Ahmedabad Plane Crash Reason: అన్నీ బాగుంటే.. అనుకున్నట్టు జరిగితే విమానం సరైన సమయంలో గమ్యస్థానానికి చేరుకుంటుంది. ప్రయాణికులను అత్యంత సురక్షితంగా తన ప్రాంతాలకు చేరవేర్చుతుంది. ఈ ప్రక్రియలో అన్ని అనుకున్నట్టు జరిగితే పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రమాదం కూడా చోటు చేసుకునే అవకాశం ఉండదు. కానీ ఏదైనా అవాంతరం ఎదురైతే.. అనుకోని సంఘటన చోటు చేసుకుంటే విమానయానం కాస్త విషాదయానంగా మారుతుంది. గురువారం ప్రధానమంత్రి సొంత రాష్ట్ర ఆర్థిక రాజధానిలో చోటుచేసుకున్న ప్రమాదం కూడా అటువంటిదే. ఈ ప్రమాదంలో ఏకంగా 242 మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి. మృతుల్లో ఎక్కువమంది భారతీయులే ఉన్నారు.. అహ్మదాబాద్ ఘటన తర్వాత అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వాస్తవానికి విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎందుకు కుప్పకూలిపోతుంది.. ఇలా ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణాలు ఏమిటి? అనే విషయాలపై ప్రత్యేక కథనం.
పైలెట్ తప్పిదం కూడా ఉండొచ్చు
విమానాన్ని నడిపేది పైలట్. విమాన చోదకుడు చేసే తప్పుల వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు చోటు చేసుకోవచ్చు. విపరీతమైన ఒత్తిడి.. తట్టుకోలేని అలసట.. కొన్ని సందర్భాల్లో విమానం నడపడంలో తప్పులు చేయడం.. సమాచారంలో లోపాలు.. కొన్ని సందర్భాలలో అనారోగ్య సమస్యలు వంటివి విమాన ప్రమాదాలకు కారణమవుతాయి.
టెక్నికల్ ఫాల్ట్
మనలలో టెక్నికల్ ఫాల్ట్ వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. విమానంలో ఏదైనా ఒక పార్ట్ సరిగా పనిచేయకపోవడం వల్ల ప్రమాదం చోటు చేసుకోవచ్చు. ఇంజన్, విద్యుత్, హైడ్రాలిక్ వ్యవస్థల్లో చోటు చేసుకున్న సాంకేతిక లోపాల వల్ల గాల్లో ఉన్నప్పుడే విమానం మీద నియంత్రణ కోల్పోవడం ప్రారంభమవుతుంది. అలాంటి సమయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఒకవేళ విమానం అదే సమయంలో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
వాతావరణం
విమానం గాల్లో ఎగిరే సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటే కూలిపోయే ప్రమాదం ఉంది. ల్యాండింగ్, టేక్ ఆఫ్ సమయంలో విమానాలు కుప్పకూలి పోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అయితే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు పైలట్లు విమాన వేగాన్ని నియంత్రిస్తారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు వాతావరణం లో ఏం జరిగింది? విమానంలో ఏమైనా సాంకేతిక సమస్యలు చోటుచేసుకున్నాయా? పైలట్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా? లేక ఇతర చీకటి శక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణాలలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ మనదేశంలో ఈ స్థాయిలో విమాన ప్రమాదం జరగడం.. ఇంతటి భారీ సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో బీతావాహంగా పరిస్థితి ఉంది.. అయిన వాళ్లను కోల్పోవడంతో వారి బంధువులు కన్నీరు పెడుతున్నారు.