Punjab Election Result 2022: రాజకీయాల్లో అత్యుత్సాహం, ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు పనిచేయవు. ఎందుకంటే ఒకసారి ప్రజల్లో వీరి పట్ల చెడు భావన ఏర్పడిందంటే మాత్రం ఫలితాలు తారుమారైపోతాయి. మహా మహులు సైతం విర్రవీగి చివరకు చావు దెబ్బ తిన్నారు. ఇప్పుడు పంజాబ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే తయారయింది. మేమే గెలుస్తామంటూ చెప్పి చివరకు అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ. ఎవరు వచ్చినా సరే మేమే గెలుస్తాం అంటూ చెప్పుకొచ్చారు.

కానీ అన్ని రాష్ట్రాల్లో లాగే పంజాబ్ లో కూడా సొంత పార్టీ నేతల ఆధిపత్య రాజకీయాలు చివరకు ఆ పార్టీని నిండా ముంచేశాయి. అసలు పోటీ ఇస్తుందా అనుకున్న ఆప్ పార్టీ పంజాబ్ లో పాగా వేసేసింది. ఏకంగా సింగిల్ మెజార్టీతో సీఎం కుర్చీని లాగేసుకుంది. ఇక బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ బీజేపీకి మొదటి నుంచి పట్టు లేదు. కానీ సిక్కులను తమ గుప్పిట్లో పెట్టుకున్నామని అనుకున్న కాంగ్రెస్ ఇంత దారుణంగా ఓడిపోవడమే అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
పంజాబ్ లో ఉన్న 117 సీట్లకు ఆప్ పార్టీకి ఏకంగా 92సీట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్‌కు 18 సీట్లు, బీజేపీకి 2 సీట్లు వచ్చాయి. ఆప్‌కు ఇంతటి భారీ మెజార్టీ రావడం అంటే మామూలు విషయం కాదు. అయితే చేతులారా కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిందని తెలుస్తోంది. కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు ఆ పార్టీని మట్టి కరిపంచాయి. ముఖ్యంగా సీఎం చన్నీకి, మాజీ క్రికెటర్ సిద్ధూకు ఉన్న విభేదాలు కాస్తా.. పార్టీని రెండుగా చీల్చేశాయి.
దీంతో వారి మీద ప్రజలకు నమ్మకం కోల్పోయింది. వారు వారే విమర్శలు చేసుకుని పార్టీ పరువును తీసుకున్నారు. దీంతో ఈ ఆందోళన కాస్తా ప్రజలకు ఆప్ పార్టీ మీద అభిమానం పెరిగేలా చేసింది. ఎలాగూ బీజేపీని వారు వ్యతిరేకిస్తారు కాబట్టి కాంగ్రెస్ ఇలా బలహీన పడటంతో వారు ప్రత్యామ్నాయంగా ఆప్ వైపు చూశారు. పైగా ఢిల్లీలో కేజ్రీవాల్ చేస్తున్న అభివృద్ధి కూడా వారిని ఆప్ వైపు చూసేలా చేసింది.
ఇక పంజాబ్ లో రైతు ఉద్యమం బీజేపీ కొంపముంచింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతులు చేసిన ఈ ఉద్యమాన్ని పెడచెవిన పెట్టింది. ఓన్ చేసుకోలేదు. కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో ఆందోళన చేసిన రైతులకు మద్దతుగా సకల సౌకర్యాలు కల్పించాడు. వారి ఉద్యమానికి తోడుగా నిలిచాడు. బీజేపీపై పోరాడాడు. రైతులను కడుపులో పెట్టుకొనిచూసుకున్నాడు. అందుకే
పంజాబ్ రైతులు కేజ్రీవాల్ ను గెలిపించి కృతజ్ఞత చూపించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కాంగ్రెస్ లో కుమ్ములాటలు.. సీఎం కుర్చీ కోసం చన్నీ, సిద్ధూ గేమ్ .. అమరీందర్ పార్టీని వీడడంతో ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఈ కుమ్ములాటల రాజకీయాలకు స్వస్తి పలికి క్లీన్ పాలిటిక్స్ చేసే ఆమ్ ఆద్మీని గెలిపించారు. బీజేపీ రైతు ఉద్యమం కారణంగా పూర్తిగా పక్కనపెట్టారు.

ఆప్ అధికారంలోకి రావడానికి మరో బలమైన కారణం కామెడీ కింగ్ భగవంత్ మన్. ఆయన ఎన్నికల సమయంలో తాను కేజ్రీవాల్ ఆలోచనలను కాకుండా.. తన సొంత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ ఇచ్చిన హామీలే ఓట్ల వర్షం కురిపించాయి. సొంత నిర్ణయాలతో ప్రజల కష్టాలను తీరుస్తానంటూ హామీలు గుప్పించారు.
ఇన్ని రోజులు కామెడీతో ఆకట్టుకున్న భగవంత్.. ఇప్పుడు తన మార్క్ రాజకీయంతో పార్టీని నడిపించారు. పైగా అన్ని పార్టీల నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటు ప్రజల్లో కూడా కాంగ్రెస్ పట్ల నమ్మకం సన్నగిల్లడం అన్ని రకాలుగా ఆప్ పార్టీకి కలిసి వచ్చింది. కానీ రేపు పొద్దున కేజ్రీవాల్ చెప్పినట్టు భగవంత్ వింటారా లేదంటే సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారా అన్నది పెద్ద ప్రశ్న.
ఒకవేళ తన సొంత నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటే బెటరే. కానీ కేజ్రీవాల్ ఎక్కువగా ఆడించారంటే మాత్రం అది పంజాబ్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారనే ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రచారం చేసే ప్రమాదం ఉంటుంది. మరి భగవంత్ ఎలాంటి నిర్ణయాలతో ముందకు వెల్తారో చూడాలి.