugu.com/

సోనియాకు పోటు: కాంగ్రెస్‌ పై మరో పిడుగు

‘సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలి. పీసీసీలకు మరిన్ని అధికారాలను అప్పగించాలి. పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. 6 నెలల్లో ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోండి. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమికి చాలా కారణాలున్నాయి. 2019 ఎన్నికలు జరిగి 14 నెలలు పూర్తయినా.. ఇప్పటికీ ఆ ఓటమిపై నిష్పక్షపాత సమీక్ష జరగలేదు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ల్లో ఎన్నికలు నిర్వహించాలి. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కూడిన దేశవ్యాప్త కూటమిని రూపొందించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించాలి. గతంలో […]

Written By: , Updated On : September 7, 2020 / 02:46 PM IST
Follow us on

‘సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలి. పీసీసీలకు మరిన్ని అధికారాలను అప్పగించాలి. పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. 6 నెలల్లో ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోండి. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమికి చాలా కారణాలున్నాయి. 2019 ఎన్నికలు జరిగి 14 నెలలు పూర్తయినా.. ఇప్పటికీ ఆ ఓటమిపై నిష్పక్షపాత సమీక్ష జరగలేదు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ల్లో ఎన్నికలు నిర్వహించాలి. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కూడిన దేశవ్యాప్త కూటమిని రూపొందించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించాలి. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న నేతలందరినీ కూడా ఈ వేదికలో భాగస్వామ్యులను చేయాలి’  అంటూ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌‌ నేతలు కాంగ్రెస్‌ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్‌లో సంచలనం సృష్టించిన ఈ లేఖలో పలువురు కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్‌ నేతలు సంతకాలు చేశారు. దీనిపైనే సోనియా, రాహుల్‌ ఫైర్‌‌ అయినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు మరోసారి బహిష్కృత నేతలు మరో లేఖ రాసి కాక పుట్టించారు. ‘కుటుంబ అనుబంధాలను దాటి ఆలోచించండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘నెహ్రూ, ఇందిర, రాజీవ్ కాంగ్రెస్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ నిర్మితమైంది. దేశంలో ప్రజాస్వామ్య పునాదులు కూడా వేశారు. కొంత కాలంగా పార్టీని నడుపుతున్న విధానాన్ని చూస్తుంటే సాధారణ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళాన్ని, నిరాశను కలిగిస్తోంది.’ అంటూ బహిష్కృత నేతలైన సంతోశ్ సింగ్, సత్యేదేవ్ త్రిపాఠి లేఖలో పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక విలువలు తగ్గిపోతున్న ఇలాంటి సమయంలో దేశానికి కాంగ్రెస్ అవసరం ఎంతో ఉందని, కాంగ్రెస్ సజీవంగా, ధృఢంగా ఉండాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

బహిరంగ వేదికలలో పార్టీని తప్పుపట్టడం, పార్టీపై విమర్శలు చేయడం, పార్టీ ఇమేజ్‌ను దెబ్బ తీయడం లాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ యూపీకి చెందిన పది మంది నేతలను అధిష్ఠానం బహిష్కరించింది. ఆ పది మందిలో సంతోశ్ సింగ్, సత్యేదేవ్ త్రిపాఠి నేతలు కూడా ఉన్నారు. వీరే తాజాగా ‘దయచేసి కుటుంబ అనుబంధాలకు అతీతంగా ఆలోచించండి. పార్టీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువలను పునరుద్ధరించండి. పరస్పర విశ్వాసాలను పార్టీలో పెంచండి’ అంటూ పేర్కొన్నారు.

ఇప్పటికే మొదటి లేఖతో గుస్సా మీదున్న కాంగ్రెస్‌ అధిష్టానం.. మరి ఈ లేఖతో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియకుండా ఉంది. బహిష్కృత నేతలే కదా అని లైట్‌ తీసుకుంటారా..? ఈ లేఖతో అయినా తేరుకుంటారా..? ఇప్పటికైనా పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి సారిస్తారా..? ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.