Telangana TDP
Telangana TDP: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏమిటి? ఆ పార్టీ ఎవరికి మద్దతు తెలుపుతుంది. లేకుంటే వ్యూహాత్మక మౌనం పాటిస్తుందా? లేకుంటే క్యాడర్ కు అంతర్గతంగా దిశా నిర్దేశం చేస్తుందా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. తెలంగాణకు మించి ఏపీలో దీనిపై విస్తృతమైన చర్చ నడుస్తోంది. తెలంగాణలో టిడిపి తీసుకునే స్టాండ్ పైనే ఏపీలో రాజకీయ సమీకరణలు మారనున్నారు. దీంతో అంతా ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం హై కమాండ్ మాత్రం ఈ విషయంలో గుంభనంగా ఉండడం విశేషం.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యం తర్వాత మారిన పరిస్థితులతో.. తెలంగాణ ఎన్నికల బరి నుంచి టిడిపి తప్పుకున్నట్లు ప్రకటించింది. సమయం లేనందువల్లే పోటీ నుంచి తప్పుకున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నా.. తెర వెనుక ఎన్నో జరిగాయన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. దీనిపై రకరకాల విశ్లేషణలు, ఊహాగానాలు రేగుతున్నాయి. బిజెపి కోసమేనని… కాదు కాదు కాంగ్రెస్ కోసమేనని చర్చలు నడుస్తున్నాయి. కానీ తెలుగుదేశం నాయకత్వం మాత్రం ఎక్కడా బయటపడడం లేదు. కేడర్కు సైతం దిశా నిర్దేశం చేయలేదు. దీంతో టీడీపీ క్యాడర్, అభిమానులు ఒక రకమైన అయోమయం నెలకొంది.
తెలుగుదేశం పార్టీ ఏదో ఒక ప్రకటన చేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. ఏపీలో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదుర్చుకుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి నడవాలని డిసైడ్ అయింది. తెలంగాణలో సైతం పరిమిత స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. కానీ భారతీయ జనతా పార్టీ జనసేన మద్దతు కోరింది. అయితే ఇప్పటికే 32 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించామని.. మద్దతు అంటే కుదరదని.. పొత్తు అంటే ఆలోచన చేస్తామని.. పవన్ కళ్యాణ్ నుంచి ప్రతిపాదన వెళ్ళింది. వీరికి బిజెపి నుంచి సానుకూలత రావడంతో.. రెండు పార్టీల మధ్య పొత్తు చిగురించింది. ఎనిమిది అసెంబ్లీ సీట్లలో జనసేన అభ్యర్థులను ప్రకటించింది. దీంతో టీడీపీ పై ఒత్తిడి పెరగనుంది. మిత్రపక్షం కావడంతో మద్దతు చెప్పక తప్పని పరిస్థితి ఎదురైంది.
అయితే ఏపీలో రాజకీయ పరిస్థితులతో టిడిపి క్యాడర్, కమ్మ సామాజిక వర్గం, తెలుగుదేశం అభిమానించే సెటిలర్స్ ఒక నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు అరెస్ట్లో జగన్ వెనుక బిజెపి పెద్దలు ఉన్నారని… అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలని.. చంద్రబాబు రాజకీయ వ్యతిరేకి అయిన కెసిఆర్ ను దెబ్బ కొట్టాలని.. అది జరగాలంటే కాంగ్రెస్కు ఏకపక్షంగా మద్దతు తెలపాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. పైగా రేవంత్ రూపంలో సన్నిహితుడు ఉండడంతో కాంగ్రెస్ అయితేనే బిజెపి, బిఆర్ఎస్, వైసీపీ లకు దెబ్బ కొట్టచ్చు అన్నది టిడిపి శ్రేణుల భావన. కానీ ఇప్పుడు అనూహ్యంగా జనసేన తెరపైకి రావడంతో టిడిపి మద్దతు తెలుపుతుందని.. ఇటు బిజెపి, అటు జనసేన ఆశిస్తోంది. అయితే ఎటువంటి ప్రకటన చేయకుండా ఉండడమే మేలని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. ఒకవేళ జనసేన కోరితే మాత్రం ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో సపోర్ట్ చేస్తే మేలన్న అభిప్రాయం కూడా ఉంది.