Etela Rajender: ఈటల రాజేందర్‌ దారెటు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో తన గెలుపుతోపాటు బీజేపీ విజయంపై ఈటల భారీగా ఆశలు పెట్టుకున్నారు. బీసీ ముఖ్యమంత్రి నినాదం, ఎస్సీ వర్గీకరణ అంశాలు బీజేపీ గెలుపులో కీలకపాత్ర పోషిస్తాయని భావించారు.

Written By: Raj Shekar, Updated On : December 25, 2023 9:49 am

Etela Rajender

Follow us on

Etela Rajender: ఈటల రాజేందర్‌.. తెలంగాణ రాజకీయాలకు పరిచయం అక్కరలేని నేత. వరుసగా ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికై ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. కానీ, అనూహ్యంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పడవలపై ప్రయాణం చేసి వరుస విజయాలకు ఆయనే బ్రేక్‌ వేసుకున్నాడు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌తోపాటు కేసీఆర్‌ను ఓడించాలన్న లక్ష్యంతో గజ్వేల్‌ నుంచి కూడా బీజేపీ తరఫున పోటీ చేశారు. పశ్చిమ బెంగాల్‌ తరహాలో బీజేపీ తెలంగాణలో చేసిన ప్రయోగం ఇక్కడ విఫలమైంది. ఫలితంగా ఈటలకు రెండు నియోజకవర్గాల్లో పరాభవం ఎదురైంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈటల దారెటు అన్న చర్చ ఆయన అభిమానుల్లో జరుగుతోంది. బీజేపీ ఎలాంటి పదవి ఇస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌ ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. బీజేపీ నుంచే లోక్‌సభకు పోటీ చేస్తారా.. లేక పార్టీ మారతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఓటమి తర్వాత మౌనం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో తన గెలుపుతోపాటు బీజేపీ విజయంపై ఈటల భారీగా ఆశలు పెట్టుకున్నారు. బీసీ ముఖ్యమంత్రి నినాదం, ఎస్సీ వర్గీకరణ అంశాలు బీజేపీ గెలుపులో కీలకపాత్ర పోషిస్తాయని భావించారు. కానీ, ఈ రెండు నినాదాలను తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ నినాదాలు ప్రజల్లోకి అంతగా వెళ్లలేదు. మరోవైపు బీజేపీ – బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న కాంగ్రెస్‌ నినాదం ముందు ఈ రెండ నినాదాలు చిన్నబోయాయి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఈటలతోపాటు కీలక నేతలు ఓడిపోయారు.

‘బండి’ని తప్పించడంలో కీలకపాత్ర
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి మరో కీలక కారణం అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించడం. ఇందులో కీలక పాత్ర పోషించారు ఈటల రాజేందర్‌. బీజేపీలోకి కొత్తగా వచ్చినప్పటికీ పార్టీ అధిష్టానం ఆయనకు మంచి గుర్తింపు ఇచ్చింది. కీలక పదవులు అప్పగించింది. అయినా, ఈటల పార్టీలోకి కొంతమంది సీనియర్లతో ఓ వర్గం ఏర్పాటు చేశారు. ఇది బండి సంజయ్‌కు వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెట్టింది. చివరకు ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తేనే ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ అధిష్టానాన్ని నమ్మించింది. వీరి మాటలు నమ్మి అధిష్టానం బండిని తప్పించి ఎన్నికల్లో చేతులు కాల్చుకుంది. అయితే బండిని తప్పించడంలో కీలకంగా పనిచేసిన ఈటల రాజేందర్, రఘునందర్‌నావు, అర్వింద్‌తోపాటు చాలా మంది ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. బండిని తప్పించారన్న కారణంగా ఓటర్లు వీరిని ఓడించారన్న ప్రచారం జరిగింది.

అధిష్టానం దృష్టిలో నెగెటివ్‌..
అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఈటల రాజేందర్‌పై బీజేపీ అధిష్టానానికి మంచి నమ్మకం ఉండేది. కానీ ఎన్నికల తర్వాత అది పూర్తిగా తొలగిపోయింది. ఈటలకు అనవసర ప్రాధాన్యం ఇచ్చామా అని కమలనాథులు భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసేవారిని కాకుండా, మధ్యలో వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చి పొరపాటు చేశామా అని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈనేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈటల భవితవ్యం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.

లోక్‌సభ బరిలో..
అయితే బీజేపీని వీడతారని ఈటలపై ప్రచారం జరుగుతోంది. కానీ, ఈటల మాత్రం పార్టీ ఆదేశం మేరకు పార్లమెంట్‌ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీజేపీ ప్రజలను చైతన్య పరిచిందన్నారు. కష్టపడింది బీజేపీ కానీ, లబ్ధి పొందింది కాంగ్రెస్‌ అని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనేనని కాంగ్రెస్‌ విష ప్రచారం చేయడం బీజేపీకి నష్టం చేసిందని పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసే తన ఓటమికి అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో విష ప్రచారం చేశారని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తం కావాలన్నారు. రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు ఉంటాయని, వాటిని గ్రహించి ధర్మం, న్యాయం గెలుపు కోసం పని చేయాలని క్యాడర్‌కు సూచించారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం పనిచేస్తామన్నారు.

మల్కాజ్‌గిరి నుంచి పోటీ..
వచ్చే ఎన్నికల్లో మొదట మెదక్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని ఈటల రాజేందర్‌ భావించారు. కానీ, కేసీఆర్‌ కూడా మెదక్‌ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో లోక్‌సభకు వెళ్లాలని కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లు సమచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌పై పోటీచేసి ఓడిపోయిన ఈటల రాజేందర్‌ ఈసారి అలా జరుగకుడాదని భావిస్తున్నారు. మెదక్‌ నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తే, తాను మల్కాజ్‌గిరి నుంచి బరిలో ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడి నుంచి సీనియన్‌ నేత మురళీధర్‌రావు కూడా టికెట్‌ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఈటలకు టికెట్‌ ఇస్తుందా.. ఇస్తే ఎక్కడి నుంచి ఇస్తుంది. టికెట్‌ ఇవ్వకుంటే ఈటల ఏం చేస్తారు అన్న అంశాలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి.