Homeజాతీయ వార్తలుManmohan Singh : మన్మోహన్ సింగ్ మౌన ముని.. అంతకుమించి సిగ్గరి.. కేం బ్రిడ్జిలో చదువుకుంటున్నప్పుడు...

Manmohan Singh : మన్మోహన్ సింగ్ మౌన ముని.. అంతకుమించి సిగ్గరి.. కేం బ్రిడ్జిలో చదువుకుంటున్నప్పుడు ఏం జరిగిందంటే?

Manmohan Singh : మన్మోహన్ సింగ్ ఎక్కువగా మాట్లాడరు. ఆయన విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. తన మేధావితనాన్ని చేతల ద్వారా మాత్రమే చూపిస్తారు. వ్యక్తిగతంగా ప్రచారాన్ని కోరుకోరు. ఆడంబరాన్ని ఇష్టపడరు. అట్టహాసాన్ని ఒప్పుకోరు. అందువల్లే ఆయన ప్రత్యేకంగా నిలిచారు.. ఆయన ఉన్నత చదువులు చదవడానికి లండన్ వెళ్లారు. కేవలం స్కాలర్ షిప్ ద్వారానే ఆయన చదువుకున్నారు. కేం బ్రిడ్జిలో చదువుకుంటున్న సమయంలో మన్మోహన్ ఎక్కడా లేని బిడియాన్ని ప్రదర్శించేవారు. ఎవరితోనో ఎక్కువగా మాట్లాడే వారు కాదు. ఆ విశ్వవిద్యాలయంలో చదివే వరకు ఆయన చన్నీళ్ల స్నానం చేసేవారు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ సర్దార్జీ(జుట్టు పొడవుగా ఉంటుంది. తలపాగా ధరిస్తారు) . అందువల్ల ఆయనకు జుట్టు పొడవుగా ఉండేది. విశ్వవిద్యాలయంలో వేడి నీళ్లు వస్తున్న సమయంలో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు స్నానం చేసేవాళ్లు. అయితే వారితో కలిసి స్నానం చేయడానికి మన్మోహన్ మొహమాట పడేవారు. తన తలపాగా తీస్తే పొడవాటి జుట్టు బయటపడుతుందని.. దాన్ని చూసి సహచర విద్యార్థులు హేళన చేస్తారని మన్మోహన్ సింగ్ భావించేవారు. సహచర విద్యార్థులు స్నానాలు చేసి వెళ్లిపోయిన తర్వాత.. మన్మోహన్ సింగ్ స్నానం చేసేవారు. అయితే అప్పటికి వేడి నీళ్లు రావడం ఆగిపోయేది. అంతటి శీతల దేశంలో.. చన్నీళ్లు మాత్రమే స్నానం చేసేవారు. ఏనాడు కూడా తన తోటి విద్యార్థుల ముందు తలపాగా తీయలేదు. తన పొడవాటి జుట్టును వారికి చూపించలేదు.

మౌనంగా ఉండేవారు..

మన్మోహన్ సింగ్ మొదటి నుంచి కూడా మితభాషి. ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోను తక్కువగా మాట్లాడుతుంటారు. అందువల్లే ఆయనను మౌనముని అని పిలుస్తుండేవారు. చదువు గురించి.. చదువు ప్రాముఖ్యం గురించి ప్రతి సభలో చెబుతుండేవారు. చదువుకుంటేనే విలువ వస్తుందని.. సమాజంలో గౌరవం పెరుగుతుందని.. చదువుకున్న వాళ్ల వల్లే దేశం ఆర్థికంగా ముందుకు సాగుతుందని చెప్పేవాళ్ళు.. అందువల్లే ఆయన ప్రధానమంత్రిగా పనిచేసిన కాలంలో పరిశోధనలను ప్రోత్సహించేవాళ్లు. ఆయనకున్న అధికార పరిధిలోనే విద్యకు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. అందువల్లే మన్మోహన్ సింగ్ ను విద్యాధికులు గౌరవిస్తుంటారు. ఆరాధిస్తుంటారు. ఏనాడు ఎవరి మీద మన్మోహన్ సింగ్ ద్వేష భావాన్ని చూపించలేదు. వ్యక్తిగత పనుల కోసం అధికారాన్ని ఉపయోగించుకోలేదు. చివరికి కుటుంబ సభ్యులను తన అధికార పరిధికి దూరంగా ఉంచారు. అందువల్లే ప్రధానమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేసినప్పటికీ.. పెద్దగా ఆస్తులు కూడబెట్టుకోలేదు. ఈనాటికి మన్మోహన్ సింగ్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న డిపాజిట్లు తప్ప.. పెద్దగా ఆస్తులు లేవు. అందుకే ఆయనను నిజాయితీపరుడైన రాజకీయవేత్త అని అంటుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version