Dharmana Prasada Rao: ఈమధ్య సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట గాడి తప్పుతోంది. జగన్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపేలా ఆయన వ్యాఖ్యలు సాగుతున్నాయి. దీంతో సొంత పార్టీలోనే ధర్మాన్ని తీరుపై విస్మయం వ్యక్తం అవుతోంది. వైసిపి కార్యక్రమాల్లో తరచూ సైకిల్ ప్రస్తావన తెస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఏ పార్టీకి ఓటు వేస్తవమ్మ అని అడుగుతున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేస్తామని వారు చెబుతుండడంతో షాక్ కు గురవుతున్నారు. అసలు పార్టీ కార్యక్రమంలో మన ప్రభుత్వ గొప్పతనాన్ని చెప్పుకోవాలి కానీ.. ప్రత్యర్థి పార్టీకి ఉచిత ప్రచారం కల్పించడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఉత్తరాంధ్రకు మద్దతుగాధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేశారు. విశాఖ రాజధానితో ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారిపోతాయని చెప్పుకొచ్చారు. కానీ ప్రజలు మాత్రం ఆయన మాటలను పెద్దగా విశ్వసించలేదు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమయంలో సైతం ప్రజలకు పలు రకాలుగా విజ్ఞప్తి చేశారు. కానీ విద్యాధికులు, ఉద్యోగ ఉపాధ్యాయుల మాత్రం కనీసం పరిగణలోకి తీసుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ వైసీపీ అభ్యర్థి ఓటమి అనేకంటే.. మంత్రుల ఓటమిగానే చెప్పుకోవాల్సి ఉంటుంది.అయినా సరే మంత్రుల వ్యవహార శైలిలో మార్పు రావడం లేదు.ముఖ్యంగా ఆచితూచి మాట్లాడే ధర్మాన సైతం.. పార్టీకి సంబంధం లేని మాటలు చెప్పి.. హై కమాండ్ ను ఇరుకున పెడుతున్నారు.
వైసీపీ సామాజిక సాధికార యాత్ర జరుగుతున్న సంగతి తెలిసిందే. విశాఖలో జరిగిన బస్సు యాత్రలో ధర్మాన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రోడ్లు బాగా లేవని వచ్చే ఎన్నికల్లో వైసీపీని వద్దనుకోవద్దని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? అని ప్రశ్నించారు. అసలు రోడ్లు వల్ల ఉపయోగం లేదన్నట్లు మాట్లాడారు. ఒకవైపు జగన్ అధికార పత్రిక సాక్షిలో రోడ్లకు ప్రాధాన్యమిస్తున్నట్లు కథనాలు వండి వార్చుతున్నారు. ధర్మాన వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం.. ఏపీలో అసలు రహదారుల నిర్మాణమే చేపట్టలేదని ఒప్పుకున్నట్లు అయ్యింది. ఇలా మంత్రి రివర్స్ లో వస్తుండడంతో ఆయన ఏమైనా వేరే ఆలోచనతో ఉన్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తమ ప్రభుత్వం గురించి చెప్పుకోవచ్చు కానీ.. ఇలా ప్రతి అంశంలోనూ జగన్ వైఫల్యాన్ని ధర్మాన బయట పెట్టడం ఎంతవరకు సమంజసమని సొంత పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఆయన తీరును అనుమానిస్తున్నాయి. గతంలో జగన్ టార్గెట్ చేసుకొని ధర్మాన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నాయి. మొత్తానికైతేఈ సీనియర్ మంత్రి జగన్ కు ఒక రకమైన ఇబ్బంది పెడుతున్నారు.