https://oktelugu.com/

పరిషత్ వాయిదా: ఓడిందెవరు..? గెలిచిందెవరు? నష్టమెవరికి?

గత ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దిగిపోయాక జగన్ సర్కార్ ఊపిరి పీల్చుకుంది. ఆయన ఉండగా సీఎం జగన్ తో ఢీ అంటే ఢీ అన్నాడు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల వేళ ముచ్చెమటలు పట్టించాడు. అయితే ఆయన రిటైర్ అయ్యాక.. జగన్ కు సన్నిహిత అధికారి రిటైర్డ్ సీఎస్ నీలం సాహ్ని ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్ అయ్యారు. ఆమె బాధ్యతలు తీసుకున్న రోజునే ముందు వెనుక ఆలోచించకుండా జగన్ సర్కార్ చెప్పిందని పరిషత్ నోటిఫికేషన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 6, 2021 6:01 pm
    Follow us on

    గత ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దిగిపోయాక జగన్ సర్కార్ ఊపిరి పీల్చుకుంది. ఆయన ఉండగా సీఎం జగన్ తో ఢీ అంటే ఢీ అన్నాడు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల వేళ ముచ్చెమటలు పట్టించాడు. అయితే ఆయన రిటైర్ అయ్యాక.. జగన్ కు సన్నిహిత అధికారి రిటైర్డ్ సీఎస్ నీలం సాహ్ని ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్ అయ్యారు. ఆమె బాధ్యతలు తీసుకున్న రోజునే ముందు వెనుక ఆలోచించకుండా జగన్ సర్కార్ చెప్పిందని పరిషత్ నోటిఫికేషన్ జారీ చేశారనే ప్రచారం అధికార వర్గాల్లో ఉంది. నాడు గత మార్చిలో కరోనా వేళ ఆగిపోయిన నాటి నుంచే ఎన్నికల నిర్వహణకు ఓకే చెప్పడం దుమారం రేపింది. దీనిపై టీడీపీ విమర్శలు చేసినా వెనక్కి తగ్గలేదు. నిబంధనలు తోసిరాజని జగన్ సర్కార్ మెప్పు కోసం కనీసం రూల్స్ కూడా పాటించకుండా ఈనెల 8న పరిషత్ ఎన్నికల పోలింగ్ అని ప్రకటించడం చర్చనీయాంశమైంది. కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు గ్రామాల్లో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు.

    అయితే ఇప్పుడు హైకోర్టులో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఏడాది కింద వేసిన నామినేషన్లతో ఇప్పుడు కొత్త నామినేషన్లు తీసుకోకుండా జగన్ సర్కార్ ఎన్నికలు నిర్వహిస్తుండడంపై టీడీపీ సహా కొంత మంది కొత్త అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. దీంతో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది.

    *ఎస్ఈసీ కీలుబొమ్మనా?
    ఇక గమనించాల్సింది ఏంటంటే.. కనీసం పరిషత్ ఎన్నికల విషయంలో కసరత్తు చేయకుండా.. రూల్స్ పాటించకుండా జగన్ సర్కార్ చెప్పినట్టు ఆగమేఘాల మీద షెడ్యూల్ విడుదల చేసి నీలం సాహ్ని అభాసుపాలయ్యారు. ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేసిన ఆమెకు ఇలా చేస్తే హైకోర్టుల్లో ఎదురుదెబ్బలు తప్పవని తెలిసి కూడా జగన్ సర్కార్ మెప్పు కోసం ఇలా పాకులాడడమే ఇప్పుడు అధికారవర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అంటే దీనర్థం ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల కమిషనర్ ను ఏపీ ప్రభుత్వమే దిశానిర్ధేశం చేస్తోందా? వీరికి కనీసం అధికారాలు లేవా? సర్వస్వతంత్ర వ్యవస్థ తన రాజ్యాంగ అధికారాలు, స్వతంత్రను కోల్పోయాయా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

    *ఎన్నికల వాయిదాతో ప్రజాధనం వృథా
    ఎల్లుండే ఏపీలో పరిషత్ ఎన్నికలకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కోట్లు ఖర్చు చేసి బ్యాలెట్ పేపర్లు సిద్దం చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసింది. అధికారులు, ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా చేశారు. ఇప్పుడు ఎన్నికల వాయిదాతో ఈ ఖర్చు ఎవరు భరించాలి? మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఏపీ సర్కార్ కు ఇది భారం. అంతిమంగా ఈ ఖర్చు ప్రజలపైనే పడుతోంది. కోట్ల నిధులు బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

    *చంద్రబాబుకు ముందే తెలుసా?
    ఆగమాగం.. జగన్నాథం అన్నట్టుగా జగన్ సర్కార్ పరిషత్ ఎన్నికలను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం చూసే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికలు కోర్టులో నిలబడవని తెలిసే చంద్రబాబు టీడీపీ పోటీచేయకుండా బహిష్కరించారని.. ఇప్పుడు హైకోర్టు వాయిదా వేయడంతో ఎన్నికలు మళ్లీ మొదటి నుంచి నిర్వహిస్తే టీడీపీ పోటీచేస్తుందని చెబుతున్నారు. చంద్రబాబు ఎన్నికలు బహిష్కరించి ఇప్పుడు ప్రజల్లో హీరోగా మారిపోయాడని.. జగన్ సర్కార్ అభాసుపాలైందని అంటున్నారు.

    అంతిమంగా ఈ ఏపీ పరిషత్ ఎన్నికల సంగ్రామంలో జగన్ సర్కార్ తప్పటడుగులు వేసి ఓడిపోయింది. జగన్ సర్కార్ మాట విని ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని అభాసుపాలైంది. ఇక చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందే సర్దుకొని ఎన్నికలు బహిష్కరించి రాజకీయంగా గెలిచారనే చెప్పొచ్చు. ఎన్నికలు జరిగే వేళ రద్దు కావడంతో ఈ భారం మాత్రం ప్రజల నెత్తిన పడింది. రాజకీయ నాయకుల తప్పటడుగులు ప్రజలకు శాపంగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

    -నరేశ్