కృష్ణా జలాల హక్కుల సాధనకు ముఖ్యమంత్రికేసీఆర్, కేటీఆర్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సమస్యను వివాదాస్పదం చేసి విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ, రాయలసీమ ప్రజల విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు, కేటీఆర్ గెస్ట్ హౌస్ కు పరిమితం కావాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. సామాజిక తెలంగాణ సాధించేందుకు సరికొత్త యుద్ధానికి యువత సిద్ధం కావాలని సూచించారు.
బంజారాహిల్స్ లోని కాంగ్రెస్ కార్యాలయాన్ని సందర్శించి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, గడ్డం వినోద్, ఎంఏ ఖాన్, ఎం కోదండరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, దాసోజు శ్రవణ్ లను కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 9న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశ తేదీ నిర్ణయిస్తే దీన్ని 20కి మార్చాలని రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు కోరుతుందని ప్రశ్నించారు. సీఎం బిజీగా ఉంటే ప్రతినిధిగా నీటిపారుదల శాఖ మంత్రిని పంపవచ్చు కదా అని సూచించారు. తెలంగాణ ప్రజల హక్కులపై మాట్లాడకుంటే సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ కోసం పోరాడిన వారు కాకుండా ఉద్యమ ద్రోహులే ప్రస్తుతం రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదని చెప్పారు. ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఎవరిని చెప్పులతో కొడతారో చూస్తామని అన్నారు. ప్రజలను మోసం చేసిన వారిని కొడతారని, ప్రజలకు సేవ చేసేవారిపై ఎందుకు కోపం చూపిస్తారని పేర్కొన్నారు.
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ విభజన అనంతరం ఉమ్మడి రాష్ర్టం వాటా 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఏపీకి, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. దీనిపై అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సంతకం చేశారు. పోతిరెడ్డిపాడుకు జీవో 203, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు శాపంగా మారుతుందని నాగం జనార్ధన్ రెడ్డి సీఎం కు లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు.