Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ను తెలుగుదేశం పార్టీకి చేరువు చేసింది ఎవరు? టిడిపి అంటే పడని పీకేను చంద్రబాబు చెంతకు చేర్చింది ఎవరు? ఆయన టిడిపి రూట్లోకి రావడానికి మధ్యవర్తిత్వం వహించింది ఎవరు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ అంటే తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం పడదు. గతంలో ఆయన వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడమే కారణం. చంద్రబాబు, లోకేష్ ల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు గతంలో పీకే పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.అయితే అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా చంద్రబాబు వద్దకు వచ్చి చర్చలు జరపడం విశేషం. దీని వెనుక పెద్ద వ్యక్తి ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. మమతా బెనర్జీతో చంద్రబాబుకు మంచి సంబంధాలే ఉన్నాయి. మొన్న చంద్రబాబు అక్రమ కేసుల్లో అరెస్టు సమయంలో మమతా బెనర్జీ స్పందించారు. ఆ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని ఆమె సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే లోకేష్ ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్లు ప్రచారం జరిగింది. ఢిల్లీలో కలుసుకున్న ఇద్దరూ చర్చలు జరిపినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అది నిజమేనని ఇప్పుడు తేలుతోంది. ఇప్పటికే రాబిన్ శర్మ నేతృత్వంలోని బృందం తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తోంది. ఆ టీంకు కీలక సూచనలు, సలహాలు ఇచ్చే బాధ్యతను ప్రశాంత్ కిషోర్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అయితే మమతా బెనర్జీ సూచనలతోనే చంద్రబాబు పీకే ను అప్రోచ్ అయ్యారని తెలుస్తున్నా.. తెర వెనుక మాత్రం మరో నేత ఉన్నారని ప్రచారం సాగుతోంది. ప్రశాంత్ కిషోర్ విజయవాడ రావడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సీఎం రమేష్ కారణమని తెలుస్తోంది. సీఎం రమేష్ పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందినవారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన టిడిపిని వీడి బిజెపిలో చేరారు. అలా చేరిన ఆయన మనసంతా టిడిపి పైనే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నదే ఆయన లక్ష్యం. అందుకే సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించడమే కాదు.. రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ప్రత్యేక విమానంలో పీకే నువ్వు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే తాజాగా సీఎం రమేష్ పేరు బయటకు రావడంతో జాతీయస్థాయిలో సైతం చర్చ నడుస్తోంది. బిజెపి నేత అయిన సీఎం రమేష్ చంద్రబాబు కోసం కష్టపడుతున్నారని.. తన సొంత పార్టీ బిజెపిని బలోపేతం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని.. బిజెపిలో ఉంటూ టిడిపి కోసం పని చేస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. పైగా దీనిని పురందేశ్వరికి అంటగాకుతోంది. ఆమె సలహా లేకుండా సీఎం రమేష్ ఈ పని చేసి ఉండరని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. వాటిని వైసిపి శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.