Chandrababu Jail: జైల్లో చంద్రబాబుకు ఏమైంది

గత నెల 10న అర్ధరాత్రి నంద్యాలలో చంద్రబాబును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు మార్గం గుండా విజయవాడ తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.

Written By: Dharma, Updated On : October 11, 2023 11:33 am

Chandrababu Jail

Follow us on

Chandrababu Jail: చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారు. స్కిల్ స్కాం కేసులో గత 32 రోజులుగా చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు, హైకోర్టులో ఆయనకు ఊరట దక్కలేదు. అటు సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్న స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. దీంతో చంద్రబాబు రిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఈ తరుణంలో ఆయన అనారోగ్యానికి గురికావడం ఆందోళన కలిగిస్తోంది. జైలులో ఆశించిన స్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడం, గత నాలుగు రోజులుగా పెరిగిన ఎండ వేడి, రాత్రులు చలితో కూడిన భిన్న వాతావరణమే దీనికి కారణమని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఆరోగ్యం పై టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గత నెల 10న అర్ధరాత్రి నంద్యాలలో చంద్రబాబును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు మార్గం గుండా విజయవాడ తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. అప్పటినుంచి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ లో చంద్రబాబుకు ఒక గదిని కేటాయించారు. గతంలో మానసిక రోగులుగా ఉండే ఖైదీలకు ఆ బ్లాక్ ను కేటాయించేవారు. అయితే చంద్రబాబు ఉండే బ్యారె క్ చుట్టూ చెట్లు ఉండడంతో దోమలు స్వైర విహారం చేసేవి. దీంతో చంద్రబాబు అసౌకర్యానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో చంద్రబాబుకు వసతులు పెంచుతామని జైళ్ల శాఖ ప్రకటించింది.

మరోవైపు చంద్రబాబు రిమాండ్ తరువాత.. అనారోగ్యంతో ఓ రిమాండ్ ఖైదీ మృతి చెందడంతో అప్పట్లో దుమారం రేగింది. డెంగ్యూ బారిన పడిన ఓ రిమాండ్ ఖైదీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే గత నెల 25న భోజనాల సమయంలో జైల్లో తొక్కిసిలాట జరిగింది. ఆ సమయంలో ఓ రిమాండ్ ఖైదీ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా చంద్రబాబు అస్వస్థతకు గురి అయ్యారన్న వార్త టిడిపి శ్రేణుల్లో ఆందోళన పెంచుతోంది. ఆయన వయసు రీత్యా ఆలోచించైనా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

చంద్రబాబు డిహైడ్రేషన్ కు గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జైల్లోని మెడికల్ ఆఫీసర్ కూడా చెప్పినట్లు సమాచారం. మంగళవారం నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవ్ లు చంద్రబాబును మలాఖత్ లో కలిశారు. ఆయన యోగక్షేమాల గురించి అడిగినప్పుడు బాగానే ఉన్నానంటూ సమాధానం చెప్పినట్లు సమాచారం. కానీ బడలికగా ఉన్నట్లు గుర్తించి ఆరా తీయడంతో డిహైడ్రేషన్ గురించి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబుకు జైల్లో రోజుకు మూడుసార్లు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.