Pawan Kalyan Fire On YCP: ఏపీలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయి. తాము ప్రత్యేక చట్టాలు రూపొందించామని… దిశ చట్టాన్ని రూపొందించామని.. ప్రత్యేక పోలీస్ స్టేషన్లు సైతం ఏర్పాటుచేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇవేవీ నేర నియంత్రణకు అక్కరకు రాకుండా పోతున్నాయి. ఏడాది కిందట సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో ఓ యువతిని దారుణంగా అత్యాచారం చేసినా నిందితుడ్ని ఇంతవరకూ పట్టుకోలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం మాత్ర గతంలో ఏ ప్రభుత్వం లేనంతగా పటిష్ట చర్యలు చేపట్టినట్టు ఎప్పటికప్పుడు ప్రకటిస్తోంది. అటు ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు, విపక్షాలు ప్రశ్నించినప్పుడు మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు ఎదురుదాడి అస్త్రాన్ని ఎంచుకుంటున్నారే తప్ప… బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. అటువంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టలేకపోతున్నారు. ఫలితంగా ఏపీలో రోజురోజుకూ మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) దేశంలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్న రాష్ట్రాల జాబితాను ఇటీవల వెల్లడించింది. అందులో తొలి పది సంఖ్యలో ఏపీ ఉండడం దురదృష్టకరం.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, మహిళపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలపై జనసేన అధినేత పవన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. శాంతిభద్రతలను అరికట్టడంలో వైఫల్యం మూలంగా ఎందరో బాధితులుగా మిగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఉపాధి కోసం వచ్చిన ఓ గిరిజన మహిళ , పల్నాడులోని నాగార్జున సాగర్ వద్ద ఆశ వర్కర్ అయిన గిరిజన మహిళ దారుణంగా హత్యకు గురికావడం తనను ఎంతో కలచివేసిందని పవన్ అన్నారు. ప్రభుత్వం చట్టాలను సక్రమంగా అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మౌనం రాష్ట్రంలో మహిళలకు శాపంగా మారుతోందన్నారు. మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే మృగాలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. హోం మంత్రి మహిళ అయి ఉండి కూడా ఘటనలపై చులకన భావంతో చూడడం దారుణమన్నారు. ఇప్పటికైనా వైసీపీ సర్కారు మేల్కొని మహిళా రక్షణకు కఠిన చర్యలకు ఉపక్రమించాలని పవన్ డిమాండ్ చేశారు.
Also Read: Iranian- Hijab: హిజాబ్ ధరించాలని షరతు పెడితే కాల్చేసి నిరసన తెలిపారు. ఇంతకీ ఎక్కడో తెలుసా?
ఏపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. విపక్షాల నుంచి ప్రశ్నలు, నిలదీతలు ఎదురైనప్పుడు ప్రభుత్వం నుంచి ఎదురుదాడి ఎదురవుతోంది. అయితే మహిళల రక్షణ విషయంలో అసెంబ్లీలో చర్చించడానికి కూడా ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. సాక్షాత్ అధికార పక్షం కీలక ప్రజాప్రతినిధులపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. మహిళలతో అసభ్యపదజాలంతో కూడిన ఆడియోలు సైతం బయటకు వచ్చాయి. ఓ ఎంపీ ఏకంగా న్యూడ్ వీడియోలో మాట్లాడడం కలకలం రేపింది. అయితే మహిళ హక్కుల రక్షణపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా తమ పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే అది ప్రారంభం కావాలి. అదే జరిగితే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తుండడంతో ప్రభుత్వానికి ఎదురుదాడి ఒక్కటే అస్త్రంగా మారింది.
తాజాగా పవన్ వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వ తీరు చర్చనీయాంశమవుతోంది. అయితే పవన్ నుంచి ప్రభుత్వ వైఫల్యాల మాట వచ్చిన ప్రతీసారి ఒక మంత్రుల బృందం విరుచుకుపడుతుంది. ఇప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోంది. మంత్రులు పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే పలుమార్లు పవన్ వారిని హెచ్చరించారు. తనను వ్యక్తిగత హవనానికి పాల్పడితే వెనక్కి తగ్గుతానని అనుకోవద్దని.. అదే రేంజ్ లో బదులివ్వగలనని కూడా హెచ్చరించారు. పవన్ రాజకీయంగా దూకుడు పెంచిన నేపథ్యంలో మున్ముందు ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన నుంచి మరిన్ని విమర్శనాస్త్రాలు వచ్చే అవకాశమైతే ఉంది. అంటే పవన్ వైసీపీ సర్కారుపై యుద్ధం ప్రకటించిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి.