YCP Kapu Ministers: ఏపీలో కాపు మంత్రులకు ఒక పని వచ్చి పడింది. ఇన్నాళ్లూ స్వామికార్యం, సాకార్యంలో ఉంటూ వస్తున్న కాపు మంత్రులు అటు పవన్ పై దాడికే తమ మంత్రిత్వ శాఖలు కేటాయించినట్టుగా వ్యవహరించేవారు. అయినదానికి కానిదానికి జనసేనాని మీద విరుచుకుపడే వారు. అటు కాపులంటే మేము. తమకంటే కులం పట్ల అవగాహన, బాధ్యత ఉన్నవారెవరు? అని ఆర్భాటంగా ప్రకటించే వారు. అటువంటి వారు చిత్తశుద్ధి నిరూపించుకునే సమయం ఒకటి వచ్చింది. అదే కాపు రిజర్వేషన్లు. అగ్రవర్ణాల్లో వెనుకబడిన వర్గాల వారికి ఈబీసీ రిజర్వేషన్లు సమర్థనీయమే అంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో అరుదైన అవకాశం వచ్చింది. ఎలాగైనా పవన్ ను అడ్డుకోవాలని చూస్తున్న వారు జగన్ ను ఒప్పించి వీలైనంత ఎక్కువ శాతం ఈబీసీ రిజర్వేషన్ ను కాపులకు వర్తింపజేస్తే మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. అయితే జాతి ప్రయోజనాలను కాపాడతారో.. లేక జాతిని తాకట్టు పెట్టి తమకు తాము జగన్ కు పెద్ద పాలేర్లుగా ప్రకటించుకుంటారో చూడాలి మరీ.

మాది కాపు కులం..మేమే నిజమైన వారసులం.. కాపు జాతికి ఉద్దరించేది జగన్ ఒక్కరే అంటూ మంత్రులు వీరావేశంతో మాట్లాడుతుంటారు. అయితే ఆ ఆవేశం జాతి ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి పక్కన పడేస్తున్నారు. పవన్ పై ఎదురుదాడి చేసే విషయంలో మాత్రం కాపు పరాక్రమాన్ని చూపిస్తున్నారు. ఈ మూడున్నరేళ్లు చేసింది ఇదే. కానీ ఇప్పుడు జాతి ప్రయోజనాలు కాపాడే సమయం వచ్చింది. అధినేతను ఒప్పిస్తారా? యుద్ధం చేస్తారా? లేకుంటే నీరసత్వాన్ని చూపి అస్త్రసన్యాసం చేస్తారా? లేకుంటే ఏవేవో లాజిక్ లు చెప్పి బయటపడతారా? అన్నది ప్రశ్నార్థకం. అయితే చంద్రబాబు ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్ చెల్లదు అంటూ న్యాయస్థానం మాదిరిగా జగన్ సర్కారు తీర్పు ఇచ్చింది. అయితే అది వైసీపీ ప్రభుత్వ పాలన ప్రారంభ సమయం. ఇప్పుడు పాలన చివరి రోజులకు సమీపిస్తుండడంతో కాపు మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇది సంక్లిష్టమే.
వాస్తవానికి చంద్రబాబు సర్కారు అసెంబ్లీలో కాపుల ఈబీసీ రిజర్వేషన్లపై చట్టం చేశారు. అటు ధ్రువపత్రాల జారీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కానీ రాష్ట్రంలో అధికారం బదలాయింపు జరగగానే కాపుల చిరకాల వాంఛకు బ్రేకులు పడ్డాయి. న్యాయస్థానం మాదిరిగా ఏక వాక్యంతో రిజర్వేషన్లు చెల్లవు అని జగన్ ప్రకటించారు. అప్పట్లో ఒక్క మంత్రి, ఎమ్మెల్యే నోరు మెదపలేదు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా స్పందించలేదు. దీంతో జగన్ ఏక వాక్య తీర్పుతో కాపుల ఈబీసీ రిజర్వేషన్ మరుగునపడింది. తాజాగా సుప్రింకోర్టు తీర్పుతో లైమ్ లైట్ లోకి వచ్చింది. కాపుల రిజర్వేషన్ పై చర్చ ప్రారంభమైంది.

కాపుల రిజర్వేషన్ దశాబ్దాల పోరాటం. చంద్రబాబు హయాంలో హింసాత్మక ఘటనలకు దారితీసిన నేపథ్యంలో ఈబీసీ రిజర్వేషన్ పురుడు బోసుకుంది. దానిని కంటిన్యూ చేస్తూనే.. రిజర్వేషన్ కల్పించే విషయంపై కార్యాచరణ చేపట్టాల్సి ఉంది. కానీ జగన్ సర్కారు ఉన్న ఈబీసీ రిజర్వేషన్ ను రద్దుచేసింది. మూడున్నరేళ్లుగా కాపు జాతికి నష్టం జరిగింది. ఇప్పుడు సుప్రిం తాజా తీర్పుతోనైనా కార్యాచరణ ప్రారంభమవుతుందని కాపులు ఆశిస్తున్నారు. అది జరగకుంటే మాత్రం కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు చరిత్రహీనులు కావడం ఖాయం.