Uddanam: ఉద్దానం… ఈ మాట చెబితే ముందుగా గుర్తుకొచ్చేది కిడ్నీ మహమ్మారి. దశాబ్దాలుగా వేధిస్తోంది ఈ రోగం. ఉద్దానం ప్రజలను కబళిస్తోంది. ఉన్న జనాభాలో సగం మంది కిడ్నీ బాధితులే. అసలు ఈ వ్యాధి మూలం ఏంటి? ఎలా వస్తోంది? ఇంతలా ఎందుకు వ్యాప్తి చెందుతుంది? అన్న విషయాలపై క్లారిటీ లేదు. ఉద్దానంలో జీడి, కొబ్బరి పై ప్రయోగించే రసాయనాలు మూలంగా వ్యాధి ప్రబలిందని ఒకరు.. ఇక్కడ భూగర్భ జలాలు కలుషితం కావడం వ్యాధికి కారణమని మరొకరు.. సముద్రం చెంతనే ఉండడం కారణమని ఇంకొకరు.. ఇలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారే తప్ప.. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి.. వ్యాధి మూలాలు మాత్రం కనుగొనలేక పోతున్నారు.
దశాబ్దాలుగా కిడ్నీ మహమ్మారి ఉద్దానం ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో కిడ్నీ బాధితులు చనిపోయాడు అన్న వార్త వెలుగులోకి వస్తోంది. అయితే దశాబ్దాలుగా ఈ సమస్య ఉన్నా.. ప్రభుత్వాలను కదిలించేలా.. కిడ్నీ బాధితుల సమస్య సత్వరమని చాటి చెప్పింది మాత్రం పవన్ కళ్యాణ్. టిడిపి ప్రభుత్వ హయాంలో మిత్రపక్షంగా ఉన్న పవన్.. ఉద్దానం ప్రాంతాన్ని పర్యటించి అక్కడ ప్రజల జీవనస్థితిగతులను స్వయంగా తెలుసుకున్నారు. కిడ్నీ మహమ్మారి గురించి తెలుసుకొని చలించిపోయారు. దీనిపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు అందించారు. ప్రభుత్వాల్లో కదలిక తీసుకొచ్చారు. ఆయన పోరాట పుణ్యమే శుద్ధ జలాల ప్లాంట్లు, కిడ్నీ బాధితులకు పింఛన్లు. పవన్ విజ్ఞప్తి మేరకు.. రూ.2500 చొప్పున పింఛన్లు మంజూరు చేశారు. డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కిడ్నీ వ్యాధికి భూగర్భ జలాలు కలుషితం కావడమే ఒక కారణమని ఒక అధ్యయనం తేల్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో రూ.1900 కోట్ల వ్యయంతో ఉద్దానం ప్రాంతానికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. తొలివిడతగా రూ. 468 కోట్లు ఖర్చు చేసింది. ఇంతలో ప్రభుత్వం మారింది. అయితే అదే ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న జలజీవన్ మిషన్ నిధులు 50 శాతం… రాష్ట్ర వాటా గా నా పాటు నుంచి 50% సమకూర్చి.. మొత్తం రూ. 700 కోట్ల వ్యయంతో ఉద్దానం సుజల ధార ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే ఇందులో సగం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా.. క్రెడిట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే కొట్టేసింది.
కిడ్నీ రీసెర్చ్ కేంద్రం తో పాటు ఆసుపత్రి విషయంలో సైతం గత ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పవన్ ఒత్తిడి మేరకు చంద్రబాబు సర్కార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. రూ. 50 కోట్లు మంజూరు చేసింది. ఎందుకు సంబంధించి స్థలం కూడా కేటాయించారు. ఆ తరువాత ప్రభుత్వం మారింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం తో పాటు ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ ప్రజారోగ్యం విషయంలో.. అత్యవసర సేవలుగా భావిస్తున్న వీటి నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరిగింది. సుమారు ఐదేళ్లపాటు నిర్మాణ ప్రక్రియ కొనసాగింది. ఇప్పటికీ చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా బయటకు రంగులు వేశారు. లోపల నిర్మాణ పనులు చాలా వరకు జరగాల్సి ఉంది. అత్యాధునిక యంత్రాలు, పరికరాలు సైతం అందుబాటులోకి రాలేదు. వైద్య నిపుణులు, సిబ్బంది నియామకం జరగలేదు. వీటన్నింటిపై స్పష్టత రాకుండానే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తో పాటు ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధపడుతుండడం.. ముమ్మాటికి రాజకీయ లబ్ధి కోసమేనని తెలుస్తోంది. రీసెర్చ్ అంటేనే అధ్యయనం. దానికి నిపుణులు అవసరం. వివిధ అంతర్జాతీయ యూనివర్సిటీలు, అధ్యయన సంస్థలు రీసెర్చ్ చేశాయి. కానీ వ్యాధి మూలాలు కనుగొనలేకపోయాయి. ఇప్పుడు కేవలం భవనం నిర్మించి.. నిపుణుల నియామకం మరిస్తే మాత్రం అసలు లక్ష్యం దెబ్బతింటుంది.