ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా టీడీపీ హయాంలో జరిగిన ఈఎస్ఐ కుంభకోణం వెలుగుచూసింది. 150కోట్ల మేర అవినీతి జరిగినట్లు అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆయనతోపాటు ఈ కేసులో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెల్సిందే.
చిరు-పవన్ ల మధ్య అగ్రతాంబూలమే అడ్డు..!
ఏపీలోని ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించిన లింకులు తెలంగాణలోని కోదాడలో బయటపడుతున్నాయి. ఆంధ్రా ఏసీబీ అధికారులు తెలంగాణలోని కోదాడలో రహస్యంగా విచారణ చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈఎస్‌ఐ మందుల సరఫరా కుంభకోణంలో కోదాడకు చెందిన ఓ యువకుడికి సంబంధాలు ఉన్నట్లు తాజాగా వెల్లడైంది.ఈ కేసులో కోదాడకు చెందిన ప్రమోద్‌రెడ్డి ఏ–3 నిందితుడిగా అక్కడి ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్యంగా విచారణ చేపట్టడంతో కోదాడలో కలవరం మొదలైంది.
కోదాడకు చెందిన ప్రమోద్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈఎస్ఐ స్కాములో ఏ–1 నిందితుడిగా ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ రమేష్‌కుమార్‌ను, ఏ–2గా మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏ-3గా ఉన్న ప్రమోద్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు అరెస్టు అయినప్పటి నుంచి ప్రమోద్ రెడ్డి ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.
మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?
ఈమేరకు ప్రమోద్ రెడ్డి కోసం ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రమోద్ రెడ్డి తల్లిదండ్రులు కోదాడలో ఉండడంతో ఏపీ ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్య విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రమోద్ రెడ్డి బంధువులు, స్నేహితుల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రమోద్ రెడ్డి స్వగ్రామమైన అనంతగిరి మండలంలోనూ అధికారులు విచారణ చేపట్టి నిఘా పెట్టినట్లు సమాచారం.
ఏది ఏమైనా ఏపీలో జరిగిన ఈఎస్ఐ స్కామ్ కు తెలంగాణలో లింకులు బయట పడుతుండటం గమనార్హం. అధికారులు మరింత లోతుగా విచారణ చేపడితే మరిన్ని లింకులు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో జరిగిన ఈఎస్ఐ స్కామ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.