Munugodu By Elections : ఓటుకు ధర ఫిక్స్.. మునుగోడులో పతాక స్థాయికి పంపకాలు

Munugodu By Elections  : మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇన్ని రోజులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు మందు, ముక్కతో సాగించిన ప్రలోభాల పర్వం.. ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఓటుకు ఇంత ధర అని ఫిక్స్ చేసి మరీ పంపిణీ చేసేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. ఒక పార్టీ ఓటుకు నాలుగు నుంచి ఐదు వేలు, ఇంకో పార్టీ దీనికి కొంత అదనంగా జోడించి 6000 దాకా ఇచ్చేందుకు సిద్ధమైపోయాయి. మరో పార్టీ […]

Written By: Bhaskar, Updated On : October 30, 2022 1:39 pm
Follow us on

Munugodu By Elections  : మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇన్ని రోజులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు మందు, ముక్కతో సాగించిన ప్రలోభాల పర్వం.. ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఓటుకు ఇంత ధర అని ఫిక్స్ చేసి మరీ పంపిణీ చేసేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. ఒక పార్టీ ఓటుకు నాలుగు నుంచి ఐదు వేలు, ఇంకో పార్టీ దీనికి కొంత అదనంగా జోడించి 6000 దాకా ఇచ్చేందుకు సిద్ధమైపోయాయి. మరో పార్టీ అయితే వెయ్యి వరకు ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నది. ఈ పంపకాల మొత్తం రెండు వందల కోట్ల నుంచి 250 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నగదు మొత్తాన్ని రాజకీయ పార్టీలు వివిధ మార్గాల మీదుగా మునుగోడు తరలిస్తున్నాయి.

ఇక పంచుడే

హవాలా నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ దాకా అన్ని మార్గాలను రాజకీయ పార్టీలు డబ్బు పంపిణీకి మార్గంగా వినియోగించుకుంటున్నాయి. హైదరాబాద్ సహా చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హవాలా మార్గంలో డబ్బులు మునుగోడు కు చేరుస్తున్నాయి.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగే ప్రదేశంలో ఎవరి వద్ద అయినా రెండున్నర లక్షల కంటే ఎక్కువ నగదును పట్టుకుంటే, వారు ఆ నగదుకు ఎన్నికలకు సంబంధం ఏమీలేదని రుజువు చేసే వివరాలు, కారణాలు, రసీదులు చూపించాల్సి ఉంటుంది.. ఎన్నికల్లో మితిమీరిన మన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడమే ఈ నిబంధనల లక్ష్యం. అయితే మునుగోడు సరిహద్దు మండలాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలతో పాటు ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా తనిఖీల్లో పాల్గొంటున్నాయి.. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు హవాలా మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఇందుకోసం నియోజకవర్గంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, మద్యం ట్రేడర్లు, అడితి వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, పెట్రోల్ బంకుల నిర్వాహకులు, ఫెర్టిలైజర్ వ్యాపారులతో డీల్స్ మాట్లాడుకుంటున్నారు. హైదరాబాదులో వారి తరపు వారికి డబ్బు చెప్పి.. కమిషన్ మినహాయించి మిగతా సొమ్మును మునుగోడులో వీరు నుంచి తీసుకుంటున్నారు. అలాగే మునుగోడు లో ఉండే వారిలో ఎవరు పెద్ద మొత్తంలో నగదు ఇవ్వగలరు ఆరో తీసి వారి ఖాతాలో డబ్బు జమ చేస్తున్నారు. ఇక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి హవాలా రూపంలో మునుగోడుకు భారీగా డబ్బు వస్తుండడం గమనార్హం.

చూసి చూడనట్టు వదిలేస్తున్నారు

చెక్ పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ వారి కళ్ళు కప్పి విఐపి ల వాహనాల్లో మునుగోడుకు డబ్బు తరలిస్తున్నారు. కేంద్ర బలగాలు మాత్రం పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కానీ రాష్ట్ర బలగాలు ఉన్నచోట ఈ స్థాయిలో జరగడం లేదు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ గురువారం సొంత జిల్లాకు వెళ్లి శుక్రవారం ఉదయం నగదుతో మునుగోడుకు తిరిగి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి, హైదరాబాద్ నుంచి తన వాహనాల్లో డబ్బు తీసుకువచ్చారన్న ప్రచారం సాగుతోంది. చెక్ పోస్టుల వద్ద ఎక్కువ మంది సిబ్బంది ఉండని సందర్భం చూసి వీఐపీలు తమ వాహనాలను దాటించేస్తున్నారు

ఇక ఆ రోజులే కీలకం

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అన్ని పార్టీల అభ్యర్థులు, అగ్ర నాయకులు, కార్యకర్తలు విశితంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. చివరి నాలుగు రోజులు మాత్రం ఒక ఎత్తు. దీనిని అన్ని రాజకీయ పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. ప్రత్యర్థి పార్టీ ఓటుకు ఎంత ఇస్తుందో చూసి.. దానికి రెండింతలు అవసరమైతే మూడింతలు ఇచ్చేలా సమాయత్తం అవుతున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో 2.40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి? ఎవరెవరికి ఇవ్వాలి? ఎంత చొప్పున ఇవ్వాలి? అని జాబితాలు తయారు చేస్తున్నాయి.