
YS Jagan: ఈ ఏడాది విద్యా దీవెన నిధులను జగనన్న ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశారు. మరోసారి వాయిదా పడటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి మొత్తం 10.50 లక్షల మందికి రీయంబర్స్‌మెంట్ కింద రూ.700 కోట్ల ఫీజులను విడుదల చేయాల్సి ఉంది. కాగా, ఈ నెలలో విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు ఈ నిధులను మళ్లించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం అదే పేరుతో కొనసాగించింది. కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులను ప్రభుత్వమే చెల్లించేది. అయితే, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రియంబర్స్‌మెంట్ పథకం పేరును జగనన్న విద్యాదీవెనగా మార్పు చేసింది. ఆ మేరకు నిధులను నేరుగా కళాశాలలకు బదిలీ చేస్తుంది.
విద్యా దీవెన నిధులు షెడ్యూల్ ప్రకారం గత ఏడాది అక్టోబర్ లేదా నవంబరులో రిలీజ్ కావాలి. ఆ తరువాత వాయిదా వేసి ఫిబ్రవరి 27న ఇస్తామన్నారు. మరలా వాయిదా వేసి మార్చి 7న బటన్ నొక్కి విడుదల చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఆ సూచనలు కనబడటం లేదు. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నారు.
అప్పులతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇతర పనుల కోసం కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించడం పరిపాటిగా మారింది. జనవరిలో రూ.3000 కోట్లను కేంద్రం నుంచి అప్పుగా తెచ్చిన ప్రభుత్వం మరలా ఫిబ్రిరిలో రూ.700 కోట్ల మేరకు అప్పుగా తీసుకుంది. వీటితో సంక్షేమ పథకాలను అమలు చేయాలని భావించింది. గత నెలలో రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అందుకు ప్రభుత్వ ఖర్చుతోనే బహిరంగ సభ ఏర్పాటు చేసి వైసీపీ ప్లీనరీలా నిర్వహించారు. వచ్చిన నిధులను వాడేయడంతో, పలు పథకాలను వాయిదా వేస్తూ వస్తున్నారు. రీయింబర్స్‌మెంట్ నిధులను దారి మళ్లించి ఈ నెలలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు వాడుకొని ఉంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.