
తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి తన ప్రభావాన్ని చూపెట్టాలని చూస్తున్నారు. అయితే ఈ రాజకీయం వెనుక ఒక నిర్మాత, ఒక దర్శకుడు ఉన్నారని సీనియర్ కమ్యూనిస్టు నేత, సీపీఐ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుపై ఆసక్తికర కామెంట్లు చేశారు. అన్నతో పడకపోవడంతో ఇక్కడకు వచ్చిందని కొందరు, కేసీఆర్ వ్యూహంలో భాగమేనని ఇంకొందరు చెబుతున్నారు. ఆమె వెనుక ఎవరున్నారో తేల్చుతానని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు నాటకాలు ఆడుతున్నారని ఘాటుగా స్పందించారు.
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ వెనుక ఉన్నది ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆరేనని అభిప్రాయపడ్డారు. చెల్లెలి పార్టీకి నిర్మాత జగన్, రచయిత, దర్శకుడు కేసీఆర్ అని నారాయణ పేర్కొన్నారు. ఆ ఇద్దరు లేకపోతే తెలంగాణలో ఎలా తిరుగుతుందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చేందుకు షర్మిలను రంగంలోకి దించారని అన్నారు.
జలవివాదం, జగన్ బెయిల్ రద్దు అంశాలపై కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రులు డ్రామాలు ఆపేస్తే జల వివాదం సమసిపోతుందని సూచించారు. ఇద్దరు సీఎంల డ్రామాలు బయటపెట్టాలని పేర్కొన్నారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని వివరించారు. రెబెల్ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ ను విచారించాలని కోరారు. అమిత్ షా ఉన్నంత కాలం జగన్ బెయిల్ రద్దు కాదని తెలిపారు. జగన్ కు అమిత్ షా అండదండలు ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కపట నాటకాలు ఆడుతున్నారని అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికపై కావాలనే దోబూచులాడుతున్నారని విమర్శించారు. మాట్లాడుకుంటే పోయే దాన్ని అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అనవసర పట్టింపులకు పోకుండా సామరస్యంగా పరిష్కిరించుకోవాలని సూచించారు. ఓట్ల కోసం అనవసర వివాదాలు తెస్తున్నారని చెప్పారు.