Gangula Kamalakar: ఎమ్మెల్యేగా కరీంనగర్‌ను పదేళ్లు, మంత్రిగా కరీంనగర్ జిల్లాను ఐదేళ్లు ఏలిన క్వారీ కింగ్.. గంగుల కమలాకర్‌ను.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్వల్ప తేడాతో విజయం వరించింది. అయితే ఆయన పోటీ చేసిన పార్టీ బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది. దీంతో గెలిచిన సంబురం గంగులలో మచ్చుకైనా కనిపించడం లేదు. విజయోత్సవంలో కూడా గంగుల పాల్గొనకపోవడమే ఇందుకు నిదర్శనం. తాను గెలిచానన్న సంబురం కన్నా.. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి గెలవడం, రాష్ట్ర క్యాబినెట్‌లో స్థానం లభించడమే ఇప్పుడు గంగులను ఎక్కువగా బాధపెడుతున్నట్లు తెలుస్తోంది. ‘పొన్నం’ తీసుకున్న కీలక నిర్ణయం ఆయన రాతనే మార్చేసింది. మరోవైపు ఎవరైతే తనపై పెత్తనం చెలాంచాడో.. అతని తోక కత్తిరించేలా చేసింది.
గేటు దాటని గంగుల..
ఇక ఎన్నికల ఫలితాలు వచ్చి.. 20 రోజులు గడిచింది. కానీ, కరీంనగర్ ఎమ్మెల్యే ఓటర్లకు చూద్దామన్నా కనిపించడం లేదు. ఆయనపో పోటీ చేసిన స్వల్ప తేడాతో ఓడిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్‌లోనే ఉంటున్నారు. ప్రజల మధ్యకు వెళ్తున్నారు. కానీ, గంగుల మాత్రం గేటు దాటడం లేదని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో మాత్రమే టీవీల్లో కనిపిస్తున్నారు. కనీసం క్యాడర్‌కు కూడా గంగుల దర్శనం కరువైంది. తన గెలుపు కోసం కష్టపడిన నాయకులను కూడా గంగుల కలవకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 20 రోజులుగా అసెంబ్లీ బయట కానీ, అసెంబ్లీలో కానీ మాట్లాడిన దాఖలాలు లేవు.
గంగుల అక్రమాలపై చర్యలు?
కరీంనగర్‌ను 15 ఏళ్లుగా తన సామ్రాజ్యంగా మార్చుకున్న గంగుల కమలాకర్ అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆయన అనుచరులు సాగించిన దౌర్జన్యాలకు అయితే లెక్కేలేదు. అయినా వారిని మంత్రిగా కమలాకర్ వెనుకేసుకొచ్చారు. కబ్జాలను కప్పి పుచ్చారు. బాధితులపైనే కేసులు పెట్టించారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, కరీంనగర్‌కే చెందిన పొన్నం ప్రభాకర్‌కు మంత్రి పదవి రావడంతో గంగుల, ఆయన అనుచరుల బాధితులంతా ప్రజావాణిలో ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గంగుల, ఆయన అనుచరులు సాగించిన దౌర్జన్యాలను ప్రభుత్వంతోపాటు జిల్లా మంత్రి పొన్న ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎన్నికల సమయంలో గెలుపు కోసం అయితే అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గంగుల ఎక్కడా కనిపిచండం లేదని, ఎవరితో మాట్లాడడం లేదని తెలుస్తోంది.
ఇప్పటికే ఈడీ కేసు..
ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గంగుల కమలాకర్ అక్రమాస్తులపై విచారణ చేస్తోంది. గ్రానైట్ క్వారీల్లో అక్రమాలపనై ఈడీ విచారణ జరుపుతోంది. సీబీఐ కేసు నమోదు చేసింది. ఐటీ రైడ్స్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ధాన్యం కొనుగోళ్లు, సీఎమ్మార్ అప్పగింతలో అక్రమాలు చేశారని, మిల్లర్లతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై విచారణ జరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మిల్లులపై అధికారులు దాడి చేస్తున్నారు. దీంతో తన పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని గంగుల ఆందోళ చెందుతున్నట్లు తెలుస్తోంది.