Homeజాతీయ వార్తలుCM KCR: ఏమైంది కేసీఆర్ కు.. ఎక్కడ కొట్టింది తేడా?

CM KCR: ఏమైంది కేసీఆర్ కు.. ఎక్కడ కొట్టింది తేడా?

CM KCR: తను స్కెచ్ వేస్తే ఎదుటివాడు గిలగిలా కొట్టుకోవాల్సిందే. తను ప్లాన్ వేస్తే వైరి వర్గం విలవిల అనాల్సిందే. తనను మించిన స్కెచ్చర్, ప్లానర్ వీడు అనే భ్రమలో ఉండే చంద్రబాబునే వలవలా ఏడిపించాడు. ఓటుకు నోటు దెబ్బతో తెలంగాణ ఖాళీ చేయించాడు. ఆంధ్రకు మాత్రమే పరిమితం చేయించాడు. అంతటి కేసిఆర్ కు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు.. గ్రహచారం తిరుగు ముఖం పడుతోంది. ఎక్కడో భారీ తేడా కొడుతోంది. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో వైఫల్యం తాజా ఉదాహరణగా కనిపిస్తోంది. కెసిఆర్ ఇతర పార్టీలను పారేసిన తీరు.. వైరి పార్టీల నాయకులను వేధించిన తీరు, తన ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసిన తీరు ఎలా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతాన్ని మళ్లీ ఎవరూ చింపిన విస్తరి చేయకుండా ఒక స్థిరత్వాన్ని అందించాడు. కానీ ఆ క్రమంలోనే ఆయన దారి తప్పాడు. ఆశలను పెంచుకుంటూ పోయాడు.. 2019లో చంద్రబాబు చేసిన తప్పును కెసిఆర్ పునరావృతం చేశాడు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ నిర్వహించిన యాంటీ బీజేపీ పాత్ర, నిధుల పంపిణీ మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కూడా ఆగ్రహంగా ఉంది. దీనివల్లే తెలంగాణ ప్రాంతం మీద బిజెపి ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ను చంపి, పెద్దపులి లాంటి బీజేపీని కెసిఆర్ తన మీదికి తెచ్చుకున్నాడు.

CM KCR
CM KCR

ఆ వ్యూహాలకు పదును ఏదీ

దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఇలా ఏ ఎన్నిక తీసుకున్నా సరే కేసీఆర్ వ్యూహ రచనలు గతంలో లాగా లేవు అనేది స్పష్టమైనది. జనం తనని నమ్మడం లేదని, రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది అని చెప్పడానికి ఇవి సంకేతాలు. దీంతో తన ప్లానింగ్ మీద తనకే అనుమానం వస్తున్నది. ముందుగానే చెప్పినట్టు పెద్దపులి లాంటి బిజెపి కేసిఆర్ మీదకి దండెత్తుకుంటూ వస్తోంది. అందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికను తెరపైకి తీసుకొచ్చింది. ఈ ఎన్నికను కెసిఆర్ అసలు ఊహించలేదు. ఇలాంటి ఎన్నికలు మునుముందు చాలా వస్తాయి. బిజెపి స్ట్రాటజీనే అది. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తే, ఖజానా నుంచి పథకాల పేరిట పైసలు పంపిణీ చేస్తే ఓట్లు వాటంత అవే వచ్చి పడతాయనే భ్రమ ఇంకా కేసీఆర్ ను వదిలిపెట్టినట్టు లేదు. హుజురాబాద్ ఫలితంతో నైనా కెసిఆర్ లో మార్పు కొంచెం కూడా కనిపించడం లేదు. ఇక మొన్న దసరా రోజు ప్రారంభించిన బీఆర్ఎస్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. జాతీయ రాజకీయాల్లో వీసమెత్తు కూడా ముందు బాట కూడా కనిపించడం లేదు. ఇంకోవైపు మునుగోడు తరుముకొస్తోంది. బిజెపి నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీనే ఫిక్స్ చేసి, ఢిల్లీ నుంచి బజారుకు లాగి, హైదరాబాద్ వీధుల్లో బట్టలు ఇప్పాలనేది ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. కొద్దిరోజులు కేసిఆర్ అనుకున్నట్టుగానే కథ సాగింది.. కానీ చివర్లో ఎక్కడో తేడా కొట్టింది. ప్లాన్ అంతా ఉల్టా పల్టా అయింది.

నిజంగానే కూలుతుందా

ఆ నలుగురు ఎమ్మెల్యేలకు వందేసి కోట్లు, కేంద్ర సంస్థల్లో మంచి పోస్టులు బిజెపి ఆఫర్ ఇచ్చిందట! అసలు నలుగురిని కొంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పటికి ఇప్పుడు వచ్చిన ఫాయిదా ఏముందనే కామన్ క్వశ్చన్ కు టిఆర్ఎస్ వద్ద సమాధానం లేదు. నలుగురితోనే సర్కార్ కూలుతుందా? పైగా ఆ నలుగురూ అంత తోపులా? ఆ నలుగురిలో ముగ్గురు ఈ తోవలోనే కదా టిఆర్ఎస్ లోకి వచ్చి పడింది? పైగా బిజెపి ఎవరికి పడితే వాళ్లకు డబ్బు కట్టలు ఇచ్చేసి, ఎమ్మెల్యేలను కొనుక్కోండి అని చెబుతుందా? ఇలాంటి ప్రశ్నలతో కేసీఆర్ ఆశించిన ప్రయోజనం నెరవేరకుండా పోయింది. జనం నవ్వుకున్నారు తప్ప నమ్మలేదు. అయితే తన కనుసన్నల్లో నడిచే మీడియా మూడు రోజుల నుంచి హడావిడి చేస్తోంది. నిన్నంతా ఆడియో లీకు లంటూ నానా పెంట చేసింది. ఎప్పుడైతే ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్టు ను కొట్టిపారేసిందో అప్పుడే ఆడియో లీకులంటూ పోలీసులు మీడియాకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఏం చేయాలో కేసీఆర్ కు అర్థం కావడం లేదు. జాతీయ మీడియా నమ్ముకుంటే ఎవరూ పట్టించుకోలేదు. జాకెట్లకు జాకెట్లు యాడ్స్ ఇచ్చినా ఆ కన్సర్న్ కేసీఆర్ మీద వారు చూపించలేదు. ఎప్పుడైతే సంఘటనా స్థలంలో డబ్బు లేదో అప్పుడే కేసు తనంతట తాను వీక్ అయిపోయింది. పైగా ఆ మధ్యవర్తులు ప్రజా ప్రతినిధులు కారు.

CM KCR
CM KCR

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కారు. కేసులో బలమైన సాక్షాధారాలు కూడా లేవు. అందుకే ఢిల్లీకి వెళ్లి రచ్చ చేయాలని కెసిఆర్ అనుకున్నా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఎవరైనా ఢిల్లీ రేంజ్ పెద్దమనిషి ఫోన్లో దొరికి ఉంటే, పిచ్చి కూతలు కనుక కోసి ఉంటే టిఆర్ఎస్ కు ఎక్కడా లేని బూస్ట్ వచ్చేది. సో ఇప్పటివరకు కేసీఆర్ ది వ్యూహాత్మక మౌనమే. మాట్లాడితే ఇక కెసిఆర్ మాత్రమే అంతే.. ఎవరూ స్పందించవద్దు అని కేటీఆర్ చేసిన ట్వీట్ కూడా అదే. ఇక ఈ ఎపిసోడ్ లో భారతీయ జనతా పార్టీ ఆలస్యంగానైనా ఎదురుదాడికి దిగింది. ముందుగా షాక్ తిన్నా సరే తర్వాత హైకోర్టుకు వెళ్లడం, యాదాద్రి గుడిలో ప్రమాణం చేయడం వంటివి పొలిటికల్ గా సరైన కౌంటర్లు. ఇలాంటి సమయంలో చాలా హుందాగా మాట్లాడే రఘునందన్ రావు వంటి వారికి అవకాశం ఇస్తే బిజెపికి చాలా నయం. ఇక హైకోర్టు గనుక బిజెపి పిటిషన్ మీద సీరియస్ గా స్పందిస్తే కథ మళ్ళీ వేరే ఉంటది.. అంటే మొయినాబాద్ ఎపిసోడ్ ఇంకా ముగిసిపోలేదు. మునుగోడు ఉప ఎన్నిక పూర్తయ్యేదాకా అలా నానుతూనే ఉంటుంది. నమస్తే తెలంగాణలో రోజూ బ్యానర్ వార్త అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అది కెసిఆర్ కు అవసరం. అది తీరిపోయాక సవాలక్ష కేసుల మాదిరే కోల్డ్ స్టోరేజీ లోకి వెళ్తుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular