Seediri AppalaRaju: రాజకీయాల్లో ఒక్కోసారి జాక్ పాట్ తగులుతుంది.దూకుడు ఒక్కోసారి అందలమెక్కిస్తుంది..లేకుంటే పాతాళానికి తొక్కేస్తుంది. అందుకే రాజకీయంగా ఆచీతూచీ అడుగులు వేయాలంటారు పెద్దలు. బ్యాలెన్స్ చేసుకొని ముందుకు సాగాలంటారు.కానీ ఏపీలో అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న డాక్టర్ సీదిరి అప్పలరాజు వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది. పూర్వాశ్రమంలో వైద్యుడిగా ఉన్న ఆయన లక్ కలిసి వచ్చి అమాత్య పదవి పొందగలిగారు. 2019 ఎన్నికల్లో వైసీపీలోచేరి అనూహ్యంగా పలాస టిక్కెట్ దక్కించుకున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న మనువరాలు గౌతు శిరీషపై గెలుపొందారు. అక్కడికి ఏడాది తరువాత మంత్రి పదవి దక్కించుకున్నారు. విస్తరణలో కూడా మంత్రి పదవిని నిలబెట్టుకోగలిగారు. కానీ అయనకు దక్కిన లక్ ను నిలబెట్టుకోవడం లేదన్న టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. పలాస నియోజకవర్గంలో గౌతు లచ్చన్న కుటుంబానికి పట్టు ఎక్కువ. అటువంటి వారిని ఎదుర్కొని గెలుపొందగలిగారు. అంతవరకూ బాగానే ఉంది కానీ..ఆయనకు దక్కిన గోల్డెన్ చాన్స్ ను మాత్రం చేజేతులా పొగొట్టుకుంటున్నారన్న టాక్ అయితే నడుస్తోంది. తన దూకుడుతో చేటు తెచ్చకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నవారు బలమైన వారు. పైగా గౌతు లచ్చన్న కుటుంబసభ్యులు.బీసీల్లో మంచి పేరున్నవారు.అయితే లచ్చన్న మూడో తరం కాబట్టి కొద్దిపాటి తేడా అయితే కనిపిస్తోంది. గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె గౌతు శిరీష మంచి పరిణితి కనబరుస్తున్నా.. పార్టీపరంగా మాత్రం ఆమె కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ప్రచారం సొంత పార్టీలోనే ఉంది.
నాడు ఏ ప్రచారం చేశారో..నేడు అదే..
2014 నుంచి 2019 వరకూ గౌతు శివాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన అల్లుడు, గౌతు శిరీష భర్త డీఫ్యాక్టో ఎమ్మెల్యేగా వ్యవహరించారని ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. గౌతు కుటుంబంపై ఒక అపవాదు ముద్రను వేయగలిగారు. ఈ విషయంలో సఫలీకృతులయ్యారు. ఇంతలో వైసీపీ తెరపైకి వచ్చిన డాక్టర్ అప్పలరాజు నియోజకవర్గ ఇన్ చార్జి పదవిని పొందగలిగారు. జగన్ ప్రభంజనంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత మంత్రి అయ్యారు. కానీ అదేదో తన ప్రతిభ అనుకుంటున్న మంత్రి సొంత అజెండాతో ముందుకెళుతున్నారు. సీనియర్లను పక్కన పెట్టి సొంత అనుచరవర్గాన్ని, ప్రాబల్యాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. అదే సమయంలో ప్రత్యర్థులపై వ్యవస్థలను వినియోగిస్తున్నారన్న అపవాదును అయితే మూటగట్టుకుంటున్నారు. నాడు శివాజీ అల్లుడిపై చేసిన ప్రచారమే నేడు మంత్రి కుటుంబసభ్యులు, అనుచరులపై కూడా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. పాలనాపరమైన విధానాల నుంచి భూ ఆక్రమణలు, కబ్జాల ఆరోపణలు మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనిని సరిదిద్దుకోవాల్సింది పోయి మంత్రి ప్రత్యర్థి పార్టీ నేతలపై అధికారులతో దాడి చేయించడం, పోలీసులతో కేసులు నమోదు చేయించడంతో వివాదాస్పదమవుతున్నారు. తొందరపాటు చర్యలకు దిగుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చిన గోల్డెన్ చాన్స్ ను చేజేతులా మిస్ చేసుకుంటున్నారన్న టాక్ సొంత పార్టీలో సైతం నడుస్తోంది. ప్రస్తుతానికి అధికారంలో ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకున్నా.. భవిష్యత్ లో మాత్రం దీనికి ఆయన మూల్యం చెల్లించుకునే అవకాశముందని భావిస్తున్నారు.
సొంత నియోజకవర్గంలో వివాదాలు..
రాష్ట్ర కేబినెట్ లో చాలా మంది మంత్రులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. కానీ వారెవరూ సొంత నియోజకవర్గాల్లో మాత్రం ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా అప్పలరాజు వ్యవహార శైలి నడుస్తోంది. పలాస నియోజకవర్గంలో తరచూ వివాదాలు, గొడవలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. పలాసకాశీబుగ్గ జంట పట్టణాల్లో తరచూ ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో సామాన్య ప్రజానీకం అసౌకర్యానికి గురవుతోంది. అప్పలరాజు మంత్రిగా పదవి చేపట్టిన తరువాత ఈ సంస్కృతి పెరిగిందన్న టాక్ ప్రజల్లోకి వెళుతోంది. ఇది అంతిమంగా ఆయనకే చేటు తెస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం ముందుగా ఆ ప్రభావం పాలకపక్షంపైనే పడుతోంది. నాడు విపక్షంలో ఉన్నప్పుడు గౌతు కుటుంబసభ్యులపై లేనిపోని ప్రచారం చేసి లబ్ధిపొందిన వైసీపీ నాయకులకు ఇది తెలియంది కాదు. అందుకే వైసీపీ జిల్లా నాయకత్వం కూడా పలాసలో నిత్యం జరుగుతున్న పరిణామాలతో కలవరపడుతోంది. ఇది పార్టీకి చేటు తెచ్చే విధంగా ఉందని భావిస్తోంది.
అది ఫక్తు రాజకీయమే..
పలాస నియోజకవర్గంలో భూ ఆక్రమణలు పెరిగాయంటూ అటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ఈ ఆరోపణలు తిప్పికొట్టడం, ప్రజా సంఘాల అనుమానాలను నివృత్తి చేయడంలో పాలక పక్షం విఫలమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల అధికార పార్టీపై భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చాయో లేదో.. టీడీపీ కౌన్సిలర్ కు చెందిన వార్డులో ఆక్రమణల పేరిట అధికారులు హడావుడి చేయడం ఫక్తు రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఒక వార్డులో జరిగిన చిన్నపాటి ఇష్యూ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన అంశంగా మారిపోయింది. చివరకు వైసీపీ నేతల హౌస్ అరెస్ట్ ల వరకూ కథ నడిచిందంటే శాంతిభద్రతలకు విఘాతం కలిగినట్టేనన్న మాట. ఈ దూకుడుతో తన గ్రాఫ్ పెంచుకోవచ్చని మంత్రి భావిస్తున్నారు అనుకోవచ్చు కానీ.. తెర వెనుక మాత్రం ఆయనకు చాలా నష్టం జరిగిపోతుందని సొంత పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. అయితే ఈ మొత్తం పరిణామ క్రమంలో ఆయన టీడీపీ ట్రాప్ లో పడ్డారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తనకు వచ్చిన గోల్డెన్ చాన్స్ ను డాక్టర్ అప్పలరాజు చేజేతులా పోగొట్టుకుంటారా? లేకుంటే క్షేత్రస్థాయిలో తప్పిదాలను గుర్తించి వచ్చే ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకుంటారా అన్నది ఆయన ఇష్టం.