AP DGP Gautam Sawang: పూలమ్మిన చోట కట్టెలమ్మడం అంటే ఇదేనేమో. ఇన్నాళ్లు పోలీస్ బాస్ గా ఓ వెలుగు వెలిగిన డీజీపీ గౌతం సవాంగ్ వ్యవహారం ఇప్పుడు అడకత్తెరలో చిక్కుకున్న పోకచెక్కలా తయారయింది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారుతోంది. ప్రభుత్వానికి అన్ని వెనకుండి నడిపించినా చివరకు కూరలో కరివేపాకులా తీసిపారేసే సమయం వచ్చింది. గౌతం సవాంగ్ రాజీనామా చేయాలనే వాదన బలంగా వస్తుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అందరితో సలాం కొట్టించుకున్న చోట తలవంపులు వస్తాయని సిగ్గుతో తల దించుకుంటున్నారు.
ఎంత చేసినా అంతే ఎవరైనా ఒకటే అనే అభిప్రాయానికి వస్తున్నారు. ప్రభుత్వ నిర్వహణలో అన్ని తానై నడిపించినా ప్రస్తుతం మాత్రం ఆయన సేవలు అక్కర్లేదనే అభిప్రాయానికి వస్తున్నారు. డీజీపీ గౌతం సవాంగ్ రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆయన ఏం చేయాలనే దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇంత కాలం తన వారనుకుని పని చేసినా గుర్తింపు లేకపోవడం గమనార్హం.
ప్రతిపక్షాలను సైతం ఇబ్బందులు పెట్టడంతో ఇప్పుడు వారికి లోకువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ నిర్వహణలో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు కలిగినా లెక్క చేయలేదు. తన స్వీయ పర్యవేక్షణలోనే అన్ని సజావుగా నడిపించినా ఇప్పుడు మాత్రం ఒంటరైపోవడం తెలుస్తోంది. అందుకే అంటారు దేన్నయినా తన దానిగా భావించుకోవద్దని సూచిస్తుంటారు.
Also Read: పేరు లేదనే అలకబూనిన కేసీఆర్ః వివరణ ఇచ్చిన జీయర్ స్వామి
అయితే గౌతం సవాంగ్ కు ఏపీపీఎస్పీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఓ వాదన వస్తోంది. కానీ ఆయనకు మాత్రం కేంద్ర సర్వీసులకు వెళ్లి అక్కడి నుంచి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా చేయాలనేది ఆశయం. కానీ అది నెరవేరేలా కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వ ఒత్తిడితో ఆయన రాజీనామా చేయక తప్పదని తెలుస్తోంది. వాలంటరీ రిటైర్మెంట్ పై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రాజీనామా చేస్తే ఇక సర్వీసులో ఉండటం వీలు కాదని తెలిసి బాధపడుతున్నారు.
ఆయన ప్రతిపక్షాలకు ఎంత చేటు చేసినా ఈ సమయంలో మాత్రం గౌతం సవాంగ్ బదిలీని వ్యతిరేకిస్తున్నారు. ఆయనను అర్థంతరంగా ఎందుకు బదిలీ చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు కూడా బదలీ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. గౌతం సవాంగ్ లో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు నా వాళ్లు అనుకున్న వారేమో పరాయి వారు అయిపోయారు. పరాయి వారుగా భావించిన వారేమో తనకు వత్తాసు పలకడంతో ఆయన కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం ఇంకా ఎందాకా వెళ్తుందో తెలియడం లేదు.
Also Read: విభజన హామీలు కొలిక్కి వచ్చేనా?