YCP MLA : ఆ ఎమ్మెల్యే పొద్దున లేస్తేనే వీధుల వెంబడి తిరుగుతాడు. గుడ్ మార్నింగ్ అంటూ జనంలోకి వెళ్తారు. జనం సమస్యలను అడిగి తెలుసుకుంటారు. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఏపీలో ఏ ఒక్క ఎమ్మెల్యే ఈయనలా జనంలో తిరగరని పేరుంది. కానీ ఎమ్మెల్యే వీధుల వెంబడి తిరగడం వెనుక మరో కోణం ఉందని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఇంతకీ ఈ ఎమ్మెల్యే ఎందుకిలా వీధుల వెంట తిరుగుతారో స్టోరీలో తెలుసుకుందాం.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలియని వారు ఏపీలో ఉండరు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజల్లోకి వస్తారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రతిరోజు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఏ ఎమ్మెల్యే చేయని విధంగా కేతిరెడ్డి జనంలో తిరగడంతో జనం కూడా ఎగబడి చూసేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పై ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. తమ ఎమ్మెల్యే ఇలా జనంలోకి రావడం లేదంటూ దెప్పిపొడుస్తున్నారు.
ఇటీవల ఓ యువకుడు కేతిరెడ్డిని కలవడానికి పాదయాత్రగా వచ్చాడు. విజయనగరం జిల్లా రాజాం పట్టణం నుంచి ఆ యువకుడు పాదయాత్రగా కేతిరెడ్డిని కలవడానికి వచ్చాడు. దీంతో ధర్మవరం జనం ఆశ్చర్యపోయారు. చివరికి ఆ యువకుడు కేతిరెడ్డిని కలిశారు. కేతిరెడ్డితో సమావేశం అయ్యాడు. ఎక్కడ నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు లాంటి వివరాలు కేతిరెడ్డితో పంచుకున్నాడు. మరోసారి ఇలా చేయొద్దంటూ కేతిరెడ్డి సున్నితంగా హెచ్చరించారు. ఆ యువకుడికి ఆర్థిక సహాయం చేశారు. కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం స్పూర్తితో తాను పాదయాత్రతో వచ్చానని ఆ యువకుడు చెప్పాడు. ఏ ఎమ్మెల్యే చేయని విధంగా కేతిరెడ్డి ప్రజలకు మేలు చేస్తున్నారని ఆ యువకుడు చెప్పుకొచ్చారు.
కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కేతిరెడ్డిది పబ్లిసిటీ స్టంట్ అని కొందరు విమర్శిస్తూ ఉంటే.. మరికొందరు ఖాళీ స్థలాలను కబ్జా చేయడానికి ధర్మవరంలో తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో వెతికేందుకు కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు ఖాళీ స్థలలా కబ్జా చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ కేతిరెడ్డికి మాత్రం ప్రజల్లో మంచి క్రేజ్ వచ్చిందని చెప్పుకోవాలి. ఇందుకు సోషల్ మీడియానే కారణం అని చెప్పాలి. ప్రజల్లో ఒక ఎమ్మెల్యే తిరగడం మంచి పనే. ప్రజా సమస్యలు పరిష్కారం అయితే ఇంకా మంచిది. కేవలం పబ్లిసిటీ కోసం కాకుండా నిజమైన ప్రజానాయకుడిగా ఉండగలిగితే అంతకన్నా ప్రజలకు కావాల్సింది ఏమీ లేదు.