https://oktelugu.com/

అమెరికాలో సామాజికకోణం ఫలితాన్ని నిర్ణయించబోతుందా?

ఇంకో 24 గంటల్లో అమెరికా పోలింగ్ ముగియబోతుంది. ఇప్పటికే ఎవరు గెలవబోతున్నారో,ఎవరు ఆధిక్యతలో వున్నారో ప్రపంచమంతా మారుమోగిపోతుంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పని అయిపోయిందని ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నాడని ప్రముఖ చానళ్ళు, పత్రికలూ ఇప్పటికే ప్రకటించాయి. ఇందులో ట్రంప్ కి బద్ద వ్యతిరేకతతో వున్న వాటితోపాటు,రిపబ్లికన్ అనుకూల సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసాయి. విశేషమేమంటే నాలుగు సంవత్సరాల క్రితం కూడా హిల్లరీ క్లింటన్ గెలుపు ఖాయమని, ట్రంప్ తట్టా,బుట్టా సర్దుకొని మరలా తన […]

Written By:
  • Ram
  • , Updated On : November 3, 2020 / 09:35 AM IST
    Follow us on

    ఇంకో 24 గంటల్లో అమెరికా పోలింగ్ ముగియబోతుంది. ఇప్పటికే ఎవరు గెలవబోతున్నారో,ఎవరు ఆధిక్యతలో వున్నారో ప్రపంచమంతా మారుమోగిపోతుంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పని అయిపోయిందని ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నాడని ప్రముఖ చానళ్ళు, పత్రికలూ ఇప్పటికే ప్రకటించాయి. ఇందులో ట్రంప్ కి బద్ద వ్యతిరేకతతో వున్న వాటితోపాటు,రిపబ్లికన్ అనుకూల సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసాయి. విశేషమేమంటే నాలుగు సంవత్సరాల క్రితం కూడా హిల్లరీ క్లింటన్ గెలుపు ఖాయమని, ట్రంప్ తట్టా,బుట్టా సర్దుకొని మరలా తన వ్యాపారాలు చూసుకోవటం తప్పదని వ్యాఖ్యానించాయి. అయితే అనూహ్యంగా హిల్లరీ ఓడి ట్రంప్ అధ్యక్షపీఠం దక్కించుకున్నాడు. మరి 2020 లో ఇదే పరిస్థితి రిపీట్ కాదని గ్యారంటీ ఉందా? కాదు అని అని సర్వే సంస్థలు, వార్తా సంస్థలు ఘంటాపధంగా చెబుతున్నాయి. దానికి కారణం పోయినసారి జరిగిన లోపాల్ని సరిచేసుకున్నామని, అత్యంత శాస్త్రీయంగా ఈసారి సర్వే చేసామని 2,3 శాతం మార్జిన్ తో ఈ సర్వే ఫలితం ఖచ్చితత్వంతో ఉంటుందని గట్టిగా వాదిస్తున్నాయి. ప్రముఖ పత్రికలైన న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు, వాల్ స్ట్రీట్ జర్నల్ ;ప్రముఖ వార్తా చానళ్ళు సిఎన్ఎన్, ఫాక్స్ న్యూస్,సిబిఎస్,ఎబిసి; ప్రముఖ వార్తా పోర్టల్లు పొలిటికో, హఫింగ్ టన్ పోస్టు లాంటివి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసాయి. ఇందులో ఈ సంస్థలు కావాలని ట్రంప్ కి వ్యతిరేకంగా కుట్రపూరితంగా చేశాయని చెప్పలేము. ప్రజల అభిప్రాయాల ఆధారంగానే ఈ ఫలితాలు వెల్లడించారని అనుకోవాలి. మరి ఇంతమంది చెప్పినట్లు వార్ వన్ సైడ్ ఉందా? ఈ సంస్థల ఫలితాలను విశ్లేషిస్తే అలానే అనుకోవాలి. కానీ గ్రౌండ్ లో అంత వన్ సైడేడ్ గా ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది. కారణమేంటి?

    అమెరికా ఎన్నికల్లో సామాజిక కోణం  

    ట్రంప్ రాజకీయవేత్తకాదు. ఫక్తు వ్యాపారవేత్త. అసలు లౌక్యం లేదు. ఈ మాట అంటే ప్రజలు నొచ్చుకుంటారేమో అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. నోటికి ఏదొస్తే అది, అవతలి వాళ్ళను భాదిస్తున్నానా అనే ధ్యాస అసలు లేదు. ఎవరైనా తనని ప్రశ్నిస్తే భరించలేడు. వెంటనే వాళ్ళను తిట్టిన తిట్టు తిట్టకుండా దుర్భాషలాడతాడు. అది తన నైజం. సత్పవర్తన విషయంలో నూటికి సున్నా మార్కులు వస్తాయి. ఇంతవరకూ అమెరికాలో ఇటువంటి వ్యక్తిత్వం,మనస్తత్వం వున్న అధ్యక్షుడు రాలేదు. ముందు ముందు వస్తాడనికూడా చెప్పలేము. అయితే ఈ దుర్ణలక్షణాలన్నీ పోయిన ఎన్నికల ముందుకూడా బయటపడ్డాయి. అమెరికాలో ఇన్ని అవలక్షణాలు వున్న వ్యక్తి ఎన్నిక కావటం జరగలేదు. కాని ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కూడా తన ప్రవర్తనలో మార్పులేదు. అదే సమాజంలో ట్రంప్ అనుకూల,వ్యతిరేక సమీకరణాలకు కారణమయ్యింది. స్వతహాగా రిపబ్లికన్లు విలువలకు ప్రాధాన్యతనిస్తారని అందరూ అనుకుంటారు. అందుకే ఈసారి కొంతమంది రిపబ్లికన్లు ట్రంప్ కి దూరంగా జరిగారు. అందులో చాలామంది ట్రంప్ ని ఓడించమని కూడా బయటపడి ప్రచారం చేసారు.

    ఇదంతా పార్శ్వానికి ఒకవైపు. రెండోవైపు ట్రంప్ కి పార్టీలతో సంబంధంలేకుండా ఓ కల్ట్ లాగా అభిమానించేవాళ్ళ సంఖ్య ఈ నాలుగు సంవత్సరాల్లో పెరిగిపోయిందని చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంత తెల్ల జాతీయులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఎటువంటి డిగ్రీ లేకుండా వున్నవారు( వీరూ తెల్ల జాతీయులే) అందులో ప్రధానంగా వున్నారు. ఎందుకు వీళ్ళందరూ ట్రంప్ పక్కన చేరారో పరిశీలించాల్సిన అవసరం వుంది. అంటే అమెరికాలో నగర,గ్రామీణ వైరుధ్యం పెరిగిపోయింది. గ్రామీణ ప్రజానీకం నగర ప్రజానీకం విధానాలతో, సంస్కృతితో మానసిక ఘర్షణలో వున్నారు. ఇది నిజం. వీరు,ముఖ్యంగా దక్షిణాది వారు మతాన్ని బలంగా ఇప్పటికీ విశ్వసిస్తారు. నగర ప్రజానీకం ఎలిటిస్ట్ గా తయారవటం కూడా వీరితో అగాధం ఏర్పడిందని చెప్పొచ్చు. అదొక్కటే కారణం కాదు. సరళ వలస విధానంతో అన్ని జాతుల,సంస్కృతుల,మతాలవారు రావటం,అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ళ ఉద్యోగాలు వీళ్ళు కొట్టేస్తున్నారనే భావన పెరగటం కూడా కారణమని అనుకోవాల్సి వస్తుంది. దీనితోపాటు అభివృద్ధి అంతా తూర్పు,పశ్చిమ కోస్తాతీరంలో కేంద్రీకరించబడటం, అక్కడ శ్వేతజాతియేతరులు గణనీయంగా గుమికూడటం , ముందు ముందు శ్వేత జాతికి ప్రమాదముందనే భావన కూడా కొంతమందిలో మొదలయ్యింది. వీళ్ళందరికీ ట్రంప్ మానియా వేదికయ్యింది. దీనితోపాటు విచ్చలవిడిగా అక్రమవలసదారులు దేశంలో తిష్టవేయటం,వీళ్ళకు డెమోక్రటిక్ పార్టీ పూర్తి మద్దత్తు నివ్వటం కూడా ఈ సమీకరణలో భాగమయ్యింది. ఇంకో ముఖ్య విషయం డెమోక్రటిక్ పార్టీలో వామపక్ష భావాలు కలవాళ్ళు రోజు రోజుకి బలపడటం కూడా ఈ సమీకరణకు తోడయ్యింది. మొత్తం మీద తెల్ల జాతీయుల్లో గణనీయ భాగం తమకు ప్రమాదం పొంచివుందనే భావనలోకి వచ్చినట్లు కనబడుతుంది. అదేసమయంలో విద్యావంతులు,ఎలిటిస్టూ వర్గాలు ఈ ఆత్మరక్షణ మనస్తత్వాన్ని అనుకరించలేదు. ఇదో విన్నూత్న పరిణామం.

    దీనికి సమాజంలోని శ్వేత జాతియేతరులు కూడా కొంత కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా నల్ల జాతీయుల్లో ఇప్పటికి తమపై తెల్ల జాతీయులు విచక్షణ చూపిస్తున్నారనే భావం బలంగా వుంది. ఇందులో వాస్తం లేకపోలేదు. ఇది సహజం కూడా. మన దేశంలో ఈరోజుకి దళితులపై వివక్ష కొనసాగుతూనే వుంది కదా. కాకపోతే పరిస్థితుల్లో గత 60 సంవత్సరాల్లో అనేక మార్పులు వచ్చాయి. చివరకు నల్లజాతి అధ్యక్షుడుని ఎన్నుకునేదాకా ఈ మార్పు వచ్చిందనే విషయాన్ని మరవొద్దు. బానిస నిర్మూలనని భరించలేని సమాజంనుంచి తమను నల్ల జాతీయుడు పరిపాలించేదాకా మార్పు వచ్చిందనేది సానుకూలంగా చూడాలి. ఇంతవరకు ఈ సమాజంలో ఓ మహిళ అధ్యక్షురాలు కాలేదు, కానీ నల్ల జాతీయుడు అధ్యక్షుడయ్యాడు. ఈ మధ్య ప్రతి చిన్నదాన్ని సామాజిక కోణంలోనే,గుర్తింపు రాజకీయ కోణంలోనే చూడటం ఎక్కువయ్యిందేమోననిపిస్తుంది. పోలీసు వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో ఇంకా మార్పులు రావాల్సి వుందనేది వాస్తవమైనా ప్రతిదీ ఈ కోణంలో చూడటం కూడా శ్వేత జాతీయులు ప్రత్యేక వాదులుగా మారటానికి ప్రతిచర్యగా పనిచేసినట్లుగా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా యాంటి ఫా, వామపక్ష రాజకీయాలు ఎక్కువైన తర్వాత అటువైపు సమీకరణ మనస్తత్వం పెరిగిందనిపిస్తుంది. ఈ రెండు ధోరణులు సమాజానికి మంచివి కావు. డెమోక్రాట్లు వీటిపై మెతక ధోరణిలో వుండటం కూడా ట్రంప్ వైపు వీరందరూ సమీకరించబడటానికి కారణమవుతుంది. ఉదాహరణకు ఇటీవల జరిగిన ఘర్షణల్లో షాపుల్ని లూటీ చేయటం, పోర్ట్ ల్యాండ్ లాంటి చోట నెలలతరబడి రోడ్లను బ్లాక్ చేయటం అయినా వాటిని డెమోక్రాట్లు గట్టిగా ఖండించక పోవటం ట్రంప్ వాదనలకు బలం చేకూరింది. అంటే సమాజం శ్వేత, శ్వేతేతర సమాజంగా సమీకరించబడుతుంది. ఇందుకు నా దృష్టిలో ఇరువురూ బాధ్యులే. అదివరకు ఇటువంటి ధోరణులు వున్నా ఈ స్థాయికి ఎప్పుడూ చేరలేదు. డెమోక్రటిక్ నాయకత్వం ఆ అవకాశం ట్రంప్ కి ఇచ్చి వుండాల్సింది కాదు. నాణేనికి ఎప్పుడూ రెండు పార్శ్వాలు ఉంటాయని మరిచిపోవద్దు. సిద్ధాంతపరంగా డెమోక్రాట్లు చెప్పేది నిజమనిపించినా పెడ ధోరణులను చూసి చూడనట్లు ఊరుకోవటం కూడా రెండోవైపు సమీకరణకు అవకాశామిచ్చిందని చెప్పాలి. మీడియా, మేధావులు ఇదంతా ట్రంప్ విభజన సిద్ధాంతం వలనే వచ్చిందని విశ్లేషించవచ్చు. కానీ ఈ మెతక ధోరణి లేకపోతే ఇంత చెడు ప్రవర్తనవున్న ట్రంప్ వైపు శ్వేత జాతీయులు మొగ్గివుండేవారు కాదని మరవొద్దు. అదీ కరోనా మహమ్మారిని నివారించటంలో ఘోరంగా విఫలమయ్యాడనే విమర్శల నేపధ్యంలో.  అందుకే ఈ విభజనలో ఇరువురికి పాత్ర వుందని చెప్పాల్సి వస్తుంది.

    ఇక అమెరికా భారతీయుల విషయానికి వస్తే 2016 తో పోలిస్తే ట్రంప్ కి మద్దత్తు పెరిగిందని చెప్పాలి. దీనికి కారణాలు వున్నాయి. ఇందాక చెప్పిన డెమొక్రాట్ అంతర్గత పరిణామాలే కారణం. 2016 దాకా అమెరికా భారతీయులు ఎక్కువశాతం డెమొక్రాట్ల వైపే వుండేవారు. కాని ట్రంప్ వచ్చిన తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాల్లో పెను మార్పులు సంభవించాయి. భారత్ కి అమెరికాతో సంబంధాలు అదివరకటి కన్నా బలపడ్డాయి. కాశ్మీర్ విషయంలో డెమోక్రాట్లు పాకిస్తాన్ అనుకూల వైఖరి తీసుకోవటం, అమెరికా ప్రధాన పత్రికలు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు (ఇవి ప్రధానంగా డెమొక్రాట్ల అనుకూల పత్రికలు) భారత్ వ్యతిరేక వైఖరి తీసుకోవటం, మోడీ ప్రభావం లాంటి పరిణామాలు భారతీయ అమెరికన్ల ఆలోచనల్లో మార్పులకు కారణమయ్యాయి. రిపబ్లికన్లే భారత్ ప్రయోజనాలకి దగ్గరగా వుంటారనే భావన బలపడింది. దీనితోపాటు భారతీయ అమెరికన్ల సగటు ఆదాయం అమెరికా సగటు కన్నా అధికంగా ఉండటంతో పన్నుల విషయంలో ట్రంప్ అయితేనే బెటర్ అనే భావన కూడా కొంతమందిలో వుంది. మొత్తం మీద భారతీయ అమెరికన్ల ఓట్లు ఈసారి ఏక పక్షంగా వుండవు.

    అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?

    అందరూ అనుకుంటున్నట్లు ఎన్నిక ఏకపక్షంగా వుండదు. ఇంత దారుణమైన వ్యక్తిగత  ప్రవర్తన వున్న వ్యక్తి, కోవిడ్-19 ని నిర్వహించటంలో విఫలమైన వ్యక్తి మామూలుగానయితే ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నిక కాకూడదు. అందుకనే ఒపీనియన్ పోల్స్ అన్నీ ఓడిపోతాడనే చెబుతున్నాయి. కానీ ఇందాక మనం ప్రస్తావించుకున్న సామాజిక కోణంలో చూస్తే ట్రంప్ పోటీలో వున్నాడనే అనిపిస్తుంది. శ్వేత జాతీయుల్లో ఓ విధమైన మానసిక ఆందోళన వుందనిపిస్తుంది. అదే ట్రంప్ ని రాజకీయంగా బతికిస్తుందనిపిస్తుంది. మెజారిటీ జాతీయులు ఇటువంటి ఆలోచనా ధోరణికి రావటానికి దారితీసిన పరిస్థితుల్ని మార్చాల్సిన అవసరం ఎన్నికయ్యే ప్రభుత్వానికి ఎంతయినా వుంది. ఒకనాడు క్లుక్లాన్ లాంటి శ్వేత దురహంకార సంస్థలు ఉండేవి. కాకపోతే వాటికి ఎక్కువమంది శ్వేత జాతీయుల్లో ఆదరణ వుండేది కాదు. అది శ్వేత దురహంకార ధోరణి. కానీ ఇప్పుడు చూస్తున్నది అదికాదు. మా పీఠం కదిలిపోతుందేమోననే మానసిక ఆత్మరక్షణా ధోరణి. ఇక కొన్ని గంటల్లో అయిపోయే ఫలితం గురించి మాట్లాడుకుందాం.

    ఇంతకుముందు వ్యాసాల్లో ప్రస్తావించుకున్నట్లు ఈ ఎన్నిక కేవలం కొన్ని ‘పోటీ రాష్ట్రాల’ ఫలితంపైనే ఆధారపడివుంది. అందులో వున్న టెక్సాస్,ఫ్లోరిడా గనుక ట్రంప్ గెలిస్తే మిగతా పోటీ రాష్ట్రాల్లో పోటీ గట్టిగానే వుంటుంది. ఇప్పటివరకు వున్న అంచనాల ప్రకారం ఈ రెండు అతి తక్కువ మార్జిన్ తో నయినా ట్రంప్ గెలిచే అవకాశాలే మెండుగా వున్నాయి. ఇంకో ముఖ్య విషయమేమంటే ఇందాక ప్రస్తావించుకున్న సామాజిక కోణంలో శ్వేత జాతీయులు ఒపీనియన్ పోల్స్ లో అభిప్రాయాన్ని స్వేచ్చగా వ్యక్త పరచటం లేదనే భావన కూడా వుంది. అందుకే మిగతా  ‘పోటీ రాష్ట్రాల్లో’ ఇరువురికి సమాన అవకాశాలే వున్నాయనిపిస్తుంది. ఎవరు గెలిచినా అతి కష్టం మీదే. ముఖ్యంగా పెన్సిల్వేనియా, నార్త్ కెరొలినాలో ఎవరు గెలిస్తే వారికే పీఠం దక్కే అవకాశముంది. కాబట్టి పోటీ బైడెన్ కి మాత్రమే అనుకూలంగా వుందని చెప్పలేము. పోటీ రసవత్తరంగా వుందనేది మా అభిప్రాయం.