Telangana BJP: బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతా అని కేసీఆర్.. నయా రజాకార్ కేసీఆర్‌ను గద్దె దించుతామని బీజేపీ.. ఇలా సాగింది ఏడాది క్రితం వరకు బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ఫైట్.. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది. నువ్వా నేనా అన్నట్లు పోటీపడిన బీఆర్‌ఎస్ బీజేపీల్లో.. బీజేపీ ఇప్పుడు వెనక్కు తగ్గింది. కాదు కాదు.. ఎన్నికల రేసు నుంచి పూర్తిగా తప్పుకుంది అనిపిస్తోంది. ఎందుకు ఇలా జరిగింది అనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. బీజేపీ నాయకులు కూడా సైలెంట్ అయ్యారు. ఇక అన్ని పార్టీలకంటే ముందు ఉండే పార్టీ సోషల్ మీడియా వింగ్ కూడా సైలెంట్ అయింది.
డబుల్ డిజిట్ చాలన్నట్లు..
బీజేపీ ప్రస్తుత పరిస్థితి చూస్తే.. ఇప్పుడు ఉన్న సింగిల్ డిజిట్ సీట్లు డబుల్ డిజిట్ అయితే చాలు అన్నట్లు ఉంది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్నట్లుగా సాగింది. ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు బండి సంజయ్ బీజేపీని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు.అప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన కమలం గుర్తు ఇప్పుడు పల్లె ప్రజలకు కూడా తెలిసేలా చేయడంలో బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర ఎంతో ఉపయోగపడింది అనడంలో సందేహం లేదు. కానీ బండి సంజయ్‌ను తప్పించిన తర్వాత ఆ పార్టీలో ఊపు కూడా తగ్గిపోయింది. అంతా సైలెంట్ అయ్యారు. ఇటీవల వేసిన 14 కమిటీలు కూడా మొక్కుబడిగా మారాయి.
బలమైన సోషల్ మీడియా వింగ్..
దేశంలో బలమైన సోషల్ మీడియా వింగ్ ఉన్న ఏకైక పార్టీ బీజేపీ. పార్టీ ఏ కార్యక్రమం చేసినా.. ప్రతిపక్షాలు ఏ పొరపాటు చేసినా క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్టులు, కౌంటర్లు ఉంటాయి. తెలంగాణలో కూడా ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ బలంగా తయారైంది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సోషల్ మీడియా ప్రచారంలో దూసుకుపోయింది. బీఆర్‌ఎస్ ఏమాత్రం తడబడినా, నెరవేర్చని హామీలను, మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టింది. సాలు దొర సెలవు దొర నినాదంతో ఖాతా ఓపెన్ చేసి బీఆర్‌ఎస్‌ను చెడుగుడు ఆడింది. బీజేపీ ఆఫీస్ వద్ద డిస్‌ప్లే బోర్డు ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ఇవన్నీ సైలెంట్ అయ్యాయి.
కేంద్ర మంత్రులు వచ్చినా ప్రచారం కరువు..
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాతీయ నేతలు ఎవరు వచ్చినా పత్రికలు, టీవీల్లో పెద్దపెద్ద ప్రకటనలు కనిపించేవి. విపరీతైమన ప్రచారం జరిగేంది. కానీ కిషన్‌రెడ్డి అధ్యక్షుడు అయ్యాక ప్రచార ఆర్భాటాలు కనిపించడం లేదు. ఎన్నికల సమయంలోనే ప్రచారం కావాలి. కానీ, కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఇప్పుడు ప్రచారానికి కూడా దూరంగా ఉంటుంది. ఇటీవల కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, పీయూష్‌గోయల్ వచ్చారు. కానీ వారు వచ్చిన విషయం చాలా మందికి తెలియదు. వాచు ఏం మాట్లాడారన్నది టీవీ చానెళ్లు, పత్రికల్లో మాత్రమే వచ్చాయి. సోషల్ మీడియాలో కానీ, బీజేపీ నేతల మాటల్లో కానీ కనిపించడం లేదు.
బీజేపీ తీరు చూస్తుంటే అధికార బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. అందుకే ఎన్నికల రేసు నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.