Mudragada Padmanabham: ముద్రగడ పయనమెటు? వైసీపీనా..బీజేపీనా? లేకుంటే అనూహ్యంగా జనసేనలోకి వెళతారా? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ముద్రగడ ఉద్యమం చేయడం లేదు. నిన్నటికి నిన్న రైలు దహనం కేసు నుంచి విముక్తి లభించింది. గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులన్నింటినీ జగన్ సర్కారు ఎత్తివేసింది. ఇప్పుడు తాజాగా ఈ కేసు కూడా కొట్టి వేయడంతో ముద్రగడ ఫ్రీబర్డ్ అయ్యారు. ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరడమే ఉత్తమమని అనుచరులు సూచిస్తున్నారు. అయితే తనకు రాజకీయాపై ఆసక్తి లేదని చెబుతున్న ముద్రగడ.. కుమారుడికి లైన్ క్లీయర్ చేయాలని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏదో పార్టీలో చేరడం అనివార్యంగా మారింది.
మూడు దశాబ్దాలుగా ఉద్యమం..
మూడు దశాబ్దాలుగా కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగా ఉన్న ముద్రగడ పరోక్షంగా రాజకీయాలను శాసించగలిగారు. అదే సమయంలో ఉద్యమాన్ని కొన్ని పార్టీలకు అనుకూలంగా మార్చేశారన్న అపవాదును ఎదుర్కొన్నారు. వంగవీటి మోహన్ రంగా తరువాత కాపుల్లో అంతటి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ముద్రగడ దానిని నిలబెట్టుకోలేకపోయారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమాన్ని నిలిపివేసి అస్త్రసన్యాసం చేశారు. ఉన్నపళంగా విడిచిపెట్టి తనపని తాను చేసుకుంటున్నారు. వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకే ఉద్యమాన్ని నడిపారన్న అపవాదును మాత్రం తొలగించుకోలేకపోయారు.
చంద్రబాబుతో ఫైట్..
కోట్ల విజయభాస్కరరెడ్డి నుంచి మొన్నటి చంద్రబాబు వరకూ ముద్రగడ అందరితోనూ తలపడ్డారు. ముఖ్యంగా చంద్రబాబుతో పతాక స్థాయిలో ఫైట్ చేశారు. 2016లో కాపు రిజర్వేషన్ ఉద్యమం తీవ్రస్థాయిలో తీసుకెళ్లగలిగారు. కానీ ఉద్యమంలోకి అల్లరిమూకల ప్రవేశాలను అడ్డుకట్ట వేయలేకపోయారు. అందుకే తునిలో రైలు దహనం, విధ్వంసంతో ఉద్యమం మరోవైపు టర్న్ అయ్యింది. చంద్రబాబు మూల్యం చెల్లించుకున్నారు. జగన్ పొలిటికల్ లబ్ధి పొందారు. అయితే వీటిన్నింటికీ సహజంగానే ముద్రగడ కారణమవుతారు. అందుకే ఆయనపై స్పష్టమైన రాజకీయ ముద్రపడింది. ఒక రాజకీయ పార్టీకే కొమ్ముకాస్తున్నారన్న అపప్రదను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ముద్రగడ ఇపుడు ఏ రాజకీయ పార్టీలో లేరు. ఆయన ఏ ఉద్యమమూ చేపట్టడంలేదు. గత కొంతకాలంగా ఆయన సైలెంట్ గానే ఉన్నారు. అలాంటి ముద్రగడ తానుగా తుని కేసు తీర్పు కోసం కోర్టుకు వస్తే ఆయన రాక తెలుసుకుని అప్పటికపుడు పెద్ద ఎత్తున కాపు నేతలు పోగు కావడం బట్టి చూస్తే ముద్రగడకు సొంత సామాజికవర్గంలో ఉన్న ఆదరణ ఎంతటి గొప్పదో అర్ధమవుతోంది అని అంటున్నారు.
రాజకీయ ఆహ్వానాలు
ముద్రగడ బలమైన కాపు నాయకుడు కావడంతో ఆయనకు రాజకీయ ఆహ్వానాలు ఉండడం సహజం. కానీ ఇప్పుడు తీసుకునే నిర్ణయంపైనే రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. వైసీపీ, బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానాలున్నాయి. టీడీపీ నుంచి ఎలానూ ఉండదు. అయితే వైసీపీలో చేరితే మాత్రం గత ప్రభుత్వ హయాంలో ఉద్యమాన్ని జగన్ కు తాకట్టు పెట్టారని ప్రచారం జరుగుతుంది. అదే బీజేపీలో చేరితే ఎన్నికల్లో నెగ్గగలమో.. లేదో అన్న ఆందోళన ఉంది. కానీ బీజేపీ మాత్రం ముద్రగడ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది. ఒకవేళ పవన్ హ్యాండిచ్చినా ముద్రగడతో భర్తీ చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు జనసేన అయితే బాగుంటుందని అనుచరులు ఎక్కువ మంది సూచిస్తున్నారు. పవన్ తో కలిసి నడిస్తే పొలిటికల్ గా బాగుంటుందని భావిస్తున్నారు. చూడాలి మరీ..ముద్రగడ నిర్ణయం ఎలా ఉంటుందో?