Delhi Floods: దేశ రాజధాని ఢిల్లీని వారం రోజులుగా వర్షాలు, వరద వీడడం లేదు. 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో కురస్తున్న వర్షాలతో ఢిల్లీ సరిహద్దులోని యమునానది గతంలో ఎన్నడూ ప్రవహించనంత ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీ మహానగరాన్ని వరద ముంచెత్తింది. ఎర్రకోట వరకు వరద చేరింది. సీఎం కార్యాలయం, నివాసంతోపాటు వీవీఐపీల నివాసాలకు వరద తాకింది. మరోవైపు రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు నిలిచిపోయాయి. చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.
వర్షం తగ్గినా వరద..
ఢిల్లీ పక్కనే ఉన్న హర్యానాలోను భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని యమునా నదిపై ఉన్న హంత్నికుండ్ బ్యారేజీ పూర్తిగా నిండింది. దీంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. దీంతో యమునకు వరద పోటు తగ్గడం లేదు. దీంతో దేశ రాజధానిలో పెద్దఎత్తున వర్షాలు పడనప్పటికీ వరద రోడ్లు, ప్రముఖుల నివాసాలను ముంచెత్తుతోంది.
ఢిల్లీకి చేరువలో హత్నికుండ్..
హత్నికుండ్ ప్రాజెక్టు హర్యాణా రాష్ట్రంలో ఉన్నా.. ఢిల్లీ శివారులోనే ఉంది. దీంతో అక్కడి నుంచి విడుదల చేసిన నీరు తక్కువ సమయంలోనే ఢిల్లీకి చేరుతుంది. ఈ ఏడాది హంత్నికుండ్ బ్యారేజీ నుంచి విడుదల చేసిన నీరు ఢిల్లీకి చేరుకోవడానికి తక్కువ సమయం పట్టింది. నదీపరీవాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల కారణంగా నీలు ప్రవహించే మార్గం కుంచించుకుపోయింది. దీంతో వరద వేగంగా, తక్కువ సమయంలో ఢిల్లీకి చేరుతోంది. నదీగర్భంలో ఉన్న అధిక సిల్ట్‌టేషన్ కూడా వర్షం లేకుండా ఢిల్లీ వరదలకు దోహదపడుతుంది.
స్వల్ప వ్యవధిలో విపరీతమైన వర్షాలు
మరోవైపు ఢిల్లీలో తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షం కురుస్తోంది. దేశ రాజధానిలో 40 ఏళ్లలో అత్యంత వర్షపాతం జూలై రోజుగా నమోదైంది. గత ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. అంతకుముందు 24 గంటల్లో ఢిల్లీ 100 మిల్లీమీటర్ల వర్షాన్ని తట్టుకుంది. ఇలా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం కూడా ఢిల్లీలో వరదలు పొటేత్తేంకు కారణమవుతోంది. ఇంత భారీ వర్షం కురిస్తే వరద నీరు వెళ్లిపోయేందుకు అవసరమైన వ్యవస్థ ఢిల్లీలో లేదు. రోజుల తరబడి ఇదే స్థాయిలో వర్షాలు కురిస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాయు కాలుష్యంతో..
వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తోందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. ఏటా ఢిల్లీలో కాలుష్యం స్థాయి పెరుగుతుండడంతో భూమి వేడెక్కుతోందని, చిన్నపాటి మేఘం వచ్చినా అది తొందరగా కరిగిపోయి నగరంలో భారీ వర్షం కురుస్తుందని చెబుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే ఢిల్లీలో వాతావరణం చల్లబరిచే మార్గం కనుగొనాలని సూచిస్తున్నారు.