Renuka Chowdhury- Kodali Nani: కొడాలి నాని..తెలుగు నాట పరిచయం అక్కర్లేని వ్యక్తి. మొన్నటి వరకూ ఏపీ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నా.. ఎమ్మెల్యేగా ఉన్నా మీడియాలో ఆయనకు దక్కే ప్రాధాన్యం మరే ఇతర నేతకు దక్కదు. ఎందుకంటే ఆయన ఆడే ప్రతీమాట వివాదం. అటు వెటకారం, ఇటు బూతులతో ప్రత్యర్థులపై చేసే ఎదురుదాడి తీరుతో ఆయన మీడియాలో మంచి ప్రాధాన్యమే దక్కుతుంది. అది అసెంబ్లీయా, మీడియా సమావేశమా అని కూడా ఆయన చూడరు. చిన్నా పెద్దా తారతమ్యం చూడరు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారు. పైగా గుడివాడ కొడాలి నాని అడ్డా. ఏవరు వచ్చినా నన్ను ఏం పీకేది లేదని కూడా సవాల్ చేస్తారు. అమరావతి రైతులపై కూడా నోరు పారేసుకుంటున్నారు. అటు పొరుగు రాష్ట్రాల నేతలు, బీజేపీ నాయకులపై కూడా విరుచుకుపడుతుంటారు. ఒక్క జగన్, వైసీపీ నేతలు తప్పి.. ఆయన ఎవరినైనా ఒకటే గాడిన కడతారు.
అయితే ఆ మధ్యన ఓసారి అమరావతి రాజధానిపై అసెంబ్లీలో యధాలాపంగా మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై ఏకంగా షటైర్లు వేశారు. ఆమెకు అమరావతితో ఏం పని అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఖమ్మంలో వార్డు కార్పొరేటరుగానైనా గెలవగలరా? అని ప్రశ్నించారు. దీనిని సవాల్ గా తీసుకున్న రేణుకా చౌదరి గుడివాడలో నానిపైనే పోటీచేస్తానని ప్రకటించారు. తాను ఎప్పుడూ ఎమ్మెల్యేగా పోటీచేయలేదని.. తొలిసారి నానిపై పోటీచేస్తానని కూడా చెప్పారు. అయితే ఆమె నానికి కౌంటర్ ఇవ్వడానికి అలా చెప్పారో.. లేక నిజంగానే పోటీకి దిగుతారా? అన్న చర్చ అయితే ప్రారంభమైంది. అయితే దీనిపై ఎటువంటి స్పష్టత లేదు. అటు కొడాలి నాని సైతం సైలెంట్ అయ్యారు. అటు రేణుకా చౌదరి కూడా స్పందించిన దాఖలాలు లేవు.
అయితే ఇప్పుడు గుడివాడ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎలాగైనా కొడాలి నానిని ఓడించి గట్టిగా బుద్ధి చెప్పాలని అన్ని రాజకీయ పక్షాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే సిద్ధాంతాలు, అజెండాలు పక్కనపెట్టయినా గట్టి దెబ్బ చూపించాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేణుకాచౌదరి పోటీచేస్తే ఎలా ఉంటుందన్న చర్చ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితుల్లో ఉంది. సవాల్ చేశారు కాబట్టి రేణుకా మాత్రం బరిలో దిగితే అది వ్యక్తిగత పోరుగా మారుతోంది. కొడాలి నానిని వ్యతిరేకించే వారంతా ఆమెకు మద్దతు ఇస్తారు. అదే జరిగితే రాజకీయం మారిపోతోంది. ఇప్పటివరకూ కొడాలి నానివి మాటలే. కానీ రేణుకా చౌదరి అలా కాదు. ఫైర్ బ్రాండ్ తో పాటు తన మాటలను చేతల్లా చూపించిన సందర్భాలున్నాయి. ఆమె కానీ గుడివాడలో రంగంలో దిగితే నానివ్యతిరేక వర్గాలంతా పోలరైజ్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.
రేణుకాచౌదరి ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తారన్న ప్రచారమైతే ఉంది. దీనిపై స్పష్టత లేదు. ఆమె పార్టీల అభ్యర్థి కంటే.. వ్యక్తిగత హవా చూపించుకునేందుకే ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి ఆమె నేరుగా గుడివాడలో నానిపై రంగంలోకి దిగుతానని ప్రకటించడం ద్వారా ఆప్షన్ ఉంచుకున్నారు. పైగా సామాజికవర్గపరంగా కూడా ఆమెకు కలిసొచ్చే అంశమే. అటు విపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ అక్కడ మంచి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి. ఈ సమయంలో కానీ రేణుకా స్టాండ్ తీసుకుంటే మాత్రం కొడాలి నానికి చుక్కలు కనిపించే అవకాశం ఉంది. అందుకే కొడాలి నాని కూడా రేణుకా చౌదరి ఇష్యూను అక్కడితో విడిచిపెట్టారు. ఆయన సీరియస్ చేస్తే మాత్రం ఆయనకే ఎసరు అని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
Also Read:Iranian- Hijab: హిజాబ్ ధరించాలని షరతు పెడితే కాల్చేసి నిరసన తెలిపారు. ఇంతకీ ఎక్కడో తెలుసా?