వైసీపీలో రఘురామ వ్యవహారం ముదురుతోంది. రోజురోజుకు ప్రభుత్వానికి రఘురామకు మధ్య దూరం పెరుగుతోంది. ప్రభుత్వంపై రోజు లేఖలు సంధిస్తూ ఇరుకున పెడుతుండడంతో పార్టీ అభాసుపాలవుతోంది. ఎలాగైనా ఆయనను కట్టడి చేయాలని భావిస్తున్నా వారి ప్రయోగాలు ప్రయోజనం ఇవ్వడం లేదు. ఫలితంగా ప్రభుత్వంపై మచ్చ పడుతూ నిత్యం ఇబ్బందులు పడుతున్నారు . ఏదో ఒక సమస్యపై లేఖలు రాస్తూ పలు విధాలుగా సమస్యలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోకపోవడంతో వైసీపీ కథ రసకందాయంలో పడుతోంది.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల తర్వాత రఘురామ ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించారు. దీంతో రెబల్ గా మారిపోయారు. వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద అంశాల్ని ప్రస్తావించడం మొదలుపెట్టారు. టీటీడీ భూములు, ఏపీలో ఆంగ్ల మాధ్యమం అమలుతో జరిగే నష్టాలు, టీటీడీ బోర్డు వ్యవహారం నిరంతరంగా కొనసాగుతోంది. మొదట్లో రఘురామను పట్టించుకోని వైసీపీ తరువాత రఘురామపై వేటు వేయాలని స్పీకర్ ను కోరింది.
ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష నాయకుడు రఘురామనా? చంద్రబాబా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక అంశంలో ప్రభుత్వంపై ఎధురుదాడి చేయడంలో రఘురామ బిజీ అయిపోయారు.దీంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రఘురామను ఎలా కట్టడి చేయాలో అర్థంకాని పరిస్థితి వైసీపీలో నెలకొంది. రఘురామ విపక్ష నేతగా మారారని పలువురు చెబుతున్నారు.
సీఎం జగన్, రఘురామ వ్యవహారంలో ఎవరికి లాభం అనే ప్రశ్న ఉదయిస్తోంది. జగన్ ను లక్ష్యంగా చేసుకుని రఘురామ రోజు చేస్తున్నపనులకు ప్రత్యక్షంగా, పరోక్షంగానో స్పందించాల్సిన అవసరం ఎదురవుతోంది. దీంతో చంద్రబాబు వల్ల కాని పని రఘురామ వల్ల అవుతోందని పలువురు చెబుతున్నారు. చంద్రబాబు ప్రశ్నలకు జవాబు చెప్పలేని ప్రభుత్వం రఘురామ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతోంది. రఘురామపై మరోమారు అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓంబిర్లాకు ఘాటుగా లేఖ రాయనుంది.
రఘురామరాజు సీఎం జగన్ మధ్య సాగుతున్న పోరు ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఎంపీ విజయసాయిరెడ్డి స్పీకర్ ఓం బిర్లాకు మరోమారు ఫిర్యాదు చేయనున్నారు. రఘురామ లేఖలపై నాయకులు నిత్యం స్పందిస్తున్నా రఘురామ మాత్రం తగ్గడం లేదు. 2024 ఎన్నికల నాటికి ఈ విషయంపై శుభం కార్డు పడుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.