UP Election Result 2022: కాషాయ లాల్చి పైజామా డ్రైస్సు .. ముహంపై చిరునవ్వు.. ఇంకా యువకుడిలాగానే కనిపించే.. ఆదిత్య యోగీనాథ్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగానే పోటీ చేశారు. త్వరలో రెండోసారి సీఎం పీటమెక్కుతారు. కానీ ఆయన గురించి దేశ వ్యాప్తంగా చర్చలు పెడుతున్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో రికార్డు బద్దలు కొట్టి రెండో సారి సీఎం అయిన ఘనత యోగికి మాత్రమే దక్కుతుంది. అంతేకాకుండా తనపై ఎన్నో ఆరోపణలు.. ఒత్తిడి ఉన్నా వాటిని ఛేదించుకొని మెజారిటీ సీట్లు సాధించి పేరు సంపాదించాడు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తరువాత.. కాబోయే ప్రధాని అని పేరు తెచ్చుకున్న యోగి సీఎం గా చేసిన కొన్ని సంస్కరణలు అద్భుత ఫలితాలిచ్చాయి. అందుకే ఆయన పక్షాన ప్రజలు ఉండి రెండోసారి సీఎం కూర్చునే విధంగా చేశారు.

ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం వెలవడ్డాయి. ఇందులో ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ పైనే చర్చసాగుతోంది. ఎందుకంటే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వచ్చే నేషనల్ ఎలక్షన్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో యూపీ బీజేపీ వశం కావడంతో బీజేపీలో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. ఒకదశలో వ్యవసాయ చట్టాలతో యూపీలో బీజేపీకి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గెలుపు ఊహించినా మెజారిటీ రాకపోవచ్చన్న వాదనలు వినిపించాయి. కానీ అనుకున్న మెజారిటీ కమలం పార్టీ సాధించడంతో ఇక ఆ పార్టీకి అడ్డూ అదుపు లేనట్లేనని తెలుస్తోంది. అయితే యూపీలో యోగి చరిష్మాతో పాటు నరేంద్ర మోదీ హవా కూడా సాగిందని అంటున్నారు. కానీ యోగి చేపట్టిన కొన్ని సంస్కరణలు మరోసారి బీజేపీకి అధికారంలోకి తెచ్చాయి. అవేంటో చూద్దాం..
Also Read: బీజేపీ జమిలి ఎన్నికలకు సిద్ధమేనా?
బీజేపీపై మాములుగానే యువతలో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక 49 ఏళ్ల యోగిని రాజకీయంగా యువకుడు అనే పిలుస్తారు. అందువల్ల యూత్ ను యోగి బాగా ఆకర్షించారు. యువతకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతటి వివాదాస్పద అంశమైనా సుత్తి లేకుండా సూటిగా చెప్పడం యోగికి ఉన్న ప్రత్యేకత. దీంతో ఆయన సాధారణ రాజకీయ నాయకుడిగా కనిపించడు. ఈ లక్షణం యువతకు బాగా నచ్చింది. ఇక యోగిపై వ్యక్తిగత ఆరోపణలు లేవు. అంతేకాకుండా ముఖ్యమైన మంత్రిత్వ శాఖలన్నీ తన దగ్గరే పెట్టుకున్నారు. అవినీతికి ఆస్కారమున్న హోం, రెవెన్యూ,హౌసింగ్, మైన్స్ వంటి కీలక శాఖలు యోగి వద్దే ఉంటాయి. యోగితో పోలిస్తే ఆయన ప్రత్యర్తి అఖిలేశ్ యాదవ్ కుటుంబంపై అనేక ఆరోపణలున్నాయి.

యోగికి మహిళా ఓట్లు బాగా పడ్డాయి. అందుకు నేరాలపై తీసుకున్న కఠిన నిర్ణయాలే. హోంశాఖ తనవద్దే ఉండడంతో లాండ్ ఆర్డర్ ను అదుపులో ఉంచారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే నేరగాళ్లకు అడ్డగా పేర్కొన్నారు. కానీ యోగి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 182 మంది నేరస్థులను హతమార్చారు. 4,206 మంది నేరస్థులపై కాల్పులు జరిపారు. 21,625 మందిని జైళ్లలోనే ఉంచారు. మొత్తంగా 72 శాతం బందిపోటు ఘటనలు, 62 శాతం దోపిడీలు, 31 శాతం హత్యలు, 50 శాతం అత్యాచారాలు తగ్గినట్లు ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. దీనికి తోడు అత్యవసర సమయాల్లో సంక్షేమ పథకాలను విరివిగా అమలు చేశారు. కొవిడ్ సమయంలో ఉచిత రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు వంటివి మహిళలను ఆదుకోవడంతో మహిళా ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయి. అఖిలేష్ యాదవ్ కు 15 శాతానికి తక్కువగానే ఓట్లు పడ్డాయి.
ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి రావాలంటే కుల సమీకరణాలు బాగా తెలిసి ఉండాలి. సమాజ్ వాదీ పార్టీకి యాదవ, బీఎస్పీకి జాతవ్ కులాలు మద్దతునిస్తూ వస్తున్నాయి. ఈ కులాల నుంచి ఓట్లు రావని బీజేపీ గ్రహించింది. అందుకే ఇతర కులాలను పూర్తిగా తనవైపు తిప్పుకుంది. మొత్తంగా 21 శాతం ఉన్న దళిత కులాలు ఉండగా.. వారిలో బేబీరాని మౌర్య, దుష్యంత్ గౌతమ్ వంటి దళిత దిగ్గజాలను కమలం తరుపున బరిలోకి దింపారు. దీంతో బీజేపీకి గెలుపు సులభం అయింది. ఇలా కేంద్రం, యోగి సర్కార్ లు కలిసి యూపీని మొత్తానికి చేజిక్కించుకున్నారు.
Also Read: అంత వ్యతిరేకతలోనూ యూపీలో బీజేపీ ఎలా గెలిచింది? యోగికి కలిసివచ్చిందేంటి?