ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. పార్టీలు పోస్టు మార్టం చేసుకుంటున్నాయి. అయితే.. ఈ ఫలితాలు చూసిన తర్వాత.. కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్నదే క్యాడర్ కు అర్థం కాకుండా ఉంది. తమిళనాట కూటమి విజయం మినహా.. ఆ పార్టీకి ఊరటనిచ్చే గెలుపు ఎక్కడా లభించలేదు. తమిళనాట కూడా హవా డీఎంకేదే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ కు ఎలాంటి దిశానిర్దేశం చేశాయనే చర్చ సాగుతోంది.
వరుసగా రెండు సార్లు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్.. 2014లో దారుణ ఓటమితో కుర్చీ దిగింది. ఆ తర్వాత 2019లో మరింత బలమైన దెబ్బ తగిలింది. ఇక, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ నిరాశే మిగిలింది. దీంతో.. నాయకులు నైరాశ్యంలో కూరుకుపోగా.. కేడర్ పూర్తిగా డీలాపడిపోయింది.
నిజానికి కేరళలో ఒక సంప్రదాయం ఉంది. ఒకసారి అధికారంలోకి వచ్చిన వారు మరోసారి ఖచ్చితంగా ఓడిపోతారు. దేశంలోనే అత్యధిక అక్షరాస్యతా శాతం కలిగిన కేరళ ప్రజలు.. గుడ్డిగా తమ పార్టీ అంటూ జెండాలు పట్టుకొని తిరగరు. రాష్ట్ర అభివృద్దే అంతిమం అని నమ్ముతారు. అందుకే.. అధికారాన్ని మారుస్తుంటారు. ఆ లెక్క ప్రకారం.. ఇప్పుడు అధికారం మారాల్సి ఉంది. కాంగ్రెస్ కూడా ఇదే ధీమాతో ఉంది. కానీ.. ఆ పార్టీ నాయకత్వం వారికి సరైన ధీమా కల్పించకపోవడం వల్లే.. ప్రజలు మరోసారి వామపక్ష ప్రభుత్వానికే పట్టం కట్టారు.
కేంద్రంలోని నాయకత్వం పటిష్టంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ పగ్గాలు వదిలేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదో నడుస్తోందంటే నడుస్తోంది అన్నట్టుగానే ఉంది. మళ్లీ.. అనధికారిక అధ్యక్షుడిగా రాహులే బీజేపీని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలా.. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, అది రాష్ట్రాలపైనా పడుతోందని అంటున్నారు.
త్వరలో.. రాహుల్ కు మరోసారి పట్టాభిషేకం జరిపించాలని, జరుగుతుందని నేతలు అంటున్నారు. అటు జీ24 అంటూ ఏర్పడిన కాంగ్రెస్ వృద్ధ జంబూకాలు ఏ విధంగా హస్తం పార్టీకి సహకరించట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవన్నీ కలిసే కాంగ్రెస్ పుట్టి ముంచుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటన్నింటికీ చెక్ పడాలంటే.. కాంగ్రెస్ అధిష్టానం పటిష్టంగా తయారవడమే ఏకైక మార్గం అంటున్నారు విశ్లేషకులు. మరి, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? అసలు జరుగుతుందా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.