TDP: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? లేదా? ఒకవేళ పోటీ నుంచి తప్పుకుంటే ఎవరికి సపోర్ట్ చేస్తుంది? లేకుంటే న్యూట్రల్ గా ఉండిపోతుందా? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ కు ముందు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్ గా మారింది. తెలంగాణ తెలుగుదేశం పగ్గాలను బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ కు చంద్రబాబు అప్పగించారు. ఖమ్మం తో పాటు హైదరాబాదులో సభలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు వార్తలు వచ్చాయి. కానీ చంద్రబాబు అరెస్టుతో సీన్ మారిపోయింది.
జనసేనతో బిజెపి పొత్తుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టిడిపి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటు పవన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో చర్చలు జరిపారు. అయితే అది తెలంగాణలో బిజెపి, జనసేన మధ్య పొత్తు కోసమేనని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రస్తావన రాలేదని తెలుస్తోంది. మరోవైపు చూస్తే తెలుగుదేశం పార్టీలో కనీస హడావిడి కూడా లేదు. మొన్నటి వరకు 100 స్థానాలకు పైగా పోటీ చేస్తామని చెప్పిన కాసాని జ్ఞానేశ్వర్ సైతం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. దీంతో తెలంగాణ బరిలో నుంచి టిడిపి తప్పుకుందన్న ప్రచారం ఊపందుకుంటుంది. అయితే దీనిపైహై కమాండ్ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఏపీ రాజకీయ పరిస్థితులు కచ్చితంగా తెలంగాణ పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు అరెస్టు తరువాత కమ్మ సామాజిక వర్గంతో పాటు సెటిలర్స్ లో మార్పు గణనీయంగా కనిపించింది. ఏపీలో సీఎం జగన్ కు అన్ని విధాలా సహకరిస్తున్న బిజెపితో పాటు.. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కేసీఆర్ పై కమ్మ సామాజిక వర్గంతో పాటు సెటిలర్స్ విముఖత చూపుతున్నారు. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ బాహటంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం లేదు. ఈ తరుణంలో టిడిపి పాత్ర ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్న. అటు కాసాని జ్ఞానేశ్వర్ సైతం నోరు తెరవడం లేదు. జనసేన తో పాటు టిడిపి తో పొత్తు పెట్టుకుంటామని బిజెపి ప్రకటన చేయడం లేదు. దీంతో సస్పెన్స్ కొనసాగుతోంది.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢిల్లీలో ఉన్న లోకేష్ బిజెపి పెద్దలను కలవాలని ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. అయితే నెల రోజుల తర్వాత తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహకారంతో లోకేష్ అమిత్ షాను కలవగలిగారు. అప్పటినుంచి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బిజెపికి మద్దతు తెలుపుతుందని ప్రచారం జరిగింది. అయితే అది నేరుగా మద్దతా? లేకుంటే పొత్తా? అన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. కానీ బిజెపి, జనసేనతో జతకట్టే ఛాన్స్ ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. టిడిపి వ్యూహాత్మక మౌనం దేనికి సంకేతమో ఎవరికీ తెలియడం లేదు. అయితే చంద్రబాబును కలిసిన తరువాతే కాసాని జ్ఞానేశ్వర్ సైలెంట్ కావడం విశేషం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పాత్ర పై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిపై హై కమాండ్ ప్రత్యేక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.