Boyakonda Gangamma Temple : అమ్మవారి దర్శనానికి ఓ మహిళా భక్తురాలు వచ్చారు. అయితే ఇది గమనించని అర్చకులు, సిబ్బంది ఆలయానికి తాళం వేశారు. పొరపాటున జరిగిన ఈ ఘటనతో రాత్రంతా ఆ మహిళా భక్తురాలు ఆలయంలోనే ఉండి పోవాల్సి వచ్చింది. మరుసటి రోజు పారిశుద్ధ్య కార్మికురాలు గుర్తించి ఆలయ అధికారులకు సమాచారం అందించడంతో ఆమె బయటపడ్డారు. చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది ఈ విచిత్రమైన ఘటన. చౌడేపల్లి మండలం బోయకొండలో పురాతన గంగమ్మ ఆలయం ఉంది. ఇక్కడకు నిత్యం భక్తులు వస్తుంటారు. పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న సోమల మండలానికి చెందిన ఓ మహిళా భక్తురాలు అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆమె ఆలయంలో ఉండగానే గమనించని అర్చకులు, సిబ్బంది తలుపులకు తాళం వేశారు. దీంతో ఆ మహిళ ఆలయంలోనే రాత్రంతా గడపాల్సి వచ్చింది. అయితే ఎముకలు కొరికే చలిలో అవస్థలు పడినట్లు తెలుస్తోంది. అయితే దైవ సన్నిధిలో ఉండడంతో ఆమె ధైర్యంతో రాత్రంతా గడిపినట్లు చెబుతున్నారు.
* గుర్తించిన పారిశుద్ధ్య కార్మికురాలు
ఈ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. అమ్మవారి దర్శనానికి నిత్యం భక్తులు వస్తుంటారు. అమ్మవారు కనిపించడానికి వీలుగా క్యూలైన్లలో ఎత్తుగా చెక్కలు ఏర్పాటు చేశారు. ఆ చెక్కల కింద ఓ వ్యక్తి చేతులు ఉండడాన్ని ఉదయాన్నే పారిశుద్ధ్య కార్మికురాలు గమనించారు. వెంటనే ఆమె సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి సాయంతో చెక్కల కింద ఉన్న భక్తురాలు బయటపడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అటు తరువాత ఆలయ ఈవో ఏకాంబరానికి సమాచారం వెళ్లడంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళా భక్తురాలిని జాగ్రత్తగా ఇంటికి పంపించారు. ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. సిబ్బంది పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
* భక్తుల భద్రత ప్రశ్నార్ధకం
అయితే ఆలయంలో భక్తుల భద్రత ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఆలయంలో ఎవరైనా ఉన్నారా అని పరిశీలించిన తర్వాత తాళం వెయ్యాలి. కానీ అలా జరగలేదు. అయితే ఆలయ సి సి ఫుటేజ్ పరిశీలించగా.. మహిళా భక్తురాలు ఇరుక్కున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఆమె దివ్యాంగురాలని కూడా గుర్తించగలిగారు. ఆలయంలో రాత్రిపూట విధుల్లో ఉన్నవారు సైతం దీనిని గుర్తించలేకపోయారు. అందుకే వారిని బాధ్యులు చేస్తూ అపరాధ రుసుము విధిస్తామని తెలిపారు. ఇకనుంచి ఆలయంలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే తాళాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు.