Homeజాతీయ వార్తలుMedico Preethi : ప్రీతి మరణానికి కారణమేంటి? ఈ కేసులో అంతుచిక్కని అనుమానాలివీ?

Medico Preethi : ప్రీతి మరణానికి కారణమేంటి? ఈ కేసులో అంతుచిక్కని అనుమానాలివీ?

Medico Preethi సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి డాక్టర్ ప్రీతి ఓడిపోయింది. ఆదివారం రాత్రి 9 గంటలకు నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూసింది.. అయితే ఆమె మత్తు ఇంజక్షన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల చనిపోయిందని నిమ్స్ వైద్యులు చెబుతుంటే, అసలు తన కూతురిది ఆత్మహత్య కాదని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. కానీ గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న నాటకీయ పరిణామాలు గమనిస్తే పలు అనుమానాలు కలుగుతున్నాయి..

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నించింది.. అచేతనమైన స్థితిలో పడిపోయిన ఆమెను మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.. ఎక్మో ద్వారా ఐదు రోజులపాటు అక్కడ వైద్యులు చికిత్స అందించారు. కానీ బ్రెయిన్ డెడ్ కారణంగా ఆమె మృతి చెందింది.. ఇక తన మృతికి సంబంధించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ ముఖ్యంగా ప్రీతి చాలా ధైర్యం గల అమ్మాయి. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తోటి విద్యార్థులు, స్నేహితులు చెబుతున్నారు. మత్తు ఇంజక్షన్ కోసం గూగుల్లో సెర్చ్ చేసిందని పోలీసులు, వైద్యులు చెబుతున్నారు.  అవి పూర్తి నిరాధారమైనవని ఆమె స్నేహితులు అంటున్నారు.. ప్రీతిని హత్య చేసి, ఆ తర్వాత మత్తు ఇంజక్షన్ ను వెలుగులోకి తెచ్చారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇక ప్రీతికి నిమ్స్ లో వైద్యం చేయడంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. క్రిటికల్ పరంగా ఎంతో బ్యాకప్ ఉన్న అపోలో, యశోద, కిమ్స్, ఏఐజీ హాస్పటల్స్ ఉన్నప్పటికీ.. నిమ్స్ ఎందుకు తరలించారని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. గిరిజన యువతి కాబట్టే ప్రభుత్వం సరిగా స్పందించలేదని ప్రీతి స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఉన్నత సామాజిక వర్గానికి చెందిన యువతి అయితే ప్రభుత్వం వేరే విధంగా స్పందించేదని అంటున్నారు. ఇక సైఫ్ తన మీద వేధింపులకు పాల్పడుతున్నాడని హాస్పిటల్ ఇంటర్నల్ బాడీ, లైంగిక వేధింపుల నిరోధక కమిటీలకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ఒకవేళ వారు కనక పట్టించుకుని ఉంటే ప్రీతికి ఈ దుస్థితి దాపురించేది కాదు.

ప్రీతి తండ్రి స్వయాన ఒక పోలీస్ అధికారి అయినప్పటికీ… సైఫ్ వేధింపులపై ఫిర్యాదు చేస్తే పోలీసు ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోలేదు. ఇక ప్రీతి మృతి చెందిన తర్వాత ఆమె మృదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. అసలు తమ కుమార్తె ఎందుకు చనిపోయిందో సరైన కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తే నిమ్స్ అధికారులు కనీసం పట్టించుకోలేదు. ఫిబ్రవరి 22 న నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఏం జరిగిందో చెప్పాలని ప్రీతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.. ప్రీతిని సైఫ్ మాత్రమే కాకుండా మిగతా సీనియర్లు కూడా వేధిస్తున్నారని, ఇదే విషయాన్ని నాతో వాట్సప్ ద్వారా చెప్పిందని ఆమె తల్లి అంటున్నది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదని ఆమె వాపోతోంది.. ఇన్ని సందేహాలు ఉన్న నేపథ్యంలో ప్రీతిని హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి పై ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయో లేదా అనేది వేచి చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular