జనసేన పార్టీలోకి చిరంజీవి వస్తాడా… రాడా అనే ప్రశ్న మెగా ఫ్యామిలీ అభిమానులతో పాటు ప్రజలలో ఎప్పటి నుండో నలుగుతుంది. ఈ ప్రశ్నకు నాగబాబు ఓ సారి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరణ ఇచ్చారు. రాజకీయాల పట్ల విసుగెత్తిపోయిన చిరంజీవి మళ్ళీ రాజకీయాలలోకి రాకూడదని నిర్ణయించుకున్నారని…తన జీవితం సినిమా పరిశ్రమ మరియు దాని అభివృద్ధికే అంకితమని చెప్పారని అన్నారు. ఆయన జనసేన పార్టీలో చేరితే చేసిన వాగ్దానం తప్పినట్లు అవుతుంది కావున, ఆయన పార్టీలో చేరే అవకాశం లేదని చెప్పారు. ఐతే ఆయన చివర్లో …భవిష్యత్ మనం చెప్పలేం కాబట్టి ఆయన మనసు మారి వస్తే రావచ్చు అని కొంచెం తలుపులు తెరిచి వదిలేశారు.
మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?
రాజకీయంలో ఇప్పుడే రాటుదేలుతున్న పవన్ కి అన్న చిరంజీవి తోడు ఉంటే బాగుండు అనే ఆశ, కొందరు జనసేన కార్యక్తలలో ఉంది. 2019 ఎన్నికల ఫలితాల తరువాత ఈ వాదన మరింత బలపడింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ 2009 అసెంబ్లీ ఎన్నికలలో మొదటిసారి బరిలోకి దిగి 16.22% ఓటు షేర్ తో 18 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ మొదటిసారి ఎలక్షన్స్ కి వెళ్లగా, కేవలం 5.53% ఓటు షేరుతో 1 సీటు మాత్రమే గెలుచుకుంది. మరి ఆ విధంగా చూస్తే పవన్ కంటే..చిరంజీవి సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ అని చెప్పవచ్చు. అలాగే పవన్ కి మించిన ప్రజాకర్షణ, నమ్మకం చిరంజీవిపై ఉందన్న విషయం అర్థం అవుతుంది. చిరంజీవి జనసేనకు సపోర్ట్ గా ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రయోజనం చేకూరడం ఖాయం.
కానీ చిరంజీవి జనసేన పార్టీలో అధికారికంగా చేరడం అటు పవన్ కి ఇటు చిరంజీవికి కూడా ఇష్టం లేని అంశం. దానికి కారణం ప్రాధాన్యత మరియు ఆధిపత్యం. చిరంజీవి పవన్ కి అన్నయ్య, వయసులో పెద్దవాడు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కి గాడ్ ఫాదర్. కాబట్టి ఒకవేళ జనసేనలో చిరంజీవి చేరితే ఆయన స్థానం ఏమిటీ? పార్టీకి పెద్ద చిరంజీవా లేక పవన్ కళ్యాణా? అనే సందేహం రాకపోదు. పెద్దవాడు కాబట్టి.. తాను స్థాపించిన పార్టీలో చిరంజీవికి మొదటిస్థానం ఇవ్వలేక.. అన్నయ్యను వెనకుంచి పార్టీకి పెద్దన్నలా ప్రవర్తించలేక ఆయన సతమతమయ్యే ప్రమాదం ఉంది. అలాగే చిరంజీవి సైతం పవన్ పెట్టిన పార్టీలో ప్రథమ స్థానం తీసుకున్నప్పటికీ… అపరాధ భావం ఫీలయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టే… చిరంజీవి జనసేన పార్టీ జోలికి వెళ్ళడు అనేది అక్షర సత్యం. అలాగే వీరిద్దరి స్వభావాలు కూడా విరుద్ధంగా ఉంటాయి. చిరంజీవిది సామరస్యం..పవన్ ది దూకుడు స్వభావం.