YCP: విశాఖలో ఏం జరుగుతోంది? వైసీపీ నుంచి నాయకులు బయటకు వెళ్తున్నారు ఎందుకు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో బలమైన చర్చ నడుస్తోంది. ఒకవైపు విశాఖ రాజధాని అంటూ జగన్ సర్కార్ హడావిడి చేస్తోంది. ఇటువంటి సమయంలోనే నేతలు పార్టీని వీడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రస్థాయిలో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. సాగరనగరంలో రోజురోజుకు పార్టీ బలహీనమవుతుందన్న వార్త.. పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. లోపాలను అధిగమించలేకపోతే వచ్చే ఎన్నికల్లో దారుణ ఓటమి తప్పదు అన్న విశ్లేషణలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
వైసిపి ఆవిర్భావం నుంచి ఎంతోమంది సీనియర్లు విశాఖ జిల్లా నుంచి పార్టీలో చేరారు. కొణతాల రామకృష్ణ అయితే అన్నీ తానై వ్యవహరించారు. కానీ ఆయనకు అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదు. పైగా అవమానాలు ఎదురయ్యాయి. దీంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. దాడి వీరభద్రరావు పార్టీలో చేరారు. ఆయన కూడా సముచిత స్థానం దక్కడం లేదు. కేవలం జూనియర్లను పెట్టుకుని పార్టీని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. మొదట అవంతి శ్రీనివాస్ కు, ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కు నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు. అయితే వీరు పేరుకే మంత్రి పదవులు కానీ.. అన్ని రకాల నిర్ణయాలు జగన్ సామంత రాజులుగా ఉన్న వై వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు తీసుకోవడంతో.. మంత్రులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారన్న అపవాదు ఉంది.
తాజాగా కీలక నాయకులు ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు తన పదవిని వదులుకొని మరి జనసేనలో చేరారు. తాజాగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సైతం జనసేనలో చేరారు. జగన్ తనకు ఎన్నో రకాల అవకాశాలు ఇచ్చారని.. స్థానిక నాయకత్వం పనితీరు బాగాలేదని ఆరోపణలు చేశారు. ఇవి వైవి సుబ్బారెడ్డి పైనేనని టాక్ నడుస్తోంది. ఆయన ఒంటెద్దు పోకడలు నచ్చక చాలామంది నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయన పార్టీ శ్రేణులకు అందుబాటులోకి రావడం చాలా కష్టం. హైదరాబాదు నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మొన్నటి వరకు టిటిడి అధ్యక్షబాధ్యతలు నిర్వర్తించడంతో విశాఖ ను చూడడం గగనంగా మారింది. ఇటువంటి తరుణంలో పార్టీలో సమస్యలు పెరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు మధ్య సమన్వయం లేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. వై వి సుబ్బారెడ్డి పరిష్కరించకపోవడంతో ఎవరికి వారే పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయేందుకు ఆలోచన చేస్తున్నారు.
విజయ్ సాయి రెడ్డి ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా ఉండేటప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. జీవీఎంసీ ఎన్నికలతో పాటు ఉత్తరాంధ్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయం అందించడంలో ఆయన పాత్ర విశేషం. కానీ విజయసాయిరెడ్డి వెళ్లిపోయిన తర్వాత వై వి సుబ్బారెడ్డి వచ్చారు. విజయసాయి మనుషులుగా ముద్ర పడిన వారిపై రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలోనే నేతలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వరకు వైవి సుబ్బారెడ్డి కొనసాగితే మాత్రం చాలామంది నాయకులు పార్టీని వీడే అవకాశం ఉంది. దీనిపై హై కమాండ్ కు సైతం ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.