Homeజాతీయ వార్తలుTelangana BJP: బిజెపిలో ఏంటి ఈ అయోమయం?

Telangana BJP: బిజెపిలో ఏంటి ఈ అయోమయం?

Telangana BJP: మాల్దీవుల మీద కొట్టిన దెబ్బతో, అయోధ్య రామ మందిర నిర్మాణంతో.. నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా తన చరిష్మాను మరింత పెంచుకున్నారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏకంగా మూడు రాష్ట్రాలలో విజయాన్ని సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఈ సానుకూల పరిణామాలతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు మరింత బలాన్ని పెంచుకున్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా విజయం సాధించి మూడవసారి అధికారాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆయన సంకేతాలు ఇస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా బిజెపిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ.. ఇతర హడావిడి కనిపిస్తుంటే.. తెలంగాణ బిజెపిలో మాత్రం చిత్రమైన పరిస్థితి నెలకొంది.

తెలంగాణ బిజెపిలో ఒకటికి నలుగురు ఇన్చార్జిలు ఉన్నారు. అయితే ఏ సమస్య మీద ఎవరిని కలవాలో తెలియక ఆ పార్టీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతుండగా.. ఆయన కాకుండా ముగ్గురు ఇన్చార్జిలను తెలంగాణ రాష్ట్రానికి ఆ పార్టీ అధిష్టానం కేటాయించింది. ఇది సరిపోతున్నట్టు పార్లమెంట్ ఎన్నికల ముంగిట మరో ఇన్చార్జినల్ నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ రాష్ట్రంపై బిజెపి కేంద్ర పెద్దల్లో ఒకరైన బిఎల్ సంతోష్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇక బిజెపికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్చార్జిగా తరుణ్ చుగ్ ఎప్పటినుంచో కొనసాగుతున్నారు. ఆయనకు అదనంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ను మరో ఇన్చార్జిగా 2022 ఆగస్టులో నియమించారు. అయితే ఇతర మధ్య విభేదాలు రాకుండా తరుణ్ చుగ్ కు రాజకీయ వ్యవహారాలు, సునీల్ బన్సల్ కు సంస్థాగత వ్యవహారాలు అప్పగించారు. అయితే వీరిలో సునీల్ బన్సల్ ఎక్కువగా రాజకీయ వ్యవహారాలపై ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. ఫలితంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఇతర అనుబంధ సంఘాల నేతలు మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని వాపోతున్నట్టు సమాచారం. ఇక వీరు కొనసాగుతుండగానే బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ ను నియమించింది. ఆయన కూడా పార్టీకి సంబంధించిన సంస్థాగత వ్యవహారాలను పరిశీలిస్తారని బిజెపి కేంద్ర పెద్దలు ప్రకటించారు. ఇప్పటికే ఆ వ్యవహారాల పరిశీలించేందుకు సునీల్ బన్సల్ ఉన్న నేపథ్యంలో.. చంద్రశేఖర్ తో పని ఏముందని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అయితే సునీల్ బన్సల్ కు బిజెపి యువమోర్చా బాధ్యతలు అప్పగించడంతో.. ఆయన రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్నట్టా? లేనట్టా? అని రాష్ట్ర నేతలు చర్చించుకుంటున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జిగా ప్రకాష్ జగదేకర్ ను కేంద్ర పెద్దలు నియమించారు. గత ఏడాది జూలైలో ఈ నియామకాన్ని చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడం.. అధికారం మీద ఆశ పెట్టుకున్న బిజెపి కేవలం ఎనిమిది సీట్లకే పరిమితం కావడంతో.. ఆయన పదవీకాలం ముగిసినట్టే అని బిజెపి పెద్దలు అంతర్గత సంభాషణలో పేర్కొన్నట్టు సమాచారం. కానీ దానిపై ఇంతవరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఇక ఇది ఇలా జరుగుతుండగానే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి మరొక ఇన్చార్జి నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాక.. విభాగాలకు ఇన్చార్జిలు కూడా ఉన్నాక.. కొత్తగా మరొకరిని ఎందుకు నియమిస్తున్నారు అర్థం కావడం లేదని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఈ చర్చ ఇలా జరుగుతుండగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించి శాసనసభ పక్ష నేతగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో ఆ పార్టీ నాయకత్వం ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఇటీవల ఎన్నికల్లో రాజాసింగ్ మినహా సీనియర్లు ఎవరు విజయం సాధించలేదు. దీంతో ఆయనకే లెజిస్లేచర్ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వాలని కొంతమంది బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాజాసింగ్ కూడా ఇదే విషయం మీద పట్టుబడుతున్నారు. అయితే రాజాసింగ్ తెలుగులో స్పష్టంగా మాట్లాడలేకపోవడం ఆయనకు ప్రతి బంధకంగా మారింది. దీంతో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. పరిణామంతో రాజాసింగ్ అలిగినట్టు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం మధ్యలో నుంచి ఆయన వెళ్లిపోయారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వం లెజిస్లేచర్ ఫ్లోర్ లీడర్ ప్రకటనను వాయిదా వేసుకుంది. మరోవైపు రేజిస్లేచర్ ఫ్లోర్ లీడర్ పోటీలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఆయనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు కలిసి బిజెపి పెద్దలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినప్పటికీ, ప్రజా ప్రతినిధిగా పనిచేసిన అనుభవం, వాక్చాతుర్యం అంటే అంశాలు రమణారెడ్డికి ఉన్నాయని బిజెపిలోని కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మహేశ్వర్ రెడ్డి కంటే వెంకట రమణారెడ్డి వైపు చాలామంది బిజెపి నాయకులు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ఎవరిని ఖరారు చేస్తుంది అనేది మాత్రం అంతు పట్టడం లేదు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular