https://oktelugu.com/

కెసిఆర్ కి ఏమయింది? జనానికి షాకులమీద షాకులు

కెసిఆర్ స్టైలే వేరు, నడకే వేరు, నడవడికే వేరని ఇంతవరకూ మనం చెప్పుకుంటూ వచ్చాం. సడెన్ గా ఏమయింది? ఒక్కసారి తనలో ఇంతమార్పా? జనం తట్టుకోలేకపోతున్నారు. అసలేమయ్యింది కెసిఆర్ కి. ఏ నిర్ణయాలు ఇన్నాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేసారో అవన్నీ ఒక్కొక్కటి వెనక్కు తీసుకోవటం వెనక అంతరార్ధం తెలియక జనం, ముఖ్యంగా కెసిఆర్ అనుచరులు గిలగిలలాడుతున్నారు. ముందుగా నియంత్రిత వ్యవసాయం పేరుతో ఏ పంట వేయాలో నిర్ణయించటం అతి గొప్పగా ప్రచారం చేసుకొని ఇప్పుడు దాన్ని […]

Written By:
  • Ram
  • , Updated On : December 31, 2020 / 10:02 AM IST
    Follow us on

    కెసిఆర్ స్టైలే వేరు, నడకే వేరు, నడవడికే వేరని ఇంతవరకూ మనం చెప్పుకుంటూ వచ్చాం. సడెన్ గా ఏమయింది? ఒక్కసారి తనలో ఇంతమార్పా? జనం తట్టుకోలేకపోతున్నారు. అసలేమయ్యింది కెసిఆర్ కి. ఏ నిర్ణయాలు ఇన్నాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేసారో అవన్నీ ఒక్కొక్కటి వెనక్కు తీసుకోవటం వెనక అంతరార్ధం తెలియక జనం, ముఖ్యంగా కెసిఆర్ అనుచరులు గిలగిలలాడుతున్నారు. ముందుగా నియంత్రిత వ్యవసాయం పేరుతో ఏ పంట వేయాలో నిర్ణయించటం అతి గొప్పగా ప్రచారం చేసుకొని ఇప్పుడు దాన్ని వెనక్కు తీసుకున్నాడు. దానితో పాటు అంతకన్నా గొప్పగా ఆర్భాటంగా ప్రారంభించిన అదనపు కొనుగోలు కేంద్రాలు( మార్కెట్ యార్డులు కాకుండా) మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాడు. కాకపోతే అందుకు కేంద్ర రైతు చట్టాలని అడ్డంపెట్టుకోవటం కెసిఆర్ మార్కు చాణక్య మానుకోండి. అలానే వీటికన్నా గొప్పగా ప్రచారం చేసుకున్న ధరణి పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్ ప్రక్రియను సడలించాడు. ఓకే, ఇది కోర్టు ఒత్తిడితోనని సర్దుకు పోదాం. మరి ఎల్ ఆర్ ఎస్ లేకపోయినా పరవాలేదని కూడా ప్రకటించాడు. అంటే ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ అటకెక్కినట్లేనా? మరి ఇంతకుముందు వసూలుచేసిన డబ్బులు వాపసు ఇస్తారా సారూ. ఈ సందర్భంగానే బి ఆర్ ఎస్ ప్రక్రియను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఎన్నో ఏళ్ళ తర్వాత సడెన్ గా రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారు. అందరం సంతోషించాం. కాని జి హెచ్ ఎంసి నుంచి వచ్చిన మెసేజులు చూసి బిత్తర పోవటం అందరి వంతయ్యింది. ఎంతో కష్టపడి వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్లు అన్నీ సేకరించి దరఖాస్తు చేస్తే ఆ డాక్యుమెంట్లే లేవని, జతచేయలేదని మెసేజులు వస్తాయని ఎవరైనా కలగన్నారా? అదే జి హెచ్ ఎంసి మాయాజాలం. దీనితో నిర్ఘాంతపోయి పరుగులు తీస్తూ జి హెచ్ ఎంసి ఆఫీసుకు వెళ్తే వాళ్ళు నింపాదిగా మరలా ఇంకోక్కసారి ఆ డాక్యుమెంట్లు సమర్పించమని చెబితే మామూలుగానయితే అక్కడే వాడి చెంప చెళ్ళు మనిపించాలని అనిపించినా పైకి మాత్రం ఏమీ చేయలేని సామాన్యుడి సణుగుడులాగా తలవూపి బయటకు రావటం జనం వంతయ్యింది. మరి ఎల్ ఆర్ ఎస్ ఏమవుతుందో తెలియదు. కట్టిన డబ్బులు వాపసు ఇస్తారో లేదో. సరేలే బి ఆర్ ఎస్ కి ఇంతకన్నా 10 రెట్లు ఎక్కువే కట్టాం, అయినా ఏం చేసాము కాబట్టి లోలోపల సనుక్కోవటం తప్పించి. ఈ డబ్బులు పోతే పోనీ మరలా ఎల్ ఆర్ ఎస్ వూసెత్తకపోతే చాలు. ఏం చేస్తాం సామాన్యులం కదా.

    కెసిఆర్ నుంచి షాకుల మీద షాకులు 

    అంతటితో ఆగాడా అంటే లేదు ఉద్యోగస్తులకు ఎన్నాళ్ళనుంచో అపరిష్కృతంగా వున్న సమస్యలను అమాంతంగా ప్రేమ పుట్టుకొచ్చి అన్నింటినీ పరిష్కరించే దశగా అడుగులు వేయటం జనానికి ఇంకో షాకు. అయితే ఏమయ్యిందిలే జనానికి మంచే జరుగుతుంది కదా. గతాన్ని మర్చిపోదాం. భవిష్యత్తుపై ఆశతో బతుకుదాం. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడే అందినవార్త ఆయుష్మాన్ భారత్ ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుందట. ఇది అన్నింటికన్నా పెద్ద షాక్. నిన్నటిదాకా దీనిపై ఎన్నిమాటలు మాట్లాడారు, ఎంతగా తిట్టి పోశారు? ఇంత చెత్త స్కీము ఇంకోటి లేదని చెప్పారు. టివిల్లో అవతలి వాళ్ళను ఉతికి ఆరేశారు. ఇప్పుడు సడెన్ గా ఆ పధకాన్ని అమలుచేస్తామని చెప్పటం షాక్ కాక ఏమిటి? అదేమంటే దాన్ని అమలుచేసి అదనంగా ఆరోగ్యశ్రీలో వుండే బెనిఫిట్లను కూడా ఇస్తారట. మరి ఇదే పని అప్పుడే చేసుండొచ్చు కదా. ఇంత లేటుగా జ్ఞానోదయం అయ్యిందా? పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు తీసుకొని అదనంగా రైతు బంధు కూడా ఇస్తున్నారు కదా? మరి ఇదే పంధాలో  ఆయుష్మాన్ భారత్ ను అమలు చేసి ఉండొచ్చు కదా. మరి ఇప్పుడు ప్రతిపక్షాలకు ఏమి సమాధానం చెబుతారు? అసలు మీ క్యాడర్ కి ఏమి వివరణ ఇచ్చుకుంటారు? టివిల్లో అవతలి వాళ్ళను విమర్శించిన మీ నాయకులకు ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ( వాళ్ళు స్మార్ట్ గా వుంటే) సమాధానం చెప్పే దమ్ము ఉందా? నాయకులు పర్వాలేదు మీ ప్రాపకం కోసం పనిచేసే వాళ్ళు కాబట్టి ఒక్కసారి మొఖం దులుపుకొని మళ్ళా వాదనలు తయారుచేసుకుంటారు. కాని క్యాడర్ కి మొట్టమొదటిసారి మీమీద డౌట్ ఏర్పడిందేమో ఆలోచించండి. ఎక్కడో,ఏదో తేడా కొడతుంది అని వాళ్లకు అనిపించిందనుకో అది పార్టీ పై, మీపై విశ్వాసం సడలినట్లే సారూ. ఎందుకో అలా అనిపిస్తుంది. మీ క్యాడర్ ని జరా  ఒక్కసారి చెక్ చేసుకోండి.  సారూ,ఇన్ని షాకులు ఇస్తున్న మీరు ఇంకో షాక్ కూడా ఇస్తే జనం ఖుషీ అవుతారు.

    సెప్టెంబర్ 17 గుర్తుందా సారూ , ఆ షాక్ కూడా ఇవ్వరా?

    ఇన్ని షాకుల మీద షాకులిచ్చే మీరు ఇంకో పెద్ద షాక్ ఇస్తే శాశ్వతంగా పడిపోతాము. అదే సారూ ‘ నీ బాంచను దొరా కాల్మొక్తా ‘ అనే మాటను అనకుండా చేసిన సెప్టెంబర్ 17వ తేదీ పండగని కూడా పనిలో పనిగా ఇంకో షాక్ ఇచ్చారనుకో నిజంగానే మీ దొడ్డ మనస్సుకి శాశ్వతంగా దండాలు పెడతాము. యాదుంది కదా సారూ ఆ పండగేంటో? అయినా మీకు యాదు లేకపోవటమేమిటి? తెలంగాణా చరిత్రని ఆపోషణ పట్టినవాళ్ళు ఆమాత్రం యాదు లేదంటే నమ్మలేం. తెలంగాణా ప్రజలే కాదు దేశం మొత్తం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుంది. జరా ఆ షాక్ కూడా ఇవ్వరూ. ఇప్పటికే మీరిచ్చిన షాకులకి మాకు మతి పోతుంది. ఆ పెద్ద షాక్ ఇచ్చారనుకోండి మాకు నిజంగానే మతి పోద్ది. రాజకీయాల్లో మీకు అడ్డుండదు. మాకు ఎటూ మతులు పోతాయి కాబట్టి మీ కొడుకుని ముఖ్యమంత్రి చేసినా ఇంకేమీ మాట్లాడములెండి. చివరగా ఒకమాట ఆ పెద్ద షాక్ ఇచ్చిన సందర్భంలో మాట్లాడుతూ నిజాంని మాత్రం పొగడకండే. అలవాటులో పొరపాటులాగా సందర్భం మర్చిపోయి పాత పద్దతిలో నిజాంని పొగుడుతారేమోనని మీ మంచి కోసమే చెబుతున్నా సారూ. ఇంతకీ మా పెద్ద పండగ షాక్ ఇస్తారు కదా. మాకు నమ్మకముంది మామంచి దొడ్డ మనసు కదా. అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకు కోర్కెలు తీర్చే మీరు మా అందరి కోర్కె, తెలంగాణా ప్రజల గుండె ఘోష అయిన ఈ పెద్ద షాక్ ని కూడా ఇస్తారని గంపెడాశతో ఎదురుచూస్తూ ఉంటాము సారూ…