5 State Election Results 2022: దేశ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎంతో కీలకం. మొదటి నుంచి అందరి చూపు బీజేపీ మీదనే ఉంది. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలంటే యూపీలో గెలవాలి. కానీ యూపీలో బీజేపీ గెలిచే అవకాశాలు లేవని చాలామంది విశ్లేషకులు భావించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా కేంద్రం మీద ఒంటి కాలితో లేస్తున్నాడు. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా కేంద్రాన్ని నిలదీస్తూ ఫుల్ ఫైర్ అవుతున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే అసలు బీజేపీ ఓడిపోతుందని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో రాలేదనే నమ్మకంతో చెడుగుడు ఆడుకోవాలని చూస్తున్నారు. కానీ ఈ రోజు విడుదలైన ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేసేశాయి. ఒక రకంగా చెప్పాలంటే తమను విభేదిస్తున్న ప్రాంతీయ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చింది బీజేపీ పార్టీ.
యూపీ, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా దూసుకుపోతోంది. పూర్తి ఫలితాలు రాకముందే చాలా రాష్ట్రాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. దీంతో ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారానికి తిరుగులేదని తెలిసిపోతోంది. మరి ఈ ఫలితాలతో తెలంగాణలో మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది.
ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఇక ఫలితాలు కూడా పార్టీకి అనుకూలంగా వచ్చాయి కాబట్టి మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో నాలుగు చేజిక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ వేవ్ కచ్చితంగా తెలంగాణ మీద పడుతుంది. ఇప్పటికే తెలంగాణలో ప్రజల్లోకి దూసుకెళ్తోంది బీజేపీ పార్టీ.

2023 ఎన్నికలే టార్గెట్ గా పనిచేస్తున్న బీజేపీకి.. ఇప్పుడు వచ్చిన ఫలితాలు పెద్ద అస్త్రంగా మారాయనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఇప్పుడు బీజేపీకి పాజిటివ్ వేవ్ కనిపిస్తోంది. వచ్చే ఏడాదే తెలంగాణలో ఎన్నికలు జరగడం ఖాయం. ఈ క్రమంలో తెలంగాణలో కూడా అధికారం కోసం మోడీ, అమిత్ షాలు దూకుడుగా వ్యవహరిస్తారని అర్థం అవుతోంది. సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్‌కు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ, హామీలు ఇచ్చే అధికారం ఇచ్చారంటే మాత్రం.. ఆ పార్టీని అడ్డుకోవడం టీఆర్ ఎస్‌కు కష్టమే.
అయితే కేసీఆర్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో బీజేపీని ఎదుర్కోవాలని చూస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు పాజిటివ్ వేవ్ తీసుకురావడం అంటే కష్టం. పైగా ఇతర రాష్ట్రాల్లో వస్తున్న ఫలితాలు బీజేపీకే ప్లస్ అవుతున్నాయి. మొత్తంగా చూస్తుంటే కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్‌కు.. ఇది పెద్ద ఎఫెక్ట్ అనే చెప్పుకోవాలి.