Somu Veeraju: ఏపీలో అధికారం బీజేపీ జనసేన ఎలా ముందుకెళుతున్నాయి? పవన్ కళ్యాణ్ కు బీజేపీ ఇచ్చే ఆ రోడ్ మ్యాప్ ఏంటన్నది ఇప్పటికీ ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఆ తెలిసింది ఒక్కరికే.. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు. అందుకే ఆయనను ముగ్గులోకి దించి ఆ వ్యూహాన్ని తెలుసుకోవాలనుకున్న టీడీపీ బ్యాచ్ కలలు కల్లలయ్యాయి. ఎంతో వ్యూహాత్మకంగా ఆ వ్యూహాన్ని బయటపెట్టకుండా ప్రత్యర్థుల ఆశలపై నీళ్లు చల్లారు సోము వీర్రాజు. అదే సమయంలో తమ వ్యూహంతో ఏపీలో అధికారం సాధ్యమని ప్రత్యర్థుల ఊహకందని షాక్ ఇచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్ విషయంలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ బీజేపీ చీఫ్ ప్లాన్లు ఏంటి? ఆయన తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై స్పెషల్ ఫోకస్
‘‘2024లో జనసేన-బీజేపీ కూటమిదే అధికారమని’ ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీ 9వ ఆవిర్భావ సభా వేదికగా సంచలన ప్రకటన చేశారు. వైసీపీని గద్దెదించడమే ధ్యేయమని.. ఈ మేరకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ ప్రకటించారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వగానే ఏపీలో అధికారమే లక్ష్యంగా సాగుతామన్నారు.
ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ ఏంటి? పవన్ తో కలిసి ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఎలాంటి ప్రయోగం చేయబోతోంది? జగన్ ను ఎలా గద్దెదించుతారా? అన్న చర్చ జోరుగా సాగింది. ఈ క్యూరియాసిటీ సగటు నేతలే కాదు.. ఆ మీడియా అధిపతికి కూడా వచ్చింది. అందుకే వ్యూహాత్మకంగా బీజేపీ-జనసేన వ్యూహాన్ని తెలుసుకునే పనిలోపడ్డారు.
చంద్రబాబు అంటే అన్నీ కోసుకునే ఈ మీడియా బాస్ , ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ నిర్వహించారు. ఇందులో ఏపీలో బీజేపీ-జనసేన ప్లాన్ ఏంటి? అసలు ఎలా ముందుకెళుతారన్న దానిపై ఆరాతీశారు. వీరిద్దరూ 2024లో ఏం చేయబోతున్నారనే తెలుసుకునే ప్రయత్నం రాధాకృష్ణ చేశారు.
కానీ ప్రత్యర్థులకు తమ వ్యూహాలు దక్కనివ్వకూడదని సోము వీర్రాజు తెలివిగా సమాధానం ఇచ్చారు. ఏపీలో అధికారమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ కు కేంద్రంలోని బీజేపీ రోడ్ మ్యాప్ అందిస్తుందని.. అదేంటన్నది ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెబుతానంటూ సోము వీర్రాజు షాక్ ఇచ్చారు. మీరు అడగ్గానే చెప్పడానికి అది విషయం కాదని.. వ్యూహాలు అంటూ సోము వీర్రాజు షాక్ ఇచ్చారు. ఏది ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడుతాం.. దాని గురించే ఇవాళే చెప్పండని మీరు అడగకూడదని ఏబీఎన్ ఎండీకి కాస్త గట్టిగానే హితవు పలకడం గమనార్హం. ఒక వేళ ఉత్సాహంతో మీరు అడిగినా నేను చెప్పనంటూ రాధాకృష్ణకు షాక్ ఇచ్చారు సోము వీర్రాజు.
ఇక పవన్ కళ్యాన్ కు బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ ఏంటనే దానిపైనే ఆర్కే ఫోకస్ చేశారు. తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ ‘ఆ రోడ్ మ్యాప్ ఇంటర్నల్ గా ఉందని.. దాని గురించి పవన్ కు తెలుసా?’ అని నన్ను అడగొద్దు అంటూ సోము వీర్రాజు హితవు పలికారు. పవన్ కు, నాకు ఈ విషయంలో పూర్తి స్పష్టత ఉందంటూ ప్రత్యర్థులకు బీజేపీ-జనసేన వ్యూహాన్ని చెప్పలేదు సోము వీర్రాజు.
ఇక పవన్ కళ్యాణ్ సీఎం అన్న వాదనపై కూడా సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ ను సీఎంగా చేస్తే బీజేపీ శ్రేణుల్లో , నేతల్లో అభద్రతాభావం నెలకొనే అవకాశం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా ప్రజల అభీష్టానికే ఆ నిర్ణయాన్ని సోము వీర్రాజు వదిలేయడం విశేషం. రాష్ట్రాన్ని సంతోషపెట్టే బాధ్యతను తాము భుజానకెత్తుకుంటామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
ఇలా ఏ విషయంలోనూ కర్ర విరగకుండా పాము చావకుండా చాలా వ్యూహాత్మకంగా సోము వీర్రాజు ముందుకెళుతున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ-జనసేన కూటమి వ్యూహాలను బయటపెట్టడం లేదు. ప్రత్యర్థులకు హెచ్చరికగా ఆ రోడ్ మ్యాప్ ఉంటుందని మాత్రం స్పష్టం చేస్తున్నారు. రాజకీయంగా ఈ కూటమిని నీరుగార్చాలని.. వారి వ్యూహాలను ఛేదించాలనుకున్న ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు.
Also Read: KCR Chinajiyar swamy : చినజీయర్ స్వామిపై ప్రతీకారం తీర్చుకున్న కేసీఆర్