Governor Purohit : ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక్కసారిగా స్పీడ్ బ్రేకర్ వస్తే ఏం జరుగుతుంది.. అనుకోని కుదుపు ఏర్పడుతుంది. అది మన ప్రయాణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం అలానే జరుగుతోంది. మొన్నటిదాకా ముఖ్యమంత్రి కి, గవర్నర్ కు పొసగలేదు. కీలక బిల్లులను గవర్నర్ తొక్కి పెడితే.. ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒకానొక దశలో గవర్నర్ కార్యాలయానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ బిజెపి ఏజెంట్ గా పని చేస్తున్నారని ముఖ్యమంత్రి అంటే.. తనకు రాజ్యాంగం ఇచ్చిన పరిధిలోనే పనిచేస్తున్నానని గవర్నర్ కౌంటర్ ఇచ్చారు. ఇలా సాగిపోతున్న వ్యవహారంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది. ఇక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అని అందరూ అనుకున్నారు. కానీ హఠాత్తుగా గవర్నర్ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
పైన చెప్పిన స్టోరీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనిది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ కార్యాలయంతో కొంతమేర సఖ్యత ఏర్పడింది. కానీ ఢిల్లీకి దగ్గరగా ఉండే పంజాబ్ రాష్ట్రంలో మాత్రం ఒకప్పుడు తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో.. అక్కడ కూడా అలాంటివే జరిగాయి. పైగా పంజాబ్లో అమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ గవర్నర్ గా పురోహిత్ కొనసాగుతున్నారు . 2021 సెప్టెంబర్ లో ఆయన పంజాబ్ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. అక్కడ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆధ్వర్యంలో రూపొందించిన కొన్ని బిల్లులను గవర్నర్ కార్యాలయానికి పంపించారు. అయితే అందులో కొన్ని లోపాలు ఉన్న నేపథ్యంలో గవర్నర్ వివరణ అడిగారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో వాటిని తన వద్ద గవర్నర్ పెట్టుకున్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలలకు సంబంధించి వైస్ ఛాన్స్లర్ల వ్యవహారం లో పంజాబ్ ప్రభుత్వానికి గవర్నర్ పలు ప్రశ్నలు సంధించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు. ముఖ్యంగా బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ల నియామకంపై రాజ్ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ ప్రభుత్వ పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆరోపించారు ఆ మధ్య పంజాబ్ ప్రభుత్వం 36 మంది పాఠశాల ప్రధానోపాధ్యాయులను శిక్షణ కోసం విదేశాలకు పంపింది. దానిపై వివరణ ఇవ్వాలని గవర్నర్ కార్యాలయం కోరితే ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించలేదు. ఇదే సమయంలో తాను మూడు కోట్ల పంజాబీలకు మాత్రమే జవాబుదారీగా ఉంటానని.. కేంద్రం నియమించిన వారికి కాదని భగవంత్ సింగ్ మాన్ ప్రకటించడం వివాదానికి తెరలేపింది.
మార్చి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల వ్యవహారంలో కూడా అటు పురోహిత్, భగవంత్ సింగ్ మాన్ మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం పంపిన లేఖ విషయంలో గవర్నర్ న్యాయ సలహా పొందిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఇరుపక్షాలను సుప్రీంకోర్టు సున్నితంగా మందలించింది. ఇదే క్రమంలో కొన్ని బిల్లులను క్లియర్ చేయడంలో గవర్నర్ సరిగా వ్యవహరించడం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. ఆ తర్వాత ఒక్కరోజు వ్యవధిలో తనకు పంపిన మూడు బిల్లుల్లో రెండింటినీ గవర్నర్ క్లియర్ చేశారు. వాస్తవానికి సిక్కు గురుద్వారాల సవరణ బిల్లు, పంజాబ్ విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు, పంజాబ్ పోలీస్ సవరణ బిల్లు వంటి వాటిని ప్రభుత్వం ప్రతిపాదించగా.. వాటిని గవర్నర్ రాష్ట్రపతికి రిజర్వ్ చేశారు.
గత ఏడాది జూలైలో మంత్రి లాల్ చంద్ పై లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు రావడంతో ఆయనను భర్త రఫ్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రిని ఆదేశించారు. అంతేకాదు పంజాబ్లో డ్రగ్స్ సమస్యపై గవర్నర్ నోరు విప్పారు. డ్రగ్స్ స్మగ్లింగ్ పై పోరాడేందుకు సరిహద్దు జిల్లాల్లో గ్రామ రక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే అప్పట్లో వీటిపై అధికార పార్టీ తీవ్రంగా స్పందించింది. కేంద్రం ఆదేశాల మేరకు గవర్నర్ నడుచుకుంటున్నారని ఆరోపించింది. ఇవన్నీ ముగిసిపోయిన తర్వాత ఆకస్మాత్తుగా గవర్నర్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేయడం పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరి ఈ నేపథ్యంలో కేంద్రం ఎవరిని పంజాబ్ గవర్నర్ గా నియమిస్తుంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను విచారిస్తున్న నేపథ్యంలో.. పంజాబ్ పై అంత సీరియస్ గా దృష్టి సారిస్తుందా? లేక పార్లమెంట్ ఎన్నికల ముందే భగవంతు సింగ్ మాన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుందా అనేది తేలాల్సి ఉంది.