CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రేసులో కేసీఆర్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన గులాబీ బాస్ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయంతో రికార్డు సృష్టించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అన్ని విషయాల్లో విపక్షాలకంటే ముందే ఉంటున్నారు. షెడ్యూల్‌కు 50 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించారు. అన్ని పార్టీలకన్నా ముందే మేనిఫెస్టో ప్రకటించారు. ఫ్లాష్ స్కీంలతో మెజారిటీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్ బీమా పేరుతో 93 లక్షల కుటుంబాలను ప్రభావితం చేయనున్నారు. పెన్షన్లు, రైతుబంధు, దళితబంధు, బీసీ బంధు, మైనారిటీబంధు తదితర స్కీంలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ప్రచారంలోనూ దూకుడు..
టికెట్లు, మేనిఫెస్టో విషయంలోనే కాదు.. ప్రచారంలోనూ కేసీఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. దాదాపు నెల రోజులు అనారోగ్యంతో కేసీఆర్ జనానికి కనిపించలేదు. కానీ, పూర్తిగా కోలుకున్నాక ప్రచారం మొదలు పెట్టారు. నోటిఫికేషన్ వచ్చే నాటికే 30 సభలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే ఐదారు సభలు నిర్వహించారు. తాజాగా మంగళవారం కొడుకు నియోజకవర్గం సిరిసిల్ల, మేనల్లుడి నియోజకవర్గం సిద్దిపేటలో ప్రచారం చేశారు. కుటుంబ సభ్యులతోపాటు కేటుంబేతర అభ్యర్థులను గెలిపించేలా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఉద్యోగులు, నిరుద్యోగుల్లోనే వ్యతిరేకత..
9 ఏళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌పై తెలంగాణలో 60 శాతం వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయినా వాటిని అధిగమించగలమన్న ధీమా కేసీఆర్‌లో కనిపిస్తోంది. ఉద్యోగులు, నిరుద్యోగులు మాత్రమే తమకు ఓటు వేయరని, మిగతా అన్నివర్గాలు తమకు కలివస్తాయని గులాబీ బాస్ లెక్కలు వేసుకుంటున్నారు. పెన్షనర్లు, రైతుల ఓట్లు 90 శాతం బీఆర్‌ఎస్‌కే పడతాయన్న నమ్మకంతో ఉన్నారు. తాజాగా ప్రకటించిన కేసీఆర్ బీమాతో తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేద కుటుంబాల్లో కనీసం సగం ఓట్లు బీఆర్‌ఎస్‌కు మళ్లుతాయని అంచనా వేస్తున్నారు. దళితబంధు, బీసీబంధు, మైనారిటీ బంధు కొనసాగిస్తున్న నేపథ్యంలో వారి ఓట్లు కూడా బీఆర్‌ఎస్‌కే అని లెక్కలు వేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు నిరుద్యోగులు, ప్రతినెలా సరైన సమయానికి వేతనాలు, డీఏలు, పీఆర్సీ ఇవ్వనందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉంటారని భావిస్తున్నారు. వీరంతా కలిస్తే 10 నుంచి 15 లక్షలకు మించి ఉండని గులాబీ బాస్ ఆలోచన. మిగతా 3 కోట్ల మందిలో కనీసం 2 కోట్ల ఓట్లు బీఆర్‌ఎస్‌వే అన్న ధీమాతో ఉన్నారు. మరి ఓటర్ల నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి.