Chandrababu: చంద్రబాబు కేసులో మరో ఉత్కంఠ. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరుపు కేసు వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఏసీబీ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఒకవేళ బెయిల్ పిటీషన్ కోర్టు తిరస్కరిస్తే హౌస్ అరెస్టు కైనా అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు చంద్రబాబు తరఫున రెండు పిటీషన్లు దాఖలు చేశారు.
సోమవారం మధ్యాహ్నం నుంచి ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. సిఐడి తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు భద్రతా కారణాల రీత్యా రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా పరిగణించాలని సిద్ధార్థ్ కోరారు… అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో కట్టుదిడ్డమైన భద్రత ఉందని.. చంద్రబాబుకు వచ్చే నష్టం ఏమీ లేదని సిఐడి తరపు న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదించారు. తొలుత ఉదయం ఏఏజి అందుబాటులో లేరని.. సమయం కావాలని సిట్ స్పెషల్ జిపి న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ మేరకు వాదనలు పూర్తయ్యాయి. 4:30 గంటల తర్వాత తీర్పు వెలువడే అవకాశం ఉంది.
అయితే ఈ కేసు విచారణలో భాగంగా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రాణానికి హాని ఉందని.. ఆయనను జైల్లో ఉంచడం ప్రమాదకరమని న్యాయమూర్తి ముందు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఏం తీర్పిస్తుందని దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఏసీబీ కోర్టులో బెయిల్ రాదన్న అనుమానంతో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ హైకోర్టులో లంచ్ మోషన్ కింద బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
అటు ప్రభుత్వం సైతం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఏసీబీ కోర్టులో సిఐడి మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా చంద్రబాబు అరెస్టు కోసం పీటీ వారెంట్ కోరింది. ఈ కేసులో ఏ1 గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ, ఏ6 గా నారా లోకేష్ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్ లో సిఐడి పేర్కొంది. మొత్తానికైతే చంద్రబాబుకు బెయిల్ లభించినా, హౌస్ అరెస్ట్ కు అనుమతినిచ్చినా.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి పట్టు బిగించే అవకాశం ఉంది. అయితే కోర్టు ఏ తీర్పునిస్తుందా? అన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. సాయంత్రం నాలుగున్నర గంటల తరువాతే చంద్రబాబు కేసులు విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.