ట్విస్ట్
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వేలల్లో కరోనా కేసులు పెరుగుతుండగా పదుల సంఖ్యల్లో కోవిడ్ తో నిత్యం మరణాలు జరుగుతున్నాయి. మందులు.. ఆక్సిజన్ నిల్వలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నవేళ తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు.
కరోనా టైంలో కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతూ ప్రజలకు సేవలందిస్తున్న తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసైన్డ్ లైన్డ్ ను ఈటల రాజేందర్ ఆక్రమించుకున్నాడనే ఆరోపణలతో ఉన్నఫలంగా మంత్రి పదవీ నుంచి తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ క్యాబినెట్లో చాలా మంది మంత్రులపై భూదౌర్జన్యాలు.. అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఏనాడు పెద్దగా స్పందించని సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించడం వెనుక మతలబు ఏంటనే చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ ఉన్న విశేష అధికారాలతో ఎవరైనా క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసే అధికారం ఉంది.
తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తుండంతో సాక్షాత్ సీఎం కేసీఆర్.. ఆయన తనయుడు కేటీఆర్ కోవిడ్ బారిన పడ్డారు. కోవిడ్ కారణంగా సీఎం కేసీఆర్ హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఏకంగా ఆరోగ్య శాఖ మంత్రిని బర్తరఫ్ చేయడం వెనుక అంత్యరం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. సీఎం కేసీఆర్ నిజంగానే అవినీతి ఆరోపణల్లో భాగంగానే ఈటలపై చర్యలు తీసుకున్నారా? లేదా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని పెద్దఎత్తున విమర్శలు వస్తున్న వేళ సీఎం కేసీఆర్ ఏకంగా ఆరోగ్యశాఖ మంత్రిని తప్పించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో కోవిడ్ కట్టడి విషయాలు పక్కదారి పట్టి రాజకీయాలపై చర్చ జరుగుతుంది. ఏదిఏమైనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించిన నాయకులు ఇలా రాజకీయాలకు పాల్పడుతుండటంపై అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.