NTR successors : చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది నందమూరి కుటుంబ నామం. తనను కష్టాల నుంచి గట్టెక్కించే అపర సంజీవినిగా మార్చుకున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని స్వాధీనం చేసుకునే క్రమంలో ఆ కుటుంబాన్నే చంద్రబాబు వినియోగించుకున్నారు. అక్కడి నుంచి పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతిసారి నందమూరి నామస్మరణతోనే వాటిని అధిగమించగలిగారు. కానీ పవర్ ఎంజాయ్ చేసినప్పుడు, పదవులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆ కుటుంబాన్ని పక్కనపెడుతూ వచ్చారు. బావమరిది బాలయ్యని వియ్యంకుడిగా చేసుకొని ఆ కుటుంబాన్ని చెప్పుచేతల్లోపెట్టుకొని ఎంతలా ఆడుకోవాలో చంద్రబాబుకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు.
కుమారుల పిల్లలకు తప్పించి..
సాధరణంగా తాతకు వారసులు..కుమారుడు పిల్లలు. కానీ నందమూరి వారి విషయంలో మాత్రం అంతా రివర్స్. ఇక్కడ కుమార్తె పిల్లలే వారసులుగా కొనసాగుతుండడం విశేషం.ఈ విషయంలో చంద్రబాబు తిప్పినట్టుగా మరెవరూ చక్రం తిప్పలేరు. మామ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు ఓడిపోయేసరికి.. అదే మామ చాటుకు చేరారు. పార్టీపై పూర్తిపట్టు సాధించారు. నందమూరి కుటుంబాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని వారి సహకారంతోనే ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేశారు. అధికారాన్ని హస్తగతం చేసుకోలిగారు. నందమూరి వారసులను ఒక్కర్నీ రాజకీయంగా ఎదగనివ్వలేదు. వారందర్నీ బాబే సైడ్ ట్రాక్ పట్టించినట్టు ఉదంతాలు ఉన్నాయి. అటు పురందేశ్వరి కుటుంబం చంద్రబాబు నుంచి దూరమైన తరువాతే పదవులు అందుకోగలిగింది. పార్టీలో ఉంటే నందమూరి కుటుంబానికి పట్టిన గతే పట్టి ఉండేదన్న టాక్ అయితే మాత్రం ఉంది.
బాలక్రిష్ణతో సరిపెడుతున్నారు..
2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్క బాలకృష్ణ కు మాత్రమే ఎమ్మెల్యే పదవి తప్ప ఇంకేమి లేదు. టీడీపీ అధికారంలో ఉన్నకాలంలో హరికృష్ణ బ్రతికున్న కానీ ఏ పదవి ఇవ్వలేదు. తన కొడుకు లోకేష్ ను దొడ్డిదారిన మంత్రిని చేసుకొని ఆ సాకుతో బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వలేదు. 2018 ఎన్నికల్లో హరిక్రిష్ణ కుమార్తె సుహాసిని ఓడిపోతుందని తెలిసిన, ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆమెను కూకట్ పల్లి నుండి పోటీకి దించాడు బాబు.. హరికృష్ణ కూతురిని పోటీకి దించి అన్యాయం చేశాడంటూ అప్పటిలో కేసీఆర్ కూడా విమర్శలు చేశాడు. ఇక ఇప్పుడు అధికారం లేదు కాబట్టి పార్టీ పరంగా ఆంధ్రాలో ఒక పదవి, తెలంగాణాలో మరో పదవి నందమూరి వంశానికి ఇచ్చాడు. మళ్ళీ అధికారం వస్తే యధావిధిగా వాళ్ళని పక్కన పెట్టేస్తాడని బాబు నైజం తెలిసిన రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.
ఆ ఇద్దరికీ చెక్..
ఇప్పుడు ఎన్టీఆర్ జయంతి వేడుకలను రాజకీయంగా వర్కవుట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అది కూడా నందమూరి కుటుంబ వారసులకు చెక్ చెప్పేలా ప్లాన్ చేశారు. నాటి 1995 టీడీపీ ఎపిసోడ్ లో సహకరించారన్న ఆరోపణలున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను పిలిచారే తప్ప నందమూరి వారసులు తారక్, కళ్యాణ్ రామ్ లను పిలవలేదు. అయితే టీడీపీకి ఆశాజనకంగా ఉంటే మాత్రం నందమూరి కుటుంబం చంద్రబాబుకు గుర్తుకురాదు. అదే కష్టాల్లో ఉంటే మాత్రం ఆ కుటుంబం కోసం పడిగాపులు కాస్తుంటారు. అది చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. అందితే జుత్తు ..లేకుంటే కాలు అన్నమాట.